చి‘వరి’కి నష్టాలే
ABN , Publish Date - Mar 11 , 2025 | 01:39 AM
విత్తిన నాటి నుంచి చేతికొచ్చేదాకా వ్యయ ప్రయాసల కోర్చి పండించిన పంటను అమ్ముకుందామని చూస్తే ధర లేకుండా పోయింది. ప్రభుత్వం మార్కెట్‌ను పట్టించుకోకపోగా ధాన్యం కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ప్రారంభం కాని ప్రభుత్వ కొనుగోలు కేంద్రం
లభించని మద్దతు ధర
వ్యాపారులు, దళారుల దగా
పట్టించుకోని అధికారులు
కనపర్తి ఎత్తిపోతల రైతు కన్నీరు
నాగులుప్పల పాడు, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : విత్తిన నాటి నుంచి చేతికొచ్చేదాకా వ్యయ ప్రయాసల కోర్చి పండించిన పంటను అమ్ముకుందామని చూస్తే ధర లేకుండా పోయింది. ప్రభుత్వం మార్కెట్‌ను పట్టించుకోకపోగా ధాన్యం కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం తీరుతో అప్పులు తీర్చుకునేందుకు రైతన్నలు గత్యంతరం లేక దళారులు చెప్పిన ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. వివరాల్లోకెళితే.. మండలంలోని అమ్మనబ్రోలు, వినోదరాయునిపాలెం, దాసరివారిపాలెం, చవటపాలెం, కనపర్తి, మాచవరం, రాపర్ల తదితర గ్రామాలకు చెందిన రైతులు కనపర్తి ఎత్తిపోతల పఽథకం పరిధిలో మాగాణి సాగు చేశారు. ఈ ఏడాది 4 వేల ఎకరాల్లో పంటను వేశారు. వర్షాలు బాగానే కురిసినా గుండ్లకమ్మ డ్యాం నుంచి దిగువన ఉన్న కనపర్తి ఎత్తిపోతల పథకం స్కీంకు సకాలంలో నీరు అందని పరిస్థితి నెలకొంది. చివరి భూముల పరిస్థితి మరీ దారుణం. దీంతో రైతులు భగీరఽథ ప్రయత్నాలు చేసి పంటను పండించారు. కానీ అమ్ముకునే సమయానికి ధర లేకుండా పోయింది.
ఊసే లేని కొనుగోలు కేంద్రం
అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోకపోవడంతో అన్నదాతకు కన్నీళ్లు మిగులుతున్నాయి. కనపర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో ఈ ఏడాది కేఎన్‌ఎన్1638, 1262, 1271, నెల్లూరు సన్నాలు రకం సాగు చేశారు. ఎకరానికి 40 బస్తాల వరకూ దిగుబడి వచ్చింది. 20 రోజుల నుంచి కోతలు నడుస్తున్నాయి. అయితే వచ్చిన పంటను కల్లాల్లోనే విక్రయించే ప్రయత్నంలో రైతులు ఉన్నారు. ఫిబ్రవరి 15 తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న అధికారులు ఆదిశగా చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. ఇదే అదనుగా దళారులు గద్దల్లా వాలిపోయి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో వారు చెప్పిన ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించిందని అన్నదాతలు వాపోతున్నారు.
లభించని మద్దతు ధర
1638 రకం. 76కేజీల బస్తాకు ప్రభుత్వం రూ.2,320 మద్దతు ధర ఇస్తుండగా దళారులు మాత్రం రూ.1,550 కొనుగోలు చేస్తున్నారు. 1262, నెల్లూరు సన్నాలు రకానికి రూ.1,770 మద్దతు ధర ప్రకటించగా వ్యాపారులు రూ.1,400కు మాత్రమే కొంటున్నారు. ఈ ప్రాంతంలో కోతలు ప్రారంభమైన నాటి నుంచి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ శాఖ జిల్లా మేనేజర్‌కు విన్నవించినా ఫలితం లేదు. మండల వ్యవసాయాధికారి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆ అంశం జిల్లా ఆధికారుల పరిధిలో ఉందని, తాను ఏం చేయలేనని చేతులెత్తేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించి కనపర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి వరికి మద్దతు ధర కల్పించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.