కేంద్రాలు తెరిచారు.. కొనుగోళ్లు మరిచారు!
ABN , Publish Date - Dec 11 , 2025 | 01:44 AM
అట్టహాసంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పౌరస ఫరాల శాఖ అధికారులు కొనుగోళ్లను మరిచారు. వారి నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పండించిన ధాన్యాన్ని ఎక్కడ విక్రయించాలో దిక్కుతోచక అయోమంలో ఉన్నారు.
సివిల్ సప్లయీస్ అధికారుల నిర్లక్ష్యం
గోతాలు కూడా చేర్చని దయనీయం
ధాన్యానికి లభించని గిట్టుబాటు ధర
భారీగా నష్టపోతున్న అన్నదాతలు
దర్శి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : అట్టహాసంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పౌరస ఫరాల శాఖ అధికారులు కొనుగోళ్లను మరిచారు. వారి నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పండించిన ధాన్యాన్ని ఎక్కడ విక్రయించాలో దిక్కుతోచక అయోమంలో ఉన్నారు. జిల్లాలో వారం క్రితం సివిల్ సప్లయీస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దర్శి నియోజకవర్గంలో 13 కేంద్రాలను తెరిచారు. గతనెల 3న జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మండలంలోని సామంతపూడిలో కోనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మిగిలిన కేంద్రాలను స్థానిక అధికారులు ఏర్పాటు చేశారు.
వారంలో 575 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు
నియోజకవర్గంలో వారం క్రితం 13 కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ దర్శి మండలంలోని బొట్లపాలెం కేంద్రంలో మాత్రమే 575 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మిగిలినచోట్ల కొనుగోళ్లు ప్రారంభించలేదు. అనేక కేంద్రాలకు ఇప్పటివరకు గోతాలు కూడా చేర్చలేదు. డేటా ఆపరేటర్లను ఏర్పాటు చేయలేదు. దీంతో కొనుగోళ్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. కొంతమంది రైతులు శ్యాంపిల్స్ తీసుకెళ్లినప్పటికీ స్థానిక వీఏఏలు తేమ శాతాన్ని పరిశీలించి తేమ ఎక్కువగా ఉందని తిప్పిపంపుతున్నారని రైతులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటైతే గిట్టుబాటు ధర లభిస్తుందని ఆశించిన రైతులకు నిరాశ మిగులుతోంది.
ప్రైవేటు వ్యాపారుల దోపిడీ
అవకాశాన్ని ఆసరా చేసుకొని ప్రైవేటు వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారు. ప్రభుత్వం గ్రేడ్-1 రకం 75 కేజీల బస్తా ధర రూ.1,792, సాధారణ రకం రూ.1,777 మద్దతు ధర నిర్ణయించింది. రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకుంటే ఆమేరకు మద్దతు ధర లభిస్తుంది. ఇక్కడ కొనుగోళ్లు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తున్నారు. 75 కేజీల బస్తాను ప్రైవేట్ వ్యక్తులు రూ.1,400కే కొనుగోలు చేస్తున్నారు. అదనంగా తేమ శాతం కింద మరో 3 కేజీలు తీసుకుంటున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను విక్రయించుకునేందుకు వనరులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణకు అవసరమైన నిధులు విడుదల చేసింది. దర్శి మండలంలోని బొట్లపాలెంలో కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించిన రైతులకు మరుసటి రోజే నగదు జమ అయింది. సివిల్ సప్లయీస్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ఉన్నతాధికారులు ఈవిషయాన్ని గుర్తించి వెంటనే కొనుగోళ్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.