ఫీడర్ కాలువకు టెండర్లు
ABN , Publish Date - Oct 02 , 2025 | 02:21 AM
వెలిగొండ తొలిదశను వచ్చే ఏడాది ఆగస్టుకు పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రాజెక్టు అధికారులు మరో అడుగు ముందుకు వేశారు. ప్రస్తుతం అత్యంత కీలకంగా భావిస్తున్న ఫీడర్ కెనాల్ ఆధునికీకరణ పనులకు టెండర్లు పిలిచారు.
రూ.370 కోట్లతో లైనింగ్, కాంక్రీటు గోడ నిర్మాణ పనులు
ఈనెల 15 వరకు గడువు
16న సాంకేతిక, 22న ఆర్థిక బిడ్‌ల పరిశీలన
నెలాఖరుకు అగ్రిమెంట్ పూర్తయ్యే అవకాశం
వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో కీలక అడుగు
ఒంగోలు, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : వెలిగొండ తొలిదశను వచ్చే ఏడాది ఆగస్టుకు పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రాజెక్టు అధికారులు మరో అడుగు ముందుకు వేశారు. ప్రస్తుతం అత్యంత కీలకంగా భావిస్తున్న ఫీడర్ కెనాల్ ఆధునికీకరణ పనులకు టెండర్లు పిలిచారు. తీవ్ర ప్రతికూల ఆర్థిక పరిస్థితుల్లోనూ వెలిగొండపై సీఎం ప్రత్యేక దృష్టితో నిధులకు భరోసా ఇచ్చిన విషయం విదితమే. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో చేసిన పనులకు సైతం పేరుకుపోయిన బకాయిల్లో రూ.344 కోట్లు చెల్లింపులను ఇటీవల చేయడంతోపాటు మరో రూ.456 కోట్లను ఫీడర్ కాలువ పనుల కోసం మంజూరు చేశారు. అలా చేసిన వారంరోజులకే ఆ పనులకు ప్రాజెక్టు అధికారులు టెండర్లు పిలిచారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో కాలువ పనులు చేసేందుకు రూ.370 కోట్లతో బుధవారం టెండర్లు పిలిచారు. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ.456 కోట్లు మంజూరు చేయగా 18 శాతం జీఎస్టీ, సీనరేజ్, ఇతరత్రా పోను రూ.370 కోట్లు అవసరంగా అంచనా వేసి ఆ మేరకు టెండర్లను ప్రాజెక్టు ఎస్‌ఈ అబుత్ అలీ పిలిచారు. ఇందులో ఫీడర్ కాలువ 21.80కి.మీ పొడవునా లైనింగ్ చేస్తారు. కాలువ అడుగు భాగంలో 23 వెడల్పు అలాగే ఇరువైపులా కట్టల లోపలి భాగంలో ఏటవాలుగా ఏడు మీటర్ల వంతున లైనింగ్ చేస్తారు. దోర్నాల మండలంలో కడపరాజుపల్లి వద్ద కాలువకు ఇరువైపులా ఒక్కొక్క వైపు 0.65 కి.మీ వంతున 1.30 కి.మీ, గంటవానిపల్లి వద్ద 2కి.మీ. పెద్దారవీడు మండలం కలుకానిపల్లి వద్ద మరో 2 కి.మీకుపైగా ఒక్కొక్క వైపున కాంక్రీటు గోడలను నిర్మించాలి. ఆ పనులను చేస్తేనే టెన్నెల్ ద్వారా కృష్ణానది నుంచి తీసుకునే నీరు డ్యామ్‌లోకి చేరుతుంది. దీంతో యుద్ధప్రాతిపదికన పనులు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వారం రోజులకే టెండర్లను పిలిచినట్లు ఎస్‌ఈ చెప్పారు. టెండర్లు దాఖలకు ఈనెల 15 వరకు గడువు ఇచ్చారు. ఆన్‌లైన్‌లోనూ దాఖలు చేసుకునే అవకాశం ఉంది. టెండర్లు దాఖల గడువు ముగిసిన మరుసటి రోజైన ఈనెల 6న దాఖలు చేసిన కంపెనీల సాంకేతిక బిడ్‌లను అధికారులు పరిశీలన చేయాలని నిర్ణయించారు. సాంకేతికంగా అర్హత పొందిన కంపెనీలకు సంబంధించిన ఆర్థిక బిడ్‌లను ఈనెల 22న పరిశీలించి తక్కువ కోడ్ చేసిన కంపెనీకి పనులు కేటాయిస్తారు. నెలాఖరులోగా అగ్రిమెంట్ కూడా పూర్తిచేసి ఆ వెంటనే పనులు ప్రారంభించే ఆలోచనతో అధికార యంత్రాంగం ఉన్నట్లు సమాచారం.