భారీవర్షాల బీభత్సం
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:50 AM
మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీవర్షాల ధాటికి గ్రామాలలో ఉన్న వాగులు, చెరువు లు పూర్తిస్థాయిలో నిండి పొంగి పొర్లుతున్నాయి.
బల్లికురవ, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీవర్షాల ధాటికి గ్రామాలలో ఉన్న వాగులు, చెరువు లు పూర్తిస్థాయిలో నిండి పొంగి పొర్లుతున్నాయి. కొంత కాలం నుంచి నీరు లేక ఒట్టిపోయిన వాగులు, వంకలు సైతం నీటితో కళకళలాడుతున్నాయి. గ్రామాలలో వర్షపు నీటి ఉదృతితో వీధులు జలమయమయ్యాయి. బల్లికురవ-అద్దంకి రోడ్డులో అంబడిపూడి వద్ద చెరువు అలుగు ఉధృతంగా రావడంతో రాకపోకలకు ఇబ్బందు లు లేకుండా తహసీల్దార్ రవినాయక్ సూచనల మేరకు గ్రామ టీడీపీ నాయకులు దద్దాల అంజయ్య యంత్రంతో వాగును శుభ్రం చేయించారు. అలానే వీర్లచెరువు అలుగు పారడంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటిసంఘం అధ్యక్షులు దర్శి రామస్వామి అధికారులతో దగ్గర ఉండి పరిశీలించారు. కొత్తపాలెం గ్రామం వద్ద తూర్పు వాగు ఉధృతితో పంట పొలాలు నీట మునిగాయి. గుంటుపల్లి అసిస్టు కాలనీ వద్ద వర్షపు నీటితో గృహాలలోకి నీరు చేరడంతో రెవెన్యూ అధికారులు నీరు బయటకు పంపే చర్యలు చేపట్టారు. అలానే కొణిదెన - గంగపాలెం గ్రామాల మధ్య నేలచప్టాలో వర్షపు నీరు నిలబడడంతో రాక పోకలు నిలిచిపోయాయి. వైదన, కొప్పెరపాడు, చెన్ను పల్లి, ముక్తేశ్వరం గ్రామాలలో ఉన్న చెరువులు భారీ వర్షాల వలన పూర్తిగా నిండాయి. మరో వారం రోజులు వర్షాలు ఇదేమాదిరిగా కురిస్తే పంటలకు నష్టంతో పాటు గ్రామాలలో గృహాలలోకి కూడా నీరు చేరే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఫ నీటమునిగిన పొలాలు
పంగులూరు : అల్పపీడన ప్రభావంతో గురు, శుక్ర వారాలలో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు పొలాలు నీటమునగగా, వాగులు పొంగి ప్రవహిం చాయి. మండలంలోని చందలూరు ఊరవాగు వంతెన పై పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచి పోయాయి. పలు గ్రామాలలో సాగులో ఉన్న మినుము పంటకు తీవ్రనష్టం వాటిల్లింది. కోతదశలో ఉన్న మినుము పంట చేతికి దక్కదని కొండమూరు, ముప్ప వరం, అలవలపాడు, రేణంగివరం, బూదవాడ గ్రామా ల రైతులు వాపోతున్నారు. నిత్యం పడుతున్న వర్షంతో పొలాల్లో గడ్డిపెరిగి బీడుగా మారాయని, వ్యవసాయ పనులు నిలిచిపోవడంతో రబీ పంటసాగు ఆలస్యం అవుతుందని రైతులు భావిస్తున్నారు. గురువారం తెల్లవారుజాము వరకు కురిసిన వర్షపాతం 2.5. సెంటీమీటర్లుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఫ అండర్‌పాస్ వద్ద భారీగా నిలిచిన నీరు
ఉప్పుటూరు(పర్చూరు) : అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. జాతీయ రహదారి అధికారులు ముందుచూపు చర్యలు లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. దీనిలో భాగంగా పర్చూరు మండల పరిధిలోని ఉప్పుటూరు గ్రామంలో 167ఏ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన అండర్ పాస్ సరైన ముందుచూపు చర్యలు చేపట్టక పోవడం భారీగా నీరుచేరింది. దీంతో ఈ మార్గం ద్వారా రాక పోకలు సాగించాల్సిన ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. కొద్దిపాటి వర్షం కురిసినా అండర్‌పాస్‌లో నీరు చేరుతుండడంతో సమస్య జఠిలంగా మారింది. ప్రస్తుతం ప్రజలు పడుతున్న సమస్యను దృష్టిలో పెట్టుకొని డ్రైన్ కాలువ ద్వారా నీటిని వెలుపలికి పంపించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఫ మినుముపైరుకు అపారనష్టం
పంగులూరు : ఎడతెరపి లేకుండా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మినుము పంటకు తీవ్రనష్టం వాటిల్లిందని ఏవో డి.సుబ్బారెడ్డి తెలిపారు. సాగులో ఉన్న 2,500 ఎకరాల్లో మినుము పంటకు నష్టం వాటిల్లినట్లు ఉన్నతాధికారులకు ప్రాథమికంగా నివేదించనున్నట్లు ఏవో సుబ్బారెడ్డి తెలిపారు. మండలంలోని కొండమూరు, రేణంగివరం గ్రామాలలో వర్షానికి దెబ్బతిన్న మినుము పైరును స్థానిక రైతులతో కలసి శుక్రవారం పరిశీలించారు. అధిక వర్షంతో కోత దశకు చేరుకున్న మినుము పైరులో కాయకు బూజు వచ్చి రంగుమారడం, మొలకరావడంతో పాటు పూతరాలడం గుర్తించినట్లు తెలిపారు. నష్ట నివేదికపై ఉన్నతాధికారుల అనుమతి వచ్చిన వెంటనే సాగులో ఉన్న ప్రతి ఎకరాను పరిశీలించి నష్టం అంచనాలను రూపొందించనున్నట్లు తెలిపారు.
మార్టూరు : మూడు నాలుగురోజుల నుంచి అల్పపీడన ప్రభావంతో మండలంలో కురిసిన భారీ వర్షాలకు మినుము, పత్తి పంట దెబ్బతింది. వాటిలో మినుము పంట పూర్తిగా దెబ్బతింది. మండలంలో మినుము పైరును బొల్లాపల్లిలో 520, ద్రోణాదులలో 337, కోలలపూడిలో 64 ఎకరాలలో సాగు చేశారు. ఆగస్ట్టు నెలలో పంటను సాగు చేశారు. ప్రస్తుతం కురిసిన భారీ వర్షాలకు మినుము పంటలో నీళ్లు నిలిచాయి. బయటకు వచ్చిన మినుము విత్తనాలు తడిసి బూజుపట్టేదశ కు చేరాయి. రైతులు ఎకరాకు రూ.20 వేలును పెట్టుబడిగా పెట్టారు. దీంతో మండలంలో వెయ్యి ఎకరాలలో మినుము పంట దెబ్బతిన్నట్లు ఏవో ప్రాథమిక అంచనా రిపోర్టులో పంపించారు. అదేవిధంగా మండలంలోని మార్టూరు, రాజుపాలెం గ్రామాలలో వేసిన 600 ఎకరాలలోని పత్తి పంట కూడా దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు ఇదే విధంగా మరింతగా వర్షాలు కొనసాగితే పత్తిపంట పూర్తిగా దెబ్బతింటుందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు ప్రాథమిక అంచనా రిపోర్టును కూడా అధికారులు పంపించారు. ఇదిలా ఉండగా శుక్రవారం బొల్లాపల్లి, తాటివారిపాలెం గ్రామాలలో రైతులతో కలిసి దెబ్బతిన్న మినుము పంటను ఏవో లావణ్య పరిశీలించారు. ఇక రైతు సంఘం నాయకులు వీరవల్లి కృష్ణమూర్తి మినుము పంట రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు.
ఫ పొంగి పొర్లుతున్న వాగులు వంకలు
వేటపాలెం(చీరాల) : కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షం శుక్రవారం అదే జోరుతో కుమ్మరించింది. వాగులు వంకలు వర్షపు నీళ్లుతో పొంగి పొర్లాయి. ఇళ్లల్లో నుంచి ప్రజలకు బయటకు రావడానికి నానా ఇబ్బందులు పడ్డారు. రహదారులు, డ్రయిన్‌లు నిండాయి. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అలాగే పలుచోట్ల దారి మళ్లించాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే స్థానిక పరిస్థితులు ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు కలెక్టర్ డా.వినోద్‌కుమార్ దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు గురు, శుక్ర వారాలు చినగంజాం, వేటపాలెం, చీరాల, ఇంకొల్లు కారంచేడు మండలాల అన్ని విద్యాలయాలకు సెలవు ప్రకటించింది. మరో అల్పపీడనం పొంచిఉన్నట్లు అధికారులు తెలుపడంతో ప్రజలు భీతిల్లుతున్నారు.
ఫ నీటమునిగిన వరిపొలాలు
చినగంజాం : అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు మండల పరిధిలోని మున్నంవారిపాలెం గ్రామ సమీపంలోని మట్టిగుంట వాగుకు వరద రావడంతో ఆప్రాంతంలో నీటమునిగిన వరి పంట పొలాలను పర్చూరు నియోజకవర్గ ప్రత్యేకాధికారి, డిప్యూటీ కలెక్టర్ లవన్న శుక్రవారం పరిశీలించారు. మట్టిగుంట వాగుకు వరద రావడంతో మున్నంవారి పాలెం ప్రాంతంలో 30 ఎకరాల్లో వేసిన వరి పంట నీట మునిగింది. వరద నీటిని త్వరతగతిన బయటకు పంపే విధంగా రైతులతో సమావేశం నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కలెక్టర్ ఏవో ఆర్.చంద్రశేఖర్‌ని ఆదేశించారు. వేసిన పంట దెబ్బతినకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జె.ప్రభాకరరావు, గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.