ఆరంభం అదుర్స్
ABN , Publish Date - Mar 11 , 2025 | 01:43 AM
పొగాకు వేలం ప్రారంభం రోజున ఊహించని రీతిలో రికార్డు స్థాయి ధర పలికింది. కిలోకు రూ.280 లభించింది. గత ఏడాది కిలో రూ.230తో ప్రారంభించిన వ్యాపారులు ఈసారి మరో రూ.50 పెంచారు. బోర్డు చరిత్రలోనే వేలం ప్రారంభ రోజున ఇంత ధర దక్కడం ఇదే ప్రథమం.

కిలో రూ.280 పలికిన పొగాకు ప్రారంభ ధర
బోర్డు చరిత్రలో ఇదే అత్యధికం
దక్షిణాదిలో మొదలైన ప్రస్తుత సీజన్ కొనుగోళ్లు
19న రెండో విడత ప్రారంభం
కొండపిలో చైర్మన్, ఒంగోలు-1లో ఈడీ హాజరు
మార్కెట్‌లో ఇదే ఒరవడి కోరుతున్న రైతులు
పొగాకు వేలం ప్రారంభం రోజున ఊహించని రీతిలో రికార్డు స్థాయి ధర పలికింది. కిలోకు రూ.280 లభించింది. గత ఏడాది కిలో రూ.230తో ప్రారంభించిన వ్యాపారులు ఈసారి మరో రూ.50 పెంచారు. బోర్డు చరిత్రలోనే వేలం ప్రారంభ రోజున ఇంత ధర దక్కడం ఇదే ప్రథమం. ఇలాగే ఈ ఏడాది పొడవునా మంచి ధరలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. దక్షిణాదిలో సోమవారం పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని ఒంగోలు-1, పొదిలి, కొండపి, నెల్లూరు జిల్లా కందుకూరు-1 కేంద్రాల్లో తొలి విడతగా మొదలయ్యాయి. ఈ ప్రాంతంలో ప్రస్తుత సీజన్‌కు 105 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతివ్వగా దాదాపు 161 మిలియన్ కిలోలు ఉత్పత్తి అయినట్లు అంచనా. కాగా కొండపి కేంద్రంలో పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్‌కుమార్, ఒంగోలు-1లో బోర్డు ఈడీ అద్దంకి శ్రీధర్‌బాబు వేలాన్ని ప్రారంభించి పరిశీలించారు.
ఒంగోలు, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): పొగాకు మార్కెట్ ఆరంభం అదిరిపోయింది. కొనుగోళ్ల ప్రారంభం రోజున గరిష్ఠ ధర కిలో రూ.280 పలికింది. గత ఏడాది వేలం ప్రారంభం రోజున కిలోకు రూ.230 ఇచ్చిన వ్యాపారులు ఈ సీజన్‌లో ఎవరి ఊహలకు అందని విధంగా ఏకంగా రూ.280 చెల్లిం చారు. రాష్ట్రంలో 16 వేలం కేంద్రాలలో ప్రస్తుత సీజన్ పొగాకు కొనుగోళ్లను మూడు విడతలలో చేపట్టాలని బోర్డు నిర్ణయించింది. అందులో దక్షిణాది ప్రాంతంగా పిలిచే మన జిల్లాతోపాటు నెల్లూరు జిల్లాలో ఉన్న 11 కేంద్రాలలో తొలుత నాలుగు చోట్ల, రెండో దశలో మిగిలిన ఏడు చోట్ల వేలం ప్రారంభానికి నిర్ణయించారు. తదనుగుణంగా సోమవారం దక్షిణాదిలో తొలిదశ పొగాకు కొనుగోళ్లకు శ్రీకారం పలికారు.
అంతర్జాతీయ అవసరమే కారణం
వేలం ముందు రోజు అధిక శాతం వ్యాపారులు గత ఏడాది కిలో రూ.230తో ప్రారంభించి నందున ఈ ఏడాది రూ.260తో చేద్దామని సూచించగా ఐటీసీ ప్రతినిధులు రూ.290 ప్రతిపాదించినట్లు సమాచారం. చివరకు కిలోకు ప్రారంభ ధర రూ.280 ఇచ్చి కొనుగోలు చేశారు. అంతర్జాతీయ అవస రాల కోసం తక్షణం కొంత మేలురకం పొగాకు కావాలని తెలుస్తోంది. దాని వల్ల తొలి రోజునే ఈ స్థాయి ధర లభించినట్లు చెప్తున్నారు. నిజానికి ఈ ఏడాది ఇచ్చిన అనుమతి కన్నా గత ఏడాది జరిగిన ఉత్పత్తి పరిమాణం కన్నా అధికంగానే పంట పండింది. ఈ ఏడాది దక్షిణాదిలో 105 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి పొగాకు బోర్డు అనుమతి ఇవ్వగా విస్తారంగా పంట సాగైంది. దీంతో సుమారు 161 మిలియన్ కిలోలు ఉత్పత్తి అంచనా వేస్తున్నారు.
కొండపిలో ప్రారంభించిన చైర్మన్
జిల్లాలోని ఒంగోలు-1, కొండపి, పొదిలి కేంద్రాలతోపాటు నెల్లూరు జిల్లాలోని కందుకూరు-1లో వేలం ప్రక్రియ మొదలైంది. కొండపిలో పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్‌కుమార్, ఒంగోలు-1 కేంద్రంలో బోర్డు ఈడీ అద్దంకి శ్రీధర్‌బాబు కొనుగోళ్లను ప్రారంభించారు. కొండపిలో బోర్డు వైస్ చైర్మన్ బొడ్డపాటి బ్రహ్మయ్య, స్థానిక అధికారులు హాజరు కాగా ఒంగోలు-1లో ఆర్‌ఎం లక్ష్మణరావు. ఇతర అధికారులు, రైతు నాయకులు ఉన్నారు. పొదిలి, కందుకూరు-1లలో అక్కడి పొగాకు బోర్డు అధికారులు, రైతు, వ్యాపార ప్రతినిధుల సమక్షంలో వేలం ప్రారంభించారు. అన్నిచోట్లా తొలిరోజున 18 బేళ్ల వంతున వేలానికి రైతులు తీసుకురాగా మొత్తాన్ని వ్యాపారులు కొన్నారు. నాలుగు కేంద్రాల్లోనూ గరిష్ఠ ధర కిలోకు రూ.280 లభించింది.
రైతుల్లో ఆనందం
తొలిరోజు లభించిన ధరతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కన్నా ఈ సీజన్‌లో సగటున 25శాతం ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి. గతం కన్నా 20 నుంచి 25శాతం పంట దిగుబడి తగ్గుతోంది. ఈ పరిస్థితిని వ్యాపారులు, బోర్డు అధికారులు గుర్తించి ఏడాది పొడవునా మార్కెట్‌లో ఇబ్బందులు రాకుండా కొనుగోలు చేయాలని పలువురు రైతు నాయకులు కోరుతున్నారు. ఇదే విషయాన్ని వారు అటు కొండపిలో చైర్మన్‌ను, ఇటు ఒంగోలులో ఈడీల దృష్టికి తీసుకెళ్లారు. కాగా తొలిరోజు ప్రారంభించిన ధరల పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని, భవిష్యత్‌లో కూడా ఇలాగే మంచి ధరలు లభించాలని ఆకాంక్షిస్తున్నట్లు బోర్డు ఈడీ శ్రీధర్‌బాబు ఒంగోలు-1 కేంద్రంలో కొనుగోళ్ల ప్రారంభం సందర్భంగా చెప్పారు.
పొగాకు బోర్డు వైస్ చైర్మన్‌గా బ్రహ్మయ్య బాధ్యతలు
పొగాకు బోర్డు వైస్‌చైర్మన్‌గా బొడ్డపాటి బ్రహ్మయ్య సోమవారం గుంటూరులోని ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో బోర్డు ప్రస్తుత చైర్మన్ చిడిపోతు యశ్వంత్‌కుమార్ చౌదరి, సభ్యులు, మాజీ చైర్మన్ వాసుబాబు, రైతు నాయకులు పోతుల నరిసింహారావు, కొండపి ఏఎంసీ మాజీ చైర్మన్ గొర్రెపాటి రామయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.