Share News

అధికారులంటే లెక్కలేదు..!

ABN , Publish Date - Apr 20 , 2025 | 11:32 PM

పౌర సేవల్లోనే కాదు.. ప్రభుత్వ ఉన్నతాధికారులన్నా వారికి లెక్కలేదు. పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేష్‌ కుమార్‌, కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, ఎమ్మెల్యే జనార్దన్‌ పాల్గొనే సమావేశాలకు సైతం డుమ్మా కొట్టారు. ప్రత్యేకించి శనివారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో అందరూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అధికారులంటే  లెక్కలేదు..!
ఒంగోలులో శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర ర్యాలీ (ఫైల్‌)

నగర కమిషనర్‌ వెంకటేశ్వరరావు సీరియస్‌

29 మందికి మెమోలు జారీ.. మరి కొందరిపై వేటు..?

ఒంగోలు, కార్పొరేషన్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి) : పౌర సేవల్లోనే కాదు.. ప్రభుత్వ ఉన్నతాధికారులన్నా వారికి లెక్కలేదు. పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేష్‌ కుమార్‌, కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, ఎమ్మెల్యే జనార్దన్‌ పాల్గొనే సమావేశాలకు సైతం డుమ్మా కొట్టారు. ప్రత్యేకించి శనివారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో అందరూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే సచివాలయ సెక్రటరీలు డుమ్మా కొట్టారు. ఒంగోలు నగరపాలక సంస్థ, మెప్మా సంయుక్తంగా స్వచ్ఛతపై భారీ ర్యాలీ, అనంతరం సమావేశం నిర్వహించగా, ఆ కార్యక్రమానికికలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తోపాటు, ప్రభుత్వ శాఖల అధికారులు సైతం మండుటెండలో పాల్గొన్నారు. అదేవిధంగా మెప్మా ఆర్పీలు, పొదుపు సంఘాల సభ్యులు, మెడికల్‌ కాలేజి విద్యార్థులు, పలు ఇంజనీరింగ్‌ కాలేజి విద్యార్థులు, ఇతర ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతోనే సమావేశం కొనసాగింది. ఈ విషయంలో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కార్పొరేషన్‌ అధికారులు, మెప్మా అధికారులు ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ, అందులో ముఖ్యపాత్ర పోషించి, బాధ్యతగా వ్యవహరించాల్సిన సచివాలయ సెక్రటరీలు మాత్రం ముఖం చాటేశారు. ఈ విషయాన్ని గుర్తించిన నగర కమిషనరు వెంకటేశ్వరరావు సీరియస్‌ అయినట్లు సమాచారం. కార్యక్రమం ప్రారంభం అయినప్పటి నుంచి ముగిసే వారకు సచివాలయ సెక్రటరీలు, నోడల్‌ ఆఫీసర్లు, పలు సెక్షన్‌ల అధికారులు, పలువురు ఉద్యోగులు పాల్గొనాలని కమిషనరు ముందురోజే ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా హాజరైన ప్రతి ఒక్కరూ సంతకాలు చేయాలని కమిషనరు తెలిపారు. ఇంతవరకు బాగానే ఉన్నా, అక్కడకు విచ్చేసిన కొందరు సెక్రటరీలు పీవీఆర్‌ బాలుర స్కూలు వద్ద వద్ద ర్యాలీ ప్రారంభం కాగానే అక్కడ నుంచి జారుకున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే కొందరు ర్యాలీ మధ్యలో, మరి కొందరు అసలు హాజరు కాలేదనే విషయాన్ని అధికారులు గుర్తించారు. దాంతో కమిషనరు మరింత ఆగ్రహం వ్యక్తం చేసి, 29 మంది సెక్రటరీలకు మెమోలు జారీ చేయగా, సమావేశానికి హాజరు కాని వారి వివరాలు తెలిజేయాలని కమిషనరు కార్యాలయ మేనేజర్‌ శ్రీహరిని ఆదేశించారు. అలాగే సమావేశానికి హాజరు కాకుండానే హాజరు అయినట్లు చెప్పుకుంటున్నవారు సమావేశంలో పాల్గొన్నట్లు ఆధారాలతో వివరణ ఇవ్వాలని సూచించారు.మొత్తంగా సచివాలయ సెక్రటరీల బాధ్యతా రాహిత్యంపై సీరియ్‌సగా ఉన్న కమిషనరు శాఖపరంగా చర్యలకు సిద్ధం అయ్యారు.

బాధ్యత లేని సెక్రటరీలపై చర్యలు

- కమిషనరు వెంకటేశ్వరరావు

నగర కమిషనరు వెంకటేశ్వరరావు ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఒంగోలులో జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి జిల్లా స్పెషలాఫీసర్‌, మునిసిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కలెక్టర్‌, ఒంగోలు ఎమ్మెల్యే, ఇతర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులందరూ హాజరయినా, సచివాలయ సెక్రటరీలు హాజరు కాకపోవడాన్ని గుర్తించాము. వారి బాధ్యత రాహిత్యం స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయమై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధం అయ్యాము. ఇప్పటికే 29 మందికి మెమోలు జారీ చేశాము. మిగిలిన వారికి కూడా జారీ చేస్తున్నాము. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి, సమావేశానికి గైర్హాజరయిన వారిని ఎవరినీ ఉపేక్షించేది లేదు. సెక్రటరీలు అందరితో సమావేశం నిర్వహించి చర్యలు తీసుకుంటాం.

Updated Date - Apr 20 , 2025 | 11:32 PM