పోలీసు స్టేషన్‌లో హల్‌చల్
ABN , Publish Date - Oct 14 , 2025 | 01:17 AM
చీమకుర్తిలో ఓ లారీ డ్రైవర్‌పై యజమాని దాడి చేసిన విషయంలో మార్కాపురంలో కేసు నమోదు చేయాలని పట్టుబట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటన సోమవారం మార్కాపురం టౌన్ పోలీసు స్టేషన్‌లో చోటుచేసుకుంది.
చీమకుర్తిలో డ్రైవర్‌పై యజమాని దాడి
మార్కాపురంలో కేసు నమోదుకు పట్టు
టౌన్ ఎస్సైతో సీఐటీయూ నాయకుల వాగ్వాదం
మార్కాపురం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : చీమకుర్తిలో ఓ లారీ డ్రైవర్‌పై యజమాని దాడి చేసిన విషయంలో మార్కాపురంలో కేసు నమోదు చేయాలని పట్టుబట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటన సోమవారం మార్కాపురం టౌన్ పోలీసు స్టేషన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే .. స్థానిక సుందరయ్య కాలనీకి చెందిన దాసరి నారాయణ చీమకుర్తి సమీపంలో ఒక కంకర మిల్లులో టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం కంకర అన్‌లోడ్‌కి వెళ్లి తిరిగి వచ్చిన నారాయణ మద్యం సేవించి ఉన్నట్లు యజమాని అనుమానించి దాడిచేసి కొట్టాడు. దీంతో డ్రైవర్ నారాయణ పొదిలిలో చికిత్ప పొందాడు. తనపై దాడి చేసిన యజమానిపై చర్యలు తీసుకోవాలని సోమవారం సీఐటీయూ నాయకులతో కలిసి మార్కాపురం టౌన్ పోలీసు స్టేషన్‌కు వచ్చారు. ఈ క్రమంలో టౌన్ ఎస్సై ఎం.సైదుబాబు మీరు చీమకుర్తిలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇక్కడే కేసు నమోదు చేసి యజమానిని పిలిపించి డ్రైవర్‌కు న్యాయం చేయాలని సీఐటీయూ నాయకుడు రూబెన్ ఎస్‌ఐపై ఒత్తిడి తెచ్చారు. జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తానని.. చీమకుర్తి వెళితే మీకు న్యాయం జరుగుతుందని ఎస్‌ఐ స్పష్టం చేశారు. దీనికి అంగీకరించని వారు ఎస్‌ఐతో వాగ్వివాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో రూబెన్‌తోపాటు డ్రైవర్ నారాయణను విధులకు ఆటంకం కల్గించారని స్టేషన్‌లోనే ఉంచారు. విషయం తెలుసుకున్న సుందరయ్య కాలనీ వాసులు 50మంది స్టేషన్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తమ వారిని బయటకు పంపాలని కాలనీవాసులు నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు వారికి, పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. చివరికి ఇరువురిని బయటకు పంపడంతో పరిస్థితి సద్దుమణిగింది.