Share News

ఉసురు తీసిన సరదా

ABN , Publish Date - Aug 20 , 2025 | 01:21 AM

ద్దరు స్నేహితుల సరదా వారి ప్రాణాలను బలి తీసుకుంది. రెండు కుటుంబాలకు కడుపు కోతను మిగిల్చింది. ఈ ఘటన కనిగిరి మండలంలోని పునుగోడు వద్ద మంగళవారం వెలుగు చూసింది.

ఉసురు తీసిన సరదా
విలపిస్తున్న మృతుల కుటుంబ సభ్యులు (ఇన్‌సెట్‌లో) శివప్రసాద్‌, ఎల్లయ్య (ఫైల్‌)

చెరువులో ఈతకు వెళ్లి తెప్ప ఎక్కిన ఇద్దరు విద్యార్థులు

అది బోల్తా పడటంతో మృత్యువాత

రెండు కుటుంబాలకు కడుపు కోత

కనిగిరి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : ఇద్దరు స్నేహితుల సరదా వారి ప్రాణాలను బలి తీసుకుంది. రెండు కుటుంబాలకు కడుపు కోతను మిగిల్చింది. ఈ ఘటన కనిగిరి మండలంలోని పునుగోడు వద్ద మంగళవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కనిగిరిలోని నక్కలతిప్ప ప్రాంతానికి చెందిన బొందలపాటి శివ ప్రసాద్‌ (19), శంఖవరం గ్రామానికి చెందిన ఏనుగంటి ఎర్రయ్య (18) స్నేహితులు. వీరి రువురూ స్థానిక ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నారు. సీఎస్‌పురంలోని భైరవకోన జలపాతాన్ని చూసేందుకు వెళుతున్నామంటూ ఆదివారం ఉదయం శివప్రసాద్‌ వాళ్ల నాయనమ్మకు చెప్పి బైక్‌పై వెళ్లారు. కానీ స్నేహితులకు మాత్రం ఈత కొట్టేందుకు వెళ్తున్నామని తెలిపారు. మంగళవారం మధ్యా హ్నం పునుగోడు చెరువులో శవాలై తేలారు.

పునుగోడు చెరువులో పడి..

భైరవకోనకు అని బయల్దేరిన శివప్రసాద్‌, ఎర్రయ్య పునుగోడు గ్రామంలోని చెరువు వద్దకు వెళ్లారు. వారి బైక్‌ను, వారి వద్ద ఉన్న రెండు సెల్‌ఫోన్‌లను ఒడ్డున ఉంచి అక్కడే ఉన్న తెప్పను తీసి దానిలో ఎక్కారు. చెరువులో కొంతదూరం వెళ్లాక తెప్ప తిరగబడటంతో చెరువులో పడిపోయారు. ఈత రాకపోవడంతో మృతిచెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఒడ్డున ఉన్న సెల్‌ఫోన్లను చెరువును చూడటానికి వచ్చిన సీఎస్‌పురం ప్రాంతానికి చెందిన వ్యక్తులు తీసుకుని అక్కడి పోలీస్‌స్టేషన్‌లో అప్పజెప్పారు. సీఎస్‌పురం ఎస్‌ఐ నాయక్‌ ఇచ్చిన సమాచారంతో కనిగిరి పోలీసులు మంగళవారం చెరువు వద్దకు చేరుకున్నారు. మత్స్యకారులను విచారించగా తమ తెప్ప నీటి మధ్యలో తిరగబడి ఉందని, వెళ్లి తెచ్చుకున్నామని తెలిపారు. దీంతో గజ ఈతగాళ్లను పిలిపించి వెతికించగా విద్యార్థుల మృతదేహాలు దొరికాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేగటంతోపాటు మృతుల కుటుంబాల్లో విషాదచాయలు అలముకున్నాయి. డీఎస్పీ సాయిఈశ్వర్‌యశ్వంత్‌, సీఐ ఖాజావలి, ఎస్‌ఐ టి.శ్రీరాం, ఏఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్‌ రవిశంకర్‌, పోలీసు, రెవెన్యూ సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Aug 20 , 2025 | 01:21 AM