ఆరంభం అదుర్స్!
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:23 AM
కర్ణాటకలో ఈ సీజన్ పొగాకు కొనుగోళ్లు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఽగరిష్ఠ ధర కిలో రూ.320 పలికింది. పొగాకు బోర్డు చరిత్రలోనే వేలం ప్రారంభం రోజున ఈస్థాయి ధర లభించడం ఇదే ప్రథమం. అక్కడ పంట ఉత్పత్తి వరుసగా మూడో ఏడాది కూడా తగ్గడం అందుకు కారణమని తెలుస్తోంది.
కర్ణాటకలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభం
కిలో రూ.320 పలికిన గరిష్ఠ ధర
మన రాష్ట్రంలో తిరోగమనంలో మార్కెట్
ధరలు పెంచాలని రైతుల డిమాండ్
ఒంగోలు, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) : కర్ణాటకలో ఈ సీజన్ పొగాకు కొనుగోళ్లు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఽగరిష్ఠ ధర కిలో రూ.320 పలికింది. పొగాకు బోర్డు చరిత్రలోనే వేలం ప్రారంభం రోజున ఈస్థాయి ధర లభించడం ఇదే ప్రథమం. అక్కడ పంట ఉత్పత్తి వరుసగా మూడో ఏడాది కూడా తగ్గడం అందుకు కారణమని తెలుస్తోంది. మన రాష్ట్రంలో ప్రస్తుత సీజన్ పొగాకు కొనుగోళ్లు ఇంకా కొనసాగుతు న్నాయి. ఇక్కడ మార్కెట్ తిరోగమనంలో ఉంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్ణాటకలో గతంలో వలే ఈ సీజన్‌లో కూడా 100 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి పొగాకు బోర్డు అనుమతి ఇచ్చింది. సుమారు 85 మిలియన్ కిలోలు ఉత్పత్తి అయినట్లు అంచనా. ఈనేపథ్యంలో ప్రస్తుత సీజన్ కొనుగోళ్లను బుధవారం బోర్డు అధికారులు ప్రారంభించారు. తొలిరోజు ఒక్కో వేలం కేంద్రంలో 18 బేళ్ల వంతున అమ్మకానికి అనుమతించారు. మేలు రకం బేళ్లనే అక్కడి రైతులు తీసుకురాగా అన్నింటినీ వ్యాపారులు కొనుగోలు చేశారు. గరిష్ఠ ధర కిలోకు రూ.320 ఇచ్చారు. గత ఏడాది కర్ణాటకలో కిలో రూ.290తో వేలం ప్రారంభించిన వ్యాపారులు ఈ సీజన్ ఆంధ్ర మార్కెట్‌లో కిలో రూ.280తో ప్రారంభించారు. అయితే ప్రస్తుత సీజన్ కర్ణాటకలో తొలిరోజు కిలోకు రూ.320 గరిష్ట ధర ఇచ్చారు. ఈ ఏడాది అక్కడ పొగాకు మార్కెట్ కాస్తంత ఆశాజనకంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఇక్కడ ధరలు ఆశించిన స్థాయిలో ఇవ్వకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. తమకు కూడా ధరలు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.