Share News

డెయిరీకి ఎసరు

ABN , Publish Date - Apr 10 , 2025 | 02:34 AM

కాపు కాసేవారు లేకపోవడంతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. కోట్ల విలువ చేసే డెయిరీ భూములను కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. పాలకేంద్రానికి చెందిన భూముల్లో పాగా వేసి అవన్నీ తమవి అని ప్రైవేటు వ్యక్తులు చెబుతున్నారు. కంచె దాటుకుని వచ్చి ఆయా భూములలో ఉన్న చెట్లను తొలగించడంతోపాటు ప్లాట్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

డెయిరీకి ఎసరు

పాలకేంద్రం భూముల్లో ప్లాట్లు

పట్టించుకునే వారే లేకపోవడంతో బరితెగిస్తున్న రియల్టర్లు

రూ.100 కోట్ల విలువైన స్థలాల కైవసానికి కొందరి యత్నం

ఆ ప్రాంతాన్ని పరిశీలించిన ఎస్‌ఎన్‌పాడు తహసీల్దార్‌

ఒంగోలుక్రైం, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): కాపు కాసేవారు లేకపోవడంతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. కోట్ల విలువ చేసే డెయిరీ భూములను కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. పాలకేంద్రానికి చెందిన భూముల్లో పాగా వేసి అవన్నీ తమవి అని ప్రైవేటు వ్యక్తులు చెబుతున్నారు. కంచె దాటుకుని వచ్చి ఆయా భూములలో ఉన్న చెట్లను తొలగించడంతోపాటు ప్లాట్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. విషయం తెలిసి అధికారులు స్పందించడంతో తాత్కాలికంగా పనులను నిలిపివేశారు. విజయ డెయిరీ పేరుతో ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన ఒంగోలు పాలకేంద్రం ప్రస్తుతం పట్టించుకునేవారు లేక కునారిల్లుతోంది. కోట్లాది విలువైన ఆస్తులు, భూములు ఉన్నాయి. అయితే వాటిని కాజేసేందుకు అనేకమంది పొంచి ఉన్నారు. పాలకేంద్రం కోసం అప్పట్లో 78.10 ఎకరాలు భూమిని సేకరించి డెయిరీని, ఉద్యోగుల క్వార్టర్లు నిర్మించారు. అందులోనే పాలపొడి ఫ్యాక్టరీని స్థాపించారు. జిల్లాలో విజయ డెయిరీ పేరుతో సుమారు 50వేల మంది పాడిరైతులు సభ్యులుగా అర్ధశతాబ్దానికిపైగా విల్లిసిల్లింది. గత వైసీపీ హయాంలో మూతపడింది.

వైసీపీ హయాంలో మూసివేత

వైసీపీ వచ్చిన తర్వాత డెయిరీని ప్రైవేటు సంస్థ అయిన అమూల్‌కు అప్పగించారు. అక్కడ ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను బలవంతంగా ఉద్యోగ విరమణ చేయించారు. కొద్దిరోజుల తర్వాత నడపలేక డెయిరీని మూసి వేయించారు. కర్నూల్‌ రోడ్డు పక్కనే ఉండటం, నగరానికి అత్యంత దగ్గర కావడంతో అక్కడ భూముల ధరలు నింగిని అంటుతున్నాయి. మొత్తం 78.10 ఎకరాల భూమి డెయిరీకి ఉంది. 2011లో సర్వే చేసి హద్దులు వేశారు. అలాగే అప్పటి కమిటీ చుట్టూ కంచె కూడా ఏర్పాటు చేయించింది. ప్రస్తుతం పట్టించుకునే వారు లేకపోవడంతో ఇదే అదనుగా పాలకేంద్రం భూములను కబ్జా చేసేందుకు కొందరు సిద్ధమయ్యారు.

పాలకేంద్రం భూముల వివరాలు

ఒంగోలు సహకార డెయిరీ కోసం అప్ప ట్లో పేర్నమిట్ట సమీపంలో కర్నూల్‌ రోడ్డు పక్కన 78.10 ఎకరాల భూమిని సేకరిం చారు. రోడ్డు పక్కనే ఉన్న ఏడు ఎకరాలలో డెయిరీ కోసం భవనాలు నిర్మించారు. ఉద్యోగుల నివాసాలు, ఇతర అవసరాల కోసం 12.10 ఎకరాలు కేటాయించారు. మిగిలిన భూమిలో 20 ఎకరాలు జామయిల్‌ తోట వేశారు. డెయిరీ వెనుక భాగం 19 ఎకరాలు, ముందుభాగం 20 ఎకరాలు ఇతర అవసరాల కోసం మిగులుగా ఉంది.

కంచె దాటి కబ్జాకు యత్నం

నాలుగు రోజుల క్రితం కొందరు వ్యక్తులు డెయిరీ కంచెను దాటి లోపలికి ప్రవేశించారు. సంస్థకు చెందిన భూముల్లోని చెట్లను తొలగించారు. ట్రాక్టర్లతో రాత్రుళ్లు చదునుచేసే పనులను ప్రారంభించారు. సర్వే నంబరు 140/1లో పాలకేంద్రం కోసం 5.27 ఎకరాలు భూమిని సేకరించినట్లు రికార్డులు ఉన్నాయి. అందులో 2.37 ఎకరాల్లో గతంలో ప్లాట్లు వేశారని, 48 ప్లాట్లు వేయగా తాము కొనుగోలు చేసినట్లు సదరు వ్యక్తులు చెబుతున్నట్లు తెలిసింది. వారు తమ పేర్లు బయట పడకుండా ఆ భూమలు తమవే అంటూ వ్యవహారం నడుపుతున్నారు. వారే భూమిని చదును చేసినట్లు అధికారులు గుర్తించారు. మరో సర్వే నంబరులో కూడా సుమారు 5 ఎకరాలు చదును చేయడానికి చెట్లు పీకించారు. ఇలా పాలకేంద్రం భూములు కబ్జా చేసేందుకు దర్జాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కబ్జాదారులు కైవసం చేసుకోవాలనుకునే భూముల విలువ సుమారు రూ.100 కోట్ల వరకు ఉంటుదని అంచనా. అయితే విషయం తెలిసి మంగళవారం సంతనూతలపాడు తహసీల్దార్‌ ఆదిలక్ష్మి రెవెన్యూ సిబ్బందితో కలిసి వెళ్లి భూములను పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను నిలిపివేయించారు. ఆ భూములకు సంబంధించి హక్కుపత్రాలు ఉంటే తనకు వచ్చి చూపాలని ఆదేశించారు. అయితే ఇంతవరకు ఎవరు తహసీల్దార్‌ ముందుకు రాకపోవడం గమనార్హం.

భూమిని పరిశీలించాం

డెయిరీ భూమిని కొందరు చదును చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. మంగళవారం వెళ్లి పరిశీలించా. వారు సర్వే నంబరు 140/1లో హక్కులు ఉన్నాయని చెప్పారు. ఇంతవరకూ హక్కు పత్రాలు తీసుకు రాలేదు. భూమిని చదును చేస్తున్న విషయాన్ని డెయిరీ సీఈవో జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అక్కడ చదును చేసే పనులను నిలిపివేయించాం. ఎవరైనా హక్కులు ఉంటే మాకు చూపాలి, లేకుండా భూమిలోకి ప్రవేశిస్తే చర్యలు తీసుకుంటాం.

Updated Date - Apr 10 , 2025 | 02:34 AM