Share News

శ్రీకర శుభకర ప్రణవ స్వరూప..

ABN , Publish Date - Mar 13 , 2025 | 11:51 PM

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పృథులగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజైన గురువారం జరిగిన గరుడసేవ ఉత్సవానికి భక్తులు పోటెత్తారు.

శ్రీకర శుభకర ప్రణవ స్వరూప..
ప్రత్యేక అలంకరణలో లక్ష్మీనరసింహస్వామి మూలవిరాట్‌(ఇన్‌సెట్లో)పృథులగిరి క్షేత్రం

లక్ష్మీనరసింహుడు.. గరుడారూరుడైన వేళ

పృథులగిరికి పోటెత్తిన భక్త జనం

లక్ష్మీనరసింహ నామంతో మార్మోగిన క్షేత్రం

మర్రిపూడి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పృథులగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజైన గురువారం జరిగిన గరుడసేవ ఉత్సవానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రత్యేక వాహనాల్లో భక్తులు తరలివచ్చారు. భక్తులు తలనీలాలు సమర్పించి స్వామి పుష్కరణిలో స్నానమాచరించారు. పొంగళ్లు వండి బోణాలను తలపై ఉంచుకొని స్వామి దర్శనానికి మండుటెండను సైతం లెక్కచేయకుండా పృథులగిరి సోపానాలపై దర్శనం కోసం బారులుదీరారు. ప్రధాన అర్చకులు నారాయణం వెంకటరమణాచార్యులు, మారుతీ ఆచార్యులు, విఖానస ఆచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయం ప్రకారం బ్రహ్మోత్సవ వేళ హోమాలు చేసి, నైవేద్యాలు సమర్పించారు. రాత్రి అలవల కుటుంబీకుల ఆధ్వర్యంలో లక్ష్మీనరసింహాస్వామి ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై మాడవీధులలో ఊరేగించారు. కార్యనిర్వాహక అధికారి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.


శోభాయమానంగా...

రంగురంగుల విద్యుత్‌ దీపాల కాంతులతో పృథులగిరులు శోభాయమానంగా వెలుగొందాయి. వివిధ కులసంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. కొండపై కొలువైన పార్వతీసమేత రామలింగేశ్వరస్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మర్రిపూడి వైద్యాధికారి వీరబాబు ఆధ్వర్యంలో వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్‌ స్వామివారిని దర్శించుకున్నారు. సీఐ సోమశేఖర్‌, ఎస్‌ఐ రమే్‌షబాబుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పటిష్ట బందోబస్త్‌ను ఆయన పరిశీలించారు.

Updated Date - Mar 13 , 2025 | 11:51 PM