బకాయిల పేరుతో రూ.70లక్షలకు టెండర్?
ABN , Publish Date - Jul 29 , 2025 | 01:26 AM
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖలో బకాయిలు రావాలని ఒక కాంట్రాక్టరు తెచ్చిన వివరాలను అధికారులు కనీసం పరిశీలించకుండానే బిల్లులు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పాత బిల్లులు రావాలంటున్న కాంట్రాక్టర్
విద్యుత్‌శాఖలో నిధులు కాజేసే ఎత్తుగడ
ప్రతిపాదనలు పంపిన అధికారులు
తుది నిర్ణయం ఉన్నతాధికారులదేనని చెప్పి తప్పుకుంటున్న వైనం
త్రిపురాంతకం, జూలై 28 (ఆంధ్రజ్యోతి): గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖలో బకాయిలు రావాలని ఒక కాంట్రాక్టరు తెచ్చిన వివరాలను అధికారులు కనీసం పరిశీలించకుండానే బిల్లులు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో ఏకంగా రూ.70లక్షలు బిల్లు మార్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రతిపాదించిన ఈ బిల్లులు వాస్తవమేనని గతంలో పనిచేసి ఇప్పుడు ఉద్యోగ విరమణ చేసిన ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంతకాలతో పత్రాలు ఉన్నాయని సమాచారం. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జరుగుతున్న ఈ బిల్లుల బాగోతం తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి.
ఒప్పందం ఏమిటో..?
ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన ఒక విద్యుత్ కాంట్రాక్టరు తనకు 2014-19 మధ్యకాలంలో విద్యుత్తు పరికరాల రవాణాకు సంబంధించిన బిల్లులు రావాల్సి ఉందని అధికారులతో మాట్లాడుకున్నారు. పెద్దమొత్తంలో బిల్లులు రావాలని దాదాపు రూ.70లక్షలు బకాయి ఉన్నట్లు ప్రతిపాదనలు తెచ్చినట్టు సమాచారం. అధికారులకు, కాంట్రాక్టరుకు మధ్య కుదిరిన ఒప్పందం ఏమిటో తెలియదు కాని వీటిలో వాస్తవం ఉందా.. లేదా? అనేది పరిశీలించకుండానే.. రాజకీయ పలుకుబడి ఉన్న కాంట్రాక్టరుతో తమకెందుకులే అనుకున్నారో ఏమో.. తెచ్చిన వివరాలతో ప్రతిపాదనలు తయారు చేసి పంపించారు. వాస్తవానికి ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు, కండక్టరు, ఇతర పరికరాలు రవాణా చేసేందుకు కాంట్రాక్టరు అవసరమైతే ఆ శాఖ ముందుగానే కాంట్రాక్టు పిలవాలి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు పేరుతో అగ్రిమెంటు కావాలి. ఆ తరువాత రవాణా చేసిన పూర్తి వివరాలను అధికారులు ధ్రువీకరించి ప్రతిపాదనలు పంపాలి. ఇవేమీ లేకుండానే గతంలో మార్కాపురం డీఈగా పనిచేసి ఇప్పుడు ఉద్యోగ విరమణ చేసి ఉన్న ఒక అధికారి ధ్రువీకరణతో ఈ బిల్లులు మార్చేందుకు రంగం సిద్ధమైనట్టు కాంట్రాక్టర్లు, కూటమి నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. విషయం బయటకు రాగానే కిందిస్థాయి అధికారులు మాత్రం తమ వద్దకు కాంట్రాక్టరు తెచ్చిన ఆధారాలకు ప్రతిపాదనలు పంపామని ఇందులో తమ ప్రమేయం ఏమీ ఉండదని ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయమే తుదినిర్ణయమని చేతులు దులిపేసుకుంటున్నారు. మొత్తానికి ఇవి నిజమైన బిల్లులేనా? కాంట్రాక్టరుతో అగ్రిమెంటు ఉందా? అనే ప్రశ్నలకు మాత్రం అధికారుల వద్ద సమాధానం లేదు.