వైసీపీ శ్రేణుల అత్యుత్సాహం
ABN , Publish Date - Jun 11 , 2025 | 11:37 PM
పొగాకు రైతుల సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా పొదిలి పట్టణంలోని పొగాకు వేలం కేంద్రంలోకి జగన్ వెళ్లిన సమయంలో పోలీసులు 208 మంది రైతులను 20మంది వైసీపీ నాయకులను మీడియాను మాత్రమే లోపలికి అనుమతించే విధంగా మొదట పోలీసులు ప్రణాళిక చేశారు.
పొగాకు బేళ్లు ధ్వంసం
జగన్ వెంట వేలం కేంద్రంలోకి చొరబాటు
అంతా ముక్కయిందని రైతుల ఆవేదన
పొదిలి, జూన్ 11 (ఆంధ్రజ్యోతి) : పొగాకు రైతుల సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా పొదిలి పట్టణంలోని పొగాకు వేలం కేంద్రంలోకి జగన్ వెళ్లిన సమయంలో పోలీసులు 208 మంది రైతులను 20మంది వైసీపీ నాయకులను మీడియాను మాత్రమే లోపలికి అనుమతించే విధంగా మొదట పోలీసులు ప్రణాళిక చేశారు. జగన్ వాహనం లోపలికి వచ్చిన సమయంలో కొందరిని మాత్రమే పోలీసులు లోపలికి అనుమతించి మిగిలిన వారిని గేటు బయట నిలిపేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో కార్యకర్తలు ప్రధాన గేటును నెట్టుకొని లోపలికి వచ్చే ప్రయత్నంలో గేటు గడి విరిగిపోయి ఆ పార్టీ కార్యకర్తలంతా లోపలికి చొచ్చుకొచ్చారు. వేలంకేంద్రంలోకి పొగాకు అమ్మకానికి తెచ్చుకున్న రైతులు చాలామంది లోపలికి వెళ్లలేక బయటే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బేళ్లు ఎక్కితొక్కి హడావుడి
ఏ రైతుల సమస్యలు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం జరిగిందో వారికే నష్టం కూడా మిగిల్చారు. వేలం కేంద్రంలోకి వచ్చిన శ్రేణులు సీఎం అంటూ నినాదాలు చేస్తూ అక్కడ అమ్మకానికి ఉంచిన పొగాకు బేళ్లపైకి ఎక్కి తొక్కారు. రైతులు ఎంతగా వారిని వారించినా ఎవ్వరూ అదుపు చేయలేకపోయారు. ఆ సమయంలో వారి వీరంగం కొంత భయానక వాతావరణాన్ని తలపించిందని కొందరు రైతులు చెప్పారు. అప్పటికే కొన్ని బేళ్లు రేటు పలికి ఉండగా, మరికొన్ని బేళ్లకు బయ్యర్లు అప్పటికి ఇంకా ధర నిర్ణయించలేదు. ఈ రెండు వరుసల్లోని బేళ్లను వైసీపీ కార్యకర్తలు తొక్కిన కారణంగా పొగాకుకు నష్టం వాటిల్లింది. కొన్ని బేళ్లు తొక్కిసలాట కారణంగా కొనుగోలు కాకుండా వెనక్కి పంపారు. తొక్కిన కారణంగా ముక్క ఆకుగా మారిందని రైతులు చెప్తున్నారు. ధర వేయకుండా వెనక్కి పంపడంతో గత్యంతరం లేక రైతులు ఆ బేళ్లను తిరిగి ఇళ్లకు తీసుకెళ్లారు. కొందరు రైతులు ధర పలికిన వారి బేళ్లలోని పొగాకు తొక్కిసలాటలో ధ్వంసమైంది. వేలం కేంద్రంలోని వాటర్‌ఫిల్టర్ కూడా ధ్వంసమైనట్లు చెప్పారు.
తొక్కిన కారణంగా ఆకు ముక్కగా మారింది
జగన్‌తో పాటు లోపలికి చొరబడి వచ్చిన కార్యకర్తలు పొగాకు బేళ్లపైకి ఎక్కి తొక్కారు. బేళ్లలోని ఆకు చెల్లాచెదరుగా పడిపోయింది. దానిని తెచ్చి మళ్లీ బేళ్లుగా సరిచేసుకుని అమ్మకానికి పెట్టాం. తీరా కొన్నిబేళ్లు ముక్క ఆకుగా చూపి బయ్యర్లు వెనక్కి పంపారు. విరిగిన పొగాకు గ్రేడింగ్ చేసుకున్నాక మళ్లీ అమ్మకానికి తెచ్చుకోవాలి.
- పి.చిన్ననారాయణ, రైతు
నన్ను లోపలికి అనుమతించలేదు
పొగాకు అమ్మకునేందుకు వేలం కేంద్రానికి తెచ్చి లోపల ఉం చిన నన్ను లోపలికి అనుమతించలేదు. అసలు రైతు అనేవారినే లోపలికి పంపకుండా కేవలం రాజకీయ నాయకులు లోపలికి వెళ్లి ఏ సమస్య తెలుసుకున్నారో అర్థం కావడం లేదు. కేవలం రాజకీయాల కోసం రైతుల సమస్యను అడ్డుపెట్టుకున్నట్లు కనిపిస్తోంది. లోపల తొక్కిసలాటలో పొగాకు కూడా ధ్వంసమైంది.
- వేల్పుల సుబ్బారావు, రైతు
సమస్య తీరుస్తామని సమస్య చేశారు
రైతుల సమస్యలు తీరుస్తామని వచ్చిన జగన్ పర్యటన మాకు సమస్యగా మార్చింది. అమ్మకానికి తెచ్చిన పొగాకు బేళ్లు కార్యకర్తల తొక్కిసలాట కారణంగా దెబ్బతిన్నాయి. రైతుకు నష్టం జరగుతుందన్న ఆలోచన అక్కడకు వచ్చిన వారిలో కనిపించలేదు. నా బేళ్లలో కూడా రిటన్ అయ్యాయి.
- పుట్టా నారాయణ, రైతు