ఆర్థిక సంఘం నిధులొచ్చాయ్!
ABN , Publish Date - Sep 04 , 2025 | 01:16 AM
గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు విడుదల య్యాయి. దీంతో అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి. గత కొంత కాలంగా పంచాయతీల్లో నిఽధులు లేకపోవడంతో చిన్న పని చేపట్టాలన్నా కష్టతరంగా మారింది.
జిల్లాలో 729 గ్రామ పంచాయతీల ఖాతాలకు రూ.41.98 కోట్లు జమ
తాగునీరు, పారిశుధ్యానికి ప్రాధాన్యం
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు విడుదల య్యాయి. దీంతో అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి. గత కొంత కాలంగా పంచాయతీల్లో నిఽధులు లేకపోవడంతో చిన్న పని చేపట్టాలన్నా కష్టతరంగా మారింది. పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు 2024-25 సంవత్సరానికి సంబంధించి రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిఽధులు రూ.1,120 కోట్లను విడుదల చేసింది. వీటిని పంచాయతీ, జిల్లా మండల పరిషత్ ఖాతాలకు నేరుగా జమ చేసింది. ఈ నిధులను ఏఏ అవసరాలకు వినియోగించాలో స్పష్టంగా పేర్కొంది.
వేగవంతం కానున్న అభివృద్ధి పనులు
జిల్లావ్యాప్తంగా 729 గ్రామపంచాయతీల ఖాతాల్లో రూ.41.98 కోట్లు జమయ్యాయి. అందులో 50శాతం నిధులను తాగునీటికి, పారిశుధ్యంకు వినియోగించాలి. మిగిలిన 50శాతం నిధులను వివిధ రకాల అభివృద్ధి పనులకు వినియోగించుకునేందుకు ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించింది. ఇప్పటికే స్వచ్ఛంధ్రలో భాగంగా పారిశుధ్యంపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నెలలో ఒక శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడంతో గ్రామ పంచాయతీల్లో పలురకాల అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి. ప్రస్తుతం విడుదల చేసిన నిధులను ఒక్కో పంచాయతీకి స్థాయిని బట్టి రూ.80వేల నుంచి రూ.10 లక్షల వరకు నగదు జమ కానుంది.
చంద్రబాబు, పవన్‌కు కృతజ్ఞతలు
బెజవాడ శ్రీరామమూర్తి, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు
గ్రామపంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు. గత ఆరు నెలల నుంచి ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడంతో పంచాయతీల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయడంతో పలురకాల అభివృద్ధి పనులు చేసేందుకు అవకాశం ఏర్పడింది.