మహిళా లోకం.. మహదానందం
ABN , Publish Date - Aug 17 , 2025 | 02:41 AM
ప్రతి ఆడపడుచుకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడం ఆనందంగా ఉందని మహిళలు వెల్లడిస్తున్నారు. స్త్రీశక్తి పథకం సూపర్ సక్సెస్ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం జిల్లాలో ఆర్టీసీ బస్సులన్నీ కిటకిటలాడాయి.
స్త్రీశక్తితో ఉచిత ప్రయాణంపై సర్వత్రా హర్షం
జిల్లాలో తొలిసారిగా 90శాతం మహిళల ప్రయాణం
ఆర్టీసీ బస్సులు, బస్టాండ్‌లన్నీ కిటకిట
పురుషులకు సీట్లు దొరకని పరిస్థితి
ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు
ప్రతి ఆడపడుచుకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడం ఆనందంగా ఉందని మహిళలు వెల్లడిస్తున్నారు. స్త్రీశక్తి పథకం సూపర్ సక్సెస్ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం జిల్లాలో ఆర్టీసీ బస్సులన్నీ కిటకిటలాడాయి. సాధారణ రోజుల్లో 40శాతం మాత్రమే మహిళలు ప్రయాణిస్తుండగా, ఉచిత ప్రయాణం పుణ్యమా అని శనివారం ఒక్కరోజే90శాతం మహిళలు ప్రయాణించారు. అందుకు పెళ్లిళ్ల సీజన్ కావడం ఒక కారణం. దీంతో పల్లెవెలుగు, ఆలా్ట్ర పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో పురుషులకు సీటు దొరకని పరిస్థితి కనిపించింది. ఆర్టీసీ ఆర్‌ఎం సత్యనారాయణ, సూపరింటెండెంట్ ఫణికుమార్‌లు ఒంగోలు నుంచి మార్కాపురం వరకు బస్సుల్లో ప్రయాణించి పథకం అమలు తీరును పర్యవేక్షించారు.
ఒంగోలు కార్పొరేషన్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ప్రభుత్వ సూపర్ సిక్స్ హామీలలో మరో మైలురాయి పడింది. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ప్రతి మహిళ మోములో చిరునవ్వు వెల్లివిరుస్తోంది. వృద్ధులు, విద్యార్థులు, చిరువ్యాపారాలు చేసుకునే మహిళలతోపాటు గృహిణులు మరింత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘చంద్రబాబునాయుడు చల్లంగుండాలి’ అని దీవిస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఈ పథకం అమలు కావడం పట్ల ప్రతి మహిళా సంతోషం వెలిబుబుచ్చుతోంది. జిల్లాలోని అన్ని బస్టాండ్‌లు శనివారం కిటకిటలాడాయి. పథకం ప్రారంభమైన కొద్ది గంటల నుంచే ఈ పరిస్థితి కనిపించింది. మరో వైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో బస్సులో కాలు పెట్టే పరిస్థితి లేదు. ముఖ్యంగా స్త్రీశక్తి కోసం కేటాయించిన పల్లె వెలుగు, ఆలా్ట్ర పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో అత్యఽధిక శాతం మహిళలు ప్రయాణిస్తున్నారు. దీంతో పురుషులకు సీట్లు లభించని పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సత్యనారాయణ, సూపరింటెండెంట్ బాలిశెట్టి ఫణికుమార్ శనివారం ఒంగోలు, సంతనూతలపాడు, చీమకుర్తి, పొదిలి, మార్కాపురం వరకు బస్సులో ప్రయాణించారు. బస్సు కండిషన్, మహిళా ప్రయాణికులకు లభిస్తున్న సౌకర్యాలు, ఎదురవుతున్న ఇబ్బందులను పరిశీలించారు. ఆయా డిపోలలో మహిళల అభిప్రాయాలను తెలుసుకోవడంతోపాటు, సూచనలు అడిగారు. ముఖ్యంగా డిపోలలో మంచినీరు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు సౌకర్యాలను పరిశీలించారు. ఆయా డిపోల మేనేజర్లతో సమావేశమై పథకం విజయవంతమయ్యే విధంగా ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని ఆదేశించారు.