Share News

మారనున్న దొనకొండ దశ

ABN , Publish Date - Oct 11 , 2025 | 01:17 AM

రాష్ట్రం లోని ప్రజా ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించింది. అందుకు సంబంధించి అడుగులు చకచకా వేస్తోంది. అనంతపురం జిల్లా లోని మడకసిర, మన జిల్లాలోని దొనకొండ, కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట ప్రాంతాల్లో ఢిపెన్స్‌ పరిశ్ర మల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది.

మారనున్న దొనకొండ దశ
దొనకొండలో భూములను పరిశీలిస్తున్న డిఫెన్స్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ బృందం (ఫైల్‌)

ప్రజా ప్రభుత్వంలో చిగురిస్తున్న ఆశలు

రక్షణ రంగానికి చెందిన భారీ పరిశ్రమ ఏర్పాటుకు మరో అడుగు

రెండు నెలల క్రితం భూములను పరిశీలించిన డీఆర్‌డీవో ప్రతినిధులు

దొనకొండ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రం లోని ప్రజా ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించింది. అందుకు సంబంధించి అడుగులు చకచకా వేస్తోంది. అనంతపురం జిల్లా లోని మడకసిర, మన జిల్లాలోని దొనకొండ, కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట ప్రాంతాల్లో ఢిపెన్స్‌ పరిశ్ర మల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) సంస్థ దొనకొండలో రెండు దశ లుగా రూ.1,200 కోట్ల పెట్టుబడులతో ఆయుధ క్షిపుణుల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. అందుకు 1,400 ఎకరాల భూమి అవసరంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఆమేరకు భూమి కేటాయింపునకు మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ పరిశ్రమ ఏర్పాటైతే ప్రత్యక్షంగా, పరో క్షంగా 1,600 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులన్నీ సకాలంలో వస్తే ఏడాదిలో పనులు ప్రారంభించి రెండేళ్లకు పూర్తి చేసేలా ఆ సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు తెలిసింది. రెండు నెలల క్రితం డీఆర్‌డీవో సంస్ధకు చెందిన ప్రతినిధులు దొనకొండకు వచ్చి ఈ ప్రాంతంలోని భూములను, మౌలిక సౌకర్యాలను పరిశీలించారు.

అనేక అనుకూల అంశాలు

ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం బ్రహ్మోస్‌ క్షిపుణుల ఉత్పత్తిని పెద్దఎత్తున పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా దొనకొండలో రక్షణశాఖ ఆధ్వర్యంలో అత్యాధునిక రక్షణ రంగ పరికరాల తయారీ యూనిట్‌ నెలకొల్పేందుకు ఇటీవల ప్రభుత్వానికి బీపీఎల్‌ సంస్థ డీపీఆర్‌ను అందించినట్లు తెలుస్తోంది. దొనకొండలో బ్రిటీష్‌ కాలంనాటి విమానాశ్రయం, గుంటూరు-బెంగళూరు ప్రధాన రైలు మార్గం ఉండటం భారీ పరిశ్రమల ఏర్పాటుకు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. ఇటీవల రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ దొనకొండ ప్రాంతంలో సోలార్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని ప్రకటించారు. అందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు.

గత టీడీపీ ప్రభుత్వంలోనే భూముల గుర్తింపు

రాష్ట్ర విభజన అనంతరం దొనకొండ ప్రాంతంలో అధికంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో పరిశ్రమల కారిడార్‌ ఏర్పాటు చేస్తామని అప్పటి టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. అందులోభాగంగా మండలంలోని భూములను రెవెన్యూ అధికారులచే సమగ్ర సర్వే చేయించి పట్టాభూమి 4,407.62 ఎకరాలు, ప్రభుత్వ భూమి 12,367.95 ఎకరాలు, అసైన్‌మెంట్‌ భూమి 8,287.28 ఎకరాలు.. మొత్తం 25,061.85 ఎకరాల భూమి ఉన్నట్లు తేల్చారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో పరిశ్రమల ఏర్పాటుకు వివిధ ప్రాంతాలకు చెందిన ఎందరో ప్రతినిధులు దొనకొండ వచ్చి భూములను పరిశీలించారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు పరిశ్రమల ఏర్పాటుపై ఎటువంటి దృష్టి సారించకపోవడంతో ప్రజలు నిరుత్సాహానికి గురయ్యారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే పరిశ్రమల ఏర్పాటుకు చూపుతున్న చొరవతో ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నారు. మున్ముందు దొనకొండ దశ మారుతుందని అందరూ భావిస్తున్నారు.

బీడీఎల్‌కు 1,400 ఎకరాలు కేటాయింపు

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) ప్లాంట్‌ ఏర్పాటుకు జిల్లాలోని దొనకొండ సమీపంలో ప్రభుత్వం భూమిని కేటాయించింది. మొత్తం 1,400 ఎకరాలను ఇస్తూ శుక్ర వారం జరిగిన రాష్ట్రమంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది. దొనకొండ పరిసరాల్లో పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించగా పలు కంపెనీలు తమ యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతు న్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వ రంగ సంస్థ అయిన బీడీఎల్‌ రక్షణ రంగంలో ఆయుధ ఉత్పత్తి ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది. సుమారు రూ.1200 కోట్లతో నూతన ఆయుధ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించేందుకు 1,400 ఎకరాల భూమి అవసరంగా బీడీఎల్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రెండు దశల్లో ఈ ప్లాంట్‌ నిర్మించాలని భావిస్తుండగా దీని ద్వారా 1,600 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. కాగా బీడీఎల్‌ కోరిక మేరకు భూమిని కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో ప్లాంట్‌ ఏర్పాటుకు 1,200 ఎకరాలు, టౌన్‌షిప్‌ నిర్మాణానికి 146.67 ఎకరాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం చేతిలో ఉన్న భూమిని ఎకరా రూ.7.73 లక్షల వంతున ఇవ్వనుండగా.. మిగిలిన భూమికి ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం కేటాయించాలని నిర్ణయించారు.

Updated Date - Oct 11 , 2025 | 01:17 AM