అక్రమాల డొంక కదులుతోంది!
ABN , Publish Date - Sep 20 , 2025 | 02:36 AM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒంగోలు కార్పొరేషన్‌లో అవినీతి రాజ్యమేలింది. కొందరు అధికారులు బరితెగించి అక్రమాలకు పాల్పడ్డారు. అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేయాల్సింది పోయి ప్రోత్సహించారు. కీలక అధికారుల చేతివాటంతో నగరంలో కనీస నిబంధనలు పాటించని నిర్మాణాలు అడ్డూఅదుపు లేకుండా సాగిపోయాయి.
వైసీపీ హయాంలో ‘అవినీతి కట్టడాలకు’ పునాదులు!
నిబంధనలు పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా అనుమతులు
అక్రమ నిర్మాణాలకు నాటి కార్పొరేషన్ అధికారుల వెన్నుదన్ను
లేబర్ సెస్.. ఎల్‌ఆర్‌ఎస్ స్కీం నిధులు స్వాహా..!
నిబంధనలు పాటించని షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలకు సహకారం
గత కమిషనర్, ఏసీపీల నిర్వాకంపై పురపాలక శాఖ సీరియస్
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒంగోలు కార్పొరేషన్‌లో అవినీతి రాజ్యమేలింది. కొందరు అధికారులు బరితెగించి అక్రమాలకు పాల్పడ్డారు. అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేయాల్సింది పోయి ప్రోత్సహించారు. కీలక అధికారుల చేతివాటంతో నగరంలో కనీస నిబంధనలు పాటించని నిర్మాణాలు అడ్డూఅదుపు లేకుండా సాగిపోయాయి. కాసులిస్తే చాలు అనుమతులు మంజూరయ్యాయి. అప్పట్లో చోటుచేసుకున్న ఈ అంతులేని అవినీతిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా ఆ సమయంలో పనిచేసిన కార్పొరేషన్ కమిషనర్‌తోపాటు అందులో భాగస్వాములైన ఏసీపీ, టౌన్ ప్లానింగ్ సిబ్బందిపైన చర్యలకు పురపాలక శాఖ ఆదేశాలు జారీచేసింది.
ఒంగోలు కార్పొరేషన్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఒంగోలు నగర పాలక సంస్థలో అవినీతి ‘కట్టడాలు’ పెరిగిపోయాయి. నాటి ప్రజాప్రతినిధుల ఆదేశాలకు తలూపిన అధికారులు తమ చేతివాటం చూపారు.అక్రమ కట్టడాలను నిర్మిస్తే సహించబోమంటూ పైకి హడావుడి చేస్తూ లోపల మాత్రం నగరపాలక సంస్థ టౌన్ ‘ప్లానింగ్’ను మార్చేశారు. అధికారులతోపాటు, సిబ్బంది అనధికార నిర్మాణాలకు వెన్నుదన్నుగా నిలిచారు. నిబంధనలు తుంగలో తొక్కి.. ప్రతి ఫైలుకు నాకేంటి? అంటూ భారీగా బొక్కేశారు. అలాంటి అవినీతి అధికారులపై పురపాలక శాఖ చర్యలకు సిద్ధమైంది. కాగా ఆయా అక్రమ నిర్మాణాలవైపు ప్రస్తుత కార్పొరేషన్ అధికారులు కన్నెత్తిచూడకపోవడం గమనార్హం.
ఆ ఐదేళ్లలో అంతా ఇష్టారాజ్యం
గత వైసీపీ హయాంలో ఒంగోలు కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ విభాగంలో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయి. అప్పటి అధికారులు అనధికార భవనాల నిర్మాణాలను ప్రోత్సహించారు. వాటితోపాటు ఖాళీస్థలాల పన్ను (వీఎల్‌టీ) కట్టించకుండానే భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేశారు. దీంతో కార్పొరేషన్‌కు రూ.కోట్లలో నష్టం వాటిల్లింది. మరోవైపు కొందరు జీ+2 నిర్మాణానికి అనుమతులు తీసుకుని ఏకంగా నాలుగు ఆపైన అంతస్థులు నిర్మించారు. ముఖ్యంగా వ్యాపార సంస్థల నిర్మాణానికి భవన నిర్మాణ ఖర్చులో 10శాతం కార్మిక శాఖకు లేబర్ సెస్ చెల్లించాల్సి ఉంది. అది సక్రమంగా చెల్లిస్తే రూ.కోట్లు అవుతుంది. అయితేకేవలం రూ.లక్ష, రూ.2లక్షలు మాత్రమే కట్టించి మిగిలిన మొత్తాన్ని అధికారులు కాజేసినట్లు సమాచారం. దీంతో కార్మిక శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇదిలావుండగా అప్రూవల్ లేని ఖాళీ స్థలానికి లేఅవుట్ రెగ్యులేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్) ద్వారా 14శాతం అపరాధ రుసుం కట్టించాల్సి ఉండగా, కొన్నింటికి తూతూమంత్రంగా కట్టించారు. మిగతా వాటిని పూర్తిస్థాయిలో దిగమింగేశారని తెలుస్తోంది.
అక్రమ కట్టడాలకు అనుమతులు
నగరంలోని ఊరచెరువు, బండ్లమిట్ట, అద్దంకి బస్టాండ్ రోడ్డులో దుకాణాలు, మాల్స్ తదితర 108 నిర్మాణాలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చేశారు. భవన యజమానులు కార్పొరేషన్‌కు ఒక రూపాయి కూడా చెల్లించకుండానే గత కమిషనర్ వెంకటేశ్వ రరావు, నాటి అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ప్రస్తుతం రిటైర్డ్) అయిన కె.వెంకటేశ్వరరావు చక్రం తిప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. దుకాణదారుల నుంచి భారీ మొత్తాలు వసూలు చేసి నిర్మాణాలకు సహకరించారని తెలుస్తోంది. అలాగే మంగమూరు రోడ్డులో ఓ మార్ట్, షాపింగ్ మాల్‌కు జీ+3 కింద అనుతులు తీసుకుని ఏకంగా జీ+4 నిర్మించారు. అలాగే ఖాళీ స్థలాల పన్ను రూ.2కోట్లు, లేబర్ సెస్ రూ.5 కోట్లు చెల్లించాల్సి ఉండగాకేవలం రూ.5లక్షలు మాత్రమే కట్టినట్లు సమాచారం.
ఏసీబీ, విజిలెన్స్ తనిఖీలతో వెలుగులోకి..
హైకోర్టు న్యాయవాది డి.ఎస్.బాబు సమాచార హక్కు చట్టం ద్వారా వీటిపై వివరాలు సేకరించి అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ రెండు శాఖల అధికారులు సంబంధిత ఫైళ్లను స్వాధీనం చేసుకుని క్షేత్రస్థాయిలో విచారణ ప్రారంభించడంతో అనుమతులు లేని నిర్మాణాలు, తక్కువ చార్జీలు కట్టించుకోవడం, లేబర్ సెస్, ఎల్‌ఆర్‌ఎస్ కింద 14శాతం వదిలేయడం వంటి అవినీతి వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో నివేదికను పురపాలక శాఖకు అందజేయడంతో గత కమిషనర్ ఎం.వెంకటేశ్వరరావు, ఏసీపీ వెంకటేశ్వర్లుపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. కార్పొరేషన్‌కు కలిగిన నష్టాన్ని రికవరీ దిశగా నివేదిక తయారు చేయాలని ఆదేశించింది. అయితే అప్పటివరకు కమిషనరు ఎం.వెంకటేశ్వరరావుకు ఉద్యోగంలో పదోన్నతులు ఆపివేయడంతోపాటు, రిటైర్ అయిన ఏసీపీ కె.వెంకటేశ్వర్లుకు రావాల్సిన బెనిఫిట్స్ నిలిపివేయాలని ఆదేశించినట్లు సమాచారం.