బండ్లమూడిలో రణరంగం
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:40 AM
కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవాల్సిన వివాదం చినికిచినికి గాలివానలా మారి దాడులకు దారితీసింది. కానిస్టేబుల్ వారిస్తున్నా సరే ఎస్సీలపై మరోవర్గం కర్రలతో దాడి చేసింది. ఈ ఘటన సోమవారం మండలంలోని బండ్లమూడి గ్రామ నడిబొడ్డున చోటుచేసుకుంది.
దళితులపై మరోవర్గం దాడి
ఎస్సీలకు చెందిన పొలంలో మేసిన గొర్రెలు
యజమాని ఇంటికి వెళ్లి బాధితుల నిలదీత
వాగ్వాదం జరగటంతో స్టేషన్‌కెళ్లి ఫిర్యాదు
హెడ్ కానిస్టేబుల్ వచ్చి గ్రామంలో విచారణ
చేస్తుండగా అక్కడకు చేరుకున్న ఎస్సీ వర్గీయులు
ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి కర్రలతో దాడి
నలుగురు ఎస్సీలకు గాయాలు, రిమ్స్‌కు తరలింపు
మరోవర్గానికి చెందిన ఇరువురికి గాయాలు
చీమకుర్తి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవాల్సిన వివాదం చినికిచినికి గాలివానలా మారి దాడులకు దారితీసింది. కానిస్టేబుల్ వారిస్తున్నా సరే ఎస్సీలపై మరోవర్గం కర్రలతో దాడి చేసింది. ఈ ఘటన సోమవారం మండలంలోని బండ్లమూడి గ్రామ నడిబొడ్డున చోటుచేసుకుంది. సీఐ దాసరి ప్రసాద్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎస్.సుబ్బారెడ్డికి చెందిన గొర్రెలు ఇదే గ్రామ ఎస్సీకాలనీకి చెందిన కంట్లం ఏసుదాసు, ఎలీసమ్మ, రామయ్యలకు చెందిన సరుగుడు పొలంలో పడటంతో పంట నష్టం జరిగింది. ఈ విషయమై నిలదీయడానికి పొలం యజమానులైన ఎస్సీలు సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ వాగ్వాదం చోటుచేసుకోవడంతో నష్టపరిహారం చెల్లిస్తామని సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు. అందుకు అంగీకరించని పొలం యజమానులు చీమకుర్తి పోలీస్‌స్టేషన్‌లో అతనిపై ఫిర్యాదు చేశారు. దీంతో స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ గ్రామానికి వచ్చి బస్టాండ్ సెంటర్‌లో విచారణ ప్రారంభించారు. అదేసమయంలో పొలం యజమానులు, మరికొంతమంది తమ బంధువులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీలు సామాజికవర్గం మొత్తాన్ని కలిపి మాట్లాడుతున్నారంటూ కొందరు అడ్డుకున్నారు. ‘మా ఇళ్ల మీదకే వచ్చి దౌర్జన్యం చేస్తారా..’ అంటూ అక్కడే ఉన్న కొంతమంది కర్రలతో ఎస్సీలపై ఒక్కసారిగా దాడికి దిగారు. మధ్యలో హెడ్ కానిస్టేబుల్ సర్దిచెబుతున్నా వినిపించుకోలేదు. దీంతో బండ్లమూడి బస్టాండ్ సెంటర్ రణరంగంగా మారింది. ఈ ఘటనలో ఎస్సీలు కంట్లం రామయ్య, ఏసుదాసు, ఏసేపు, మరో మహిళకు గాయాలయ్యాయి. వారిని బంధువులు చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇదే ఘటనలో గోపిరెడ్డి బాలఓబుల్‌రెడ్డి, మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిద్దరూ వైద్యం నిమిత్తం ఆసుపత్రికి వెళ్లారు. ఈ ఘటనపై కంట్ల ఏసుదాసు ఫిర్యాదు మేరకు వనిపెంట శ్రీనివాసరెడ్డి, బాలఓబుల్‌రెడ్డి, రమణారెడ్డి తదితరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఓబుల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ఐదుగురు ఎస్సీలపై కేసు నమోదు చేశారు. సీఐ ప్రసాద్ ఆసుపత్రికి వెళ్లి విచారిస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనటంతో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు.