Share News

బినామీలదే పెత్తనం

ABN , Publish Date - Jul 26 , 2025 | 01:26 AM

ఒంగోలు నడిబొడ్డున ఊరచెరువులోని దామోదరం సంజీవయ్య మార్కెట్‌లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. దుకాణాల కేటాయింపు నుంచి అద్దె నిర్ణయం వరకు లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.

బినామీలదే పెత్తనం
దామోదరం సంజీవయ్య మార్కెట్లోని దుకాణాలు

దామోదరం సంజీవయ్య మార్కెట్లో ఇష్టారాజ్యం

అద్దెకు తీసుకున్నదొకరు.. వ్యాపారం చేస్తుందొకరు

దుకాణాలు ఖాళీ చేయకుండా ఏళ్ల తరబడి తిష్ఠ

యఽథేచ్ఛగా అనుభవిస్తున్న అక్రమార్కులు

కనీస చర్యలు తీసుకోని కార్పొరేషన్‌ అధికారులు

ఒంగోలు కార్పొరేషన్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఒంగోలు నడిబొడ్డున ఊరచెరువులోని దామోదరం సంజీవయ్య మార్కెట్‌లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. దుకాణాల కేటాయింపు నుంచి అద్దె నిర్ణయం వరకు లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. కొందరు వ్యాపారులు ఏళ్లతరబడి ఎలాంటి అద్దె చెల్లించకపోగా, మరికొన్ని దుకాణాల్లో బినామీలు పడ్డారు. అద్దెకు తీసుకుంది ఒకరైతే.. వ్యాపారం చేస్తున్నది మరొకరు. ఎవరి పరిధిలో వారు అధికారులతో కుమ్మక్కై పలుకుబడిని ఉపయోగించుకుని తమ స్వాధీనంలో ఉంచుకున్నారు. ఆపై వేల రూపాయల అద్దెకు ఇచ్చి వసూలు చేసుకుంటూ కార్పొరేషన్‌కు మాత్రం రూపాయి కట్టడం లేదు. ఏళ్ల తరబడి ఈ తంతు నడుస్తున్నా కార్పొరేషన్‌ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. మార్కెట్‌ షాపుల కేటాయింపుల్లో గతంలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరిగిందంటూ ఉన్నతాధికారులకు, లోకాయుక్తకు పలువురు ఫిర్యాదు చేశారు.దీంతో 2012 మార్చి నుంచి మార్కెట్‌లో దుకాణాల కేటాయింపు, చోటుచేసుకున్న లోపాలపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాల్సిందిగా అప్పటి గుంటూరు రీజనల్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావును ఉన్నతాధికా రులు ఆదేశించారు. దీంతో చీరాల మునిసిపాలిటీ రెవెన్యూ ఆఫీసర్‌ బీవీవీ భాస్కర్‌రావు, కావలి మునిసిపాలిటికీ చెందిన ఉద్యోగి పి.సుబ్బారావు, మరో నలుగురు బిల్‌ కలెక్టర్‌లతో కూడిన బృందాన్ని విచారణకు ఆర్డీ నియమించారు. వారు స్వయంగా మార్కెట్‌ను పరిశీలించారు. మొత్తం 318 షాపులు ఉండగా వాటిలో 61 మూసివేసి ఉన్నాయని,33 కేటాయించిన వ్యక్తులు స్వాధీనం చేసుకోలేదని, ఎస్సీ రిజర్వేషన్‌కు కేటాయించిన ఒక షాపు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. నివేదిక తయారుచేసి పంపారు.

అవకతవకల లెక్క ఇదీ...!

మాంసం అమ్మకాల కోసం మొత్తం 25 షాపులు కేటాయించగా ఒక దుకాణం ఖాళీగా ఉంది. మిగిలిన షాపుల్లో అందరూ పాటలో దక్కించుకున్న వ్యాపారులే ఉన్నారు.

పూల వ్యాపారుల కోసం మొత్తం 28 షాపులు కేటాయించారు. వాటిలో రెండు ఖాళీగాను, ఐదింటిలో బినామీలు ఉన్నట్లు తేల్చారు. మిగిలిన షాపుల్లో ఎవరికైతే కేటాయించారో వారు వ్యాపారాలు సాగిస్తున్నారు.

హోల్‌సేల్‌ కూరగాయల వ్యాపారుల కోసం 69 దుకాణాలు కేటాయించారు. వాటితో తొమ్మిది మూసివేసి వాడుకలో లేకపోగా ఏడు దుకాణాల్లో బినామీలు ఉన్నారు.

రిటైల్‌ కూరగాయల వ్యాపారులకు 123 షాపులను కేటాయించగా 30 పూర్తిగా వినియోగంలో లేకుండా మూసివేసి ఉన్నాయి. ఒక షాపు ఎస్సీలకు కేటాయించగా ప్రస్తుతం ఎవరూ తీసుకోలేదు. మొత్తం 15 మంది బినామీలు ఉన్నట్లుగా గుర్తించారు. మిగిన షాపుల్లో వేలంలో దక్కించుకున్న వారే కొనసాగుతున్నారు.

పండ్ల వ్యాపారులకు 38 షాపులు కేటాయించగా నాలిగింటిలో బినామీలు ఉన్నట్లుగా విచారణలో తేలింది.

Updated Date - Jul 26 , 2025 | 01:26 AM