మళ్లీ పెద్దపులి పంజా
ABN , Publish Date - Aug 09 , 2025 | 01:22 AM
నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి మరోసారి పంజా విసిరింది. బుధ వారం రాత్రి గన్నేపల్లి, వెలగలపాయ గ్రామాల మధ్య పోలేరమ్మకొండ (చింతమానుకుంట) అటవీ ప్రాంతంలోకి మేతకు వెళ్లిన రెండు ఎద్దులపై దాడి చేసింది.
వెలగలపాయ ఫారెస్టులో 2 ఎద్దులపై దాడి
చంపి లోయలోకి లాక్కెళ్లిన వైనం
3 నెలల్లో 10కిపైగా మృత్యువాత
కంభం, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి మరోసారి పంజా విసిరింది. బుధ వారం రాత్రి గన్నేపల్లి, వెలగలపాయ గ్రామాల మధ్య పోలేరమ్మకొండ (చింతమానుకుంట) అటవీ ప్రాంతంలోకి మేతకు వెళ్లిన రెండు ఎద్దులపై దాడి చేసింది. వాటిని చంపి సుమారు 500 మీటర్లకు పైగా కొండపైన లోయలోకి లాక్కెళ్లింది. ఈమేరకు ఫారెస్టు ఆఫీసర్ అబ్దుల్‌గఫార్ నిర్ధారించారు. వెలగలపాయ గ్రామానికి చెందిన అనుమలకొండ ఏసయ్య, దున్న రమణయ్య తమ రెండు ఎడ్లను మేత కోసం బుధవారం ఉదయం పొలాల్లోకి తోలుకెళ్లారు. కొద్దిసేపటికి వర్షం కురవడంతో రైతులిద్ద రూ ఇంటికి వచ్చారు. పొద్దుపోయినా ఎద్దులు ఇంటికి రాకపోవడంతో గురువారం ఉదయం వాటి కోసం అడవిలో గాలించారు. కొండలోయలో రెండు ఎద్దుల కళేబరాలు కనిపించాయి. ఫారెస్టు అధికారులకు తెలియజేయడంతో శుక్రవారం వచ్చి పరిశీలించారు. పెద్దపులి పాదముద్రలు సేకరించారు. సమీప ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నష్టపోయిన వారికి పరిహారం వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఫారెస్టు అధికారులు అబ్దుల్‌గఫార్, మంగే నాయక్‌లు గ్రామస్థులతో మాట్లాడుతూ అడవిలోకి మేత కోసం గేదెలు, ఆవులు, ఎద్దులను తోలవద్దని, మనుషులు కూడా కొద్ది రోజులు ఈ ప్రాంతాలలో తిరగవద్దని సూచించారు.
3 నెలల్లో 10 పశువులను చంపిన పెద్దపులి
మూడు నెలల కాలంలో పెద్దపులి అర్థవీడు మండలంలో 10 పశువులను చంపింది. పాపినేనిపల్లి, బొల్లుపల్లి, కొత్తూరు, వీరభద్రాపురం, వెలగలపాయ, గన్నేపల్లి, అచ్చంపేట లోయల్లో 4 గేదెలను, 4 ఎద్దులను, 2 ఆవులను పెద్దపులి చంపింది. వీటన్నింటినీ ఒకే పెద్దపులి చంపిందని భావిస్తున్నారు. దీనిపై ఫారెస్టు అధికారి మంగే నాయక్‌ను వివరణ కోరగా పెద్దపులి ఆహార అన్వేషణ కోసం రోజుకు 50 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుందని, అయితే వీటన్నింటినీ ఒకే పెద్దపులి దాడి చేసి చంపిందని చెప్పలేమన్నారు. పాదముద్రలు సేకరించి వాటిని పరీక్షించిన తరువాత ఒక పులా, రెండు పులులా అనేది చెప్పగలమన్నారు. గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని, చీకటి పడగానే ఇళ్లకు చేరుకోవాలని సూచించారు.