Share News

త్వరలోనే మార్కాపురం జిల్లా కల సాకారం

ABN , Publish Date - Aug 25 , 2025 | 11:50 PM

: పశ్చిమ ప్రకాశం ప్రజల చిరకాలవాంఛ అయిన మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు కల త్వరలోనే సాకారం కానుందని విద్యుత్‌, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్‌, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామిలు చెప్పారు.

త్వరలోనే మార్కాపురం జిల్లా కల సాకారం
మాట్లాడుతున్న మంత్రి స్వామి, పక్కన ఎమ్మెల్యే నారాయణరెడ్డి

26కల్లా వెలిగొండ ద్వారా నీళ్లు అందిస్తాం

జగన్‌ పార్టీ విమర్శలను నమ్మేస్థితిలో ప్రజలు లేరు

మంత్రులు రవికుమార్‌, స్వామి

మార్కాపురం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి) : పశ్చిమ ప్రకాశం ప్రజల చిరకాలవాంఛ అయిన మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు కల త్వరలోనే సాకారం కానుందని విద్యుత్‌, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్‌, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామిలు చెప్పారు. మార్కాపురం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ, పలు పీఏసీఎ్‌సల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం రాత్రి స్థానిక ఏఎంసీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్య్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు రవికుమార్‌, స్వామి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జిల్లాను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారన్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఉపసంఘం నివేదిక అందజేస్తుందన్నారు. మరో రెండు నుంచి మూడు నెలల్లోనే మార్కాపురం జిల్లా ప్రకటన వెలువడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే వెలిగొండ ప్రాజెక్టు ద్వారా 2026లో నీళ్లు ఇచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆధునిక సాంకేతిక పద్ధతులను అందిపుచ్చుకుంటూ మండలానికి రెండు డ్రోన్‌లను సబ్బిడీపై ప్రభుత్వం అందజేస్తోందన్నారు. బేస్తవారిపేట నుంచి ఒంగోలు వరకు నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేస్తామన్నారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అభ్యర్థన మేరకు మార్కాపురం నుంచి తర్లుపాడు వరకు డబుల్‌ రోడ్డు, మార్కాపురం చెరువు కట్ట అభివృద్ధికి తప్పకుండా నిధులు సాధించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇంతటి దుర్మార్గపు ప్రతిపక్షాన్ని ఎన్నడూ చూడలేదు

ఒక్కసారి అవకాశం ఇవ్వమని రాష్ట్రాన్ని రావణాకాష్టం చేసిన జగన్‌రెడ్డికి ఇంకా సిగ్గు రాలేదని ఎమ్మెల్యే కందుల చెప్పారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెడితే ఇంకా వారిని తప్పుదోవ పట్టించడానికి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారన్నారు. అర్హులైన ఏ ఒక్కరికీ పింఛన్‌ తొలగించే పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య, ఎమ్మెల్యేలు దామచర్ల జననార్దన్‌, బీఎన్‌ విజయ్‌కుమార్‌, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, వైపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు, నేత కడియాల లలిత్‌సాగర్‌, ఏఎంసీ చైర్మన్‌ మాలపాటి వెంకటరెడ్డి, పీఏసీఎస్‌ అధ్యక్షుడు రామాంజులరెడ్డి, నాసర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Aug 25 , 2025 | 11:50 PM