అన్నదాత ‘ఖుషీ’భవ
ABN , Publish Date - Nov 20 , 2025 | 01:17 AM
జిల్లావ్యాప్తంగా బుధవారం అన్నదాతల్లో సంబరం కనిపించింది. రెండో విడత అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకాల ద్వారా నగదు సాయం అందజేత కార్యక్రమం కోలాహలంగా సాగింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో గ్రామ స్థాయిలో ఉండే రైతు సేవా కేంద్రం (ఆర్‌ఎస్‌కే)ల వద్ద ప్రత్యక్షంగా సభలు, సమావేశాలు నిర్వహించారు.
కోలాహలంగా ‘అన్నదాత సుఖీభవ’ విడుదల
జిల్లా అంతటా ఆర్‌ఎస్‌కే స్థాయిలో కార్యక్రమాలు
ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సభల ప్రత్యక్ష ప్రసారం
మర్రిపూడిలో పాల్గొన్న మంత్రి స్వామి, సత్య, కలెక్టర్
ఇతరచోట్ల ప్రజాప్రతినిధులు, కీలక నేతలు హాజరు
2.68 లక్షల మంది రైతులకు రూ.180.36 కోట్లు జమ
ఒంగోలు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా బుధవారం అన్నదాతల్లో సంబరం కనిపించింది. రెండో విడత అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకాల ద్వారా నగదు సాయం అందజేత కార్యక్రమం కోలాహలంగా సాగింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో గ్రామ స్థాయిలో ఉండే రైతు సేవా కేంద్రం (ఆర్‌ఎస్‌కే)ల వద్ద ప్రత్యక్షంగా సభలు, సమావేశాలు నిర్వహించారు. పెద్దసంఖ్యలో లబ్ధిదారులైన రైతులు పాల్గొన్నారు. తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోదీ, కడప జిల్లాలో సీఎం చంద్రబాబునాయుడు ఈ సంద ర్భంగా సభల్లో పాల్గొనగా వాటి ప్రత్యక్ష ప్రసారాన్ని ఆర్‌ఎస్‌కేలలో స్మార్ట్ టీవీల ద్వారా రైతులు ఉత్సాహంగా తిలకించారు. జిల్లాలో ఈ విడత 2.68 లక్షల మందికి రూ.180.36 కోట్ల నగదు వారివారి ఖాతాలకు జమ కావడం బుధవారం ప్రారంభమైంది. ఇదిలాఉండగా ఆర్‌ఎస్‌కే స్థాయిలో ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేసినప్పటికీ నియోజక వర్గానికి ఒకచోట కార్యక్రమాలు, రైతులతో సభలను ఏర్పాటు చేసి కీలక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. తదనుగుణంగా జిల్లాలోనూ నిర్వహించారు.
ట్రాక్టర్లతో ర్యాలీ, నేతల సందడి
కొండపి నియోజకవర్గస్థాయి కార్యక్రమాన్ని మర్రిపూడిలో ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామితోపాటు మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, కలెక్టర్ రాజాబాబు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి సీహెచ్ శ్రీనివాసరావు, ఇతర పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మర్రిపూడిలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి స్వామి, సత్యలు స్వయంగా ట్రాక్టర్లను నడిపి రైతులను మరింత ఉత్సాహపరిచారు. వెలిగండ్లలో జరిగిన కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పాల్గొన్నారు. గిద్దలూరు ఏఎంసీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అక్కడి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, తర్లుపాడులో జరిగిన కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, వైపాలెం మండలం గురిజేపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గుడూరి ఎరిక్షన్‌బాబు, కురిచేడు మండలం పొట్లపాడులో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి భాగస్వాములయ్యారు. అలాగే ఇతర ప్రాంతాల్లోనూ సంబరంగా కార్యక్రమం సాగింది.