Share News

తీరం అల్లకల్లోలం

ABN , Publish Date - Oct 28 , 2025 | 01:22 AM

జిల్లాలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు సైతం భయపడే విధంగా సాగరుడు ఉగ్రరూపం దాల్చాడు. అలలు ఎగిరిపడుతూ తీరాన్ని తాకుతున్నాయి. సాధారణంగా మత్స్యకారులు వేట ముగిసిన తర్వాత పడవలను నిలుపుకునే ప్రాంతం వరకు అలల ఉధృతి కొనసాగుతోంది.

తీరం అల్లకల్లోలం
కొత్తపట్నం తీరంలో ఉధృతంగా ఎగసిపడుతున్న అలలు

తుఫాన్‌ నేపథ్యంలో

ముందస్తు ఏర్పాట్లు

కొత్తపట్నం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు సైతం భయపడే విధంగా సాగరుడు ఉగ్రరూపం దాల్చాడు. అలలు ఎగిరిపడుతూ తీరాన్ని తాకుతున్నాయి. సాధారణంగా మత్స్యకారులు వేట ముగిసిన తర్వాత పడవలను నిలుపుకునే ప్రాంతం వరకు అలల ఉధృతి కొనసాగుతోంది. జిల్లాలోని తీరం అంతా దాదాపు పోలీసుల, రెవెన్యూ, మెరైన పోలీసులు నిఘాలోనే ఉంది. తీరంలో కూడా పర్యాటకులు, స్థానికులు సముద్రంలోకి వెళ్లకుండా అధికారులు నిషేధం విధించారు. బారికేడ్లు, తాళ్లతో కట్టి తీరంలోకి రాకపోకలను అడ్డుకున్నారు. కొన్నితీరాల్లో మత్స్యకారులు దారులకు అడ్డంగా తమ పడవలను చేర్చి సురక్షితంగా ఉంచుకున్నారు. కొత్తపట్నం తీరంలో ఉన్న ఆర్‌అండ్‌బీరోడ్డు అంతా పడవలను నిలిపివేశారు. దీంతో తీరం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. సోమవారం తుఫాన్‌ ప్రభావం జిల్లాలోని తీరం అంతటా చెదురుమదురు వానలే కురిశాయి. తీరంలో కెరటాలు ఎగిసి పడుతున్నాయి. గాలి ప్రభావం పెద్దగా లేకపోవటంతో మత్స్యకారులు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. తీర ప్రాంత మండలాల్లోప్రత్యేక అధికారులు మకాం వేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూనే ఉన్నారు. తుఫాన్‌ తీరం దాటిన తర్వాత మంగళవారం నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో తీర ప్రాంత గ్రామాల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తీర ప్రాంతంలోని పలు గ్రామాల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తపట్నం పల్లెపాలెంలోని సునామీ కాలనీ మూడు రోజులుగా జల దిగ్భంధంలోనే ఉంది. కొత్తపట్నంలోని బీచ్‌ రోడ్డు అంతా నీటితో నిండిపోయి కనిపిస్తోంది. ఇదే విధంగా జిల్లాలోని తీర ప్రాంత గ్రామాలకు వెళ్లేదారుల్లో , గ్రామాల్లో నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి ఇప్పటికే ఈ విధంగా ఉంటే మంగళవారం కురిసే భారీ వర్షాలకు ఎలా ఉంటుందోననే ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. మొంథా తుఫాన్‌ కారణంగా వేట సాగే అ వకాశం లేకపోవటంతో ఆకలితో అవస్థలు పడాల్సి వస్తోందనే ఆందోళనను మత్స్యకారులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని సోమవారం కొత్తపట్నం తీరంలో పర్యటించిన ఒంగోలు శాసన సభ్యుడు దామచర్ల జనార్దనరావు ముందు మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. బియ్యం పంపిణీ చేయించి ఆదుకోవాలని ఆయన్ను మత్స్యకారులు కోరారు.

అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ..

వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పారిశుధ్యం పూర్తిగా పడకేసింది. ఎక్కడ చూసినా దుర్గంధం వెదజల్లుతోంది. తీర ప్రాంత గ్రామాల్లో అయితే రోజుల తరబడి నీరు నిలిచిపోయి వ్యర్థాలు కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్యఆరోగ్యశాఖ ప్రభుత్వ ఏర్పాటు చేస్తున్న పునరావాస కేంద్రాలతో పాటు మత్స్యకార గ్రామాల్లో కూడా ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తోంది. వైద్యులు, వైద్యసిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండి సేవలు అందించేలా ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితులు ఎలా ఉన్నా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమయ్యింది.

Updated Date - Oct 28 , 2025 | 01:22 AM