తొలి విడత విచారణ తూచ్
ABN , Publish Date - Sep 11 , 2025 | 02:13 AM
జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం విధించిన సెక్షన్ 51 విచారణ నీరుగారే పరిస్థితి కనిపిస్తోంది. అందుకు విచారణాధికారిగా నియమితులైన సహకార శాఖ అదనపు కమిషనర్ గౌరీశంకర్ తొలివిడతగా మంగళ, బుధవారాల్లో చేపట్టిన విచారణే నిదర్శనం.
రెండు రోజుల షెడ్యూల్‌లో రెండు గంటలు కూడా సాగని వైనం
నీరుగారనున్న డీసీసీబీలో సెక్షన్ 51 విచారణ
ఒంగోలు, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం విధించిన సెక్షన్ 51 విచారణ నీరుగారే పరిస్థితి కనిపిస్తోంది. అందుకు విచారణాధికారిగా నియమితులైన సహకార శాఖ అదనపు కమిషనర్ గౌరీశంకర్ తొలివిడతగా మంగళ, బుధవారాల్లో చేపట్టిన విచారణే నిదర్శనం. రెండు రోజుల ఆయన షెడ్యూల్‌లో కనీసం రెండు గంటలు కూడా బ్యాంకులో విచారణ చేపట్టలేదు. రెండో రోజైన బుధవారం ఉదయం ఒంగోలు రూరల్ మండలం కరవది పీఏసీఎస్‌లో ఎరువులను పరిశీలించిన గౌరీశంకర్... అనంతరం డీసీవో ఇందిరాదేవితో కలిసి పీడీసీసీ బ్యాంకుకు వెళ్లారు. సహకారశాఖ అధికా రులకు తన షెడ్యూల్‌ను ఇచ్చే సమయంలోనే బ్యాంకు అధికారులకు కూడా విచారణాధికారి అవసరమైన రికార్డులు అందుబాటులో ఉంచాలని నోటీసు ఇవ్వాలి. అయితే ప్రస్తుత విచారణాధికారి అలాంటి నోటీసు కూడా బ్యాంకు అధికారులకు ముందుగా పంపలేదని సమాచారం. అంతేకాక విచారణలో ఆయనకు సహాయకులుగా ఎన్టీఆర్ జిల్లాలోని ఒక డీఎల్‌సీవోను, గుంటూరులోని ఒక అసిస్టెంట్ రిజిస్ట్రార్‌ను కేటాయిస్తూ కమిషనర్ ఉత్తర్వులు ఇవ్వగా వారిని కూడా తన వెంట తీసుకొని రాలేదని తెలిసింది. మొత్తం మీద రెండు రోజుల షెడ్యూల్‌లో బుధవారం మధ్యాహ్నం పీడీసీసీ బ్యాంకుకు వెళ్లి కొద్దిసేపు మాత్రమే ఉన్న ఆయన అప్పుడు బ్యాంకు అధికారులకు నోటీసు ఇచ్చినట్లు తెలిసింది. అనంతరం డీసీవో కార్యాలయానికి వెళ్లి సాయంత్రం తిరిగి గుంటూరు వెళ్లిపోయారు. ఇదేసమయంలో పీడీసీసీ బ్యాంకుపై సెక్షన్ 51 విచారణకు స్థానికంగా కీలకంగా ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే సానుకూలంగా లేడన్న సంకేతాలు బ్యాంకు పరిస్థితిని బట్టి కనిపిస్తున్నాయని, అలా అయితే విచారణ కొనసాగించడం అవసరం లేదన్న రీతిలో ఆయన కొందరితో మాట్లాడినట్లు సహకార శాఖ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. మొత్తం మీద గత వైసీపీ ప్రభుత్వంలో పెద్దఎత్తున బ్యాంకులో అక్రమాలు జరిగాయని సీఎంకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫిర్యాదు చేయడం, మంత్రి డాక్టర్ స్వామి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడిన ఫలితంగా కలెక్టర్ నియమించిన త్రిసభ్య కమిటీ ప్రాథమిక విచారణలో అక్రమాలు గుర్తించింది. సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించిగా అది నీరుగారే పరిస్థితి కనిపిస్తోంది.