రూ.కోటి ఆస్తికి టెండర్!
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:49 AM
గుంటి గంగమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవస్థాన అన్నదాన సత్రం పేరిట నిధులు సమకూర్చి భవనాన్ని నిర్మించారు. అయితే ఆలయ కమిటీ తాజా మాజీ చైర్మన్ దాన్ని శ్రీగంగమ్మ అన్నదాన ట్రస్ట్ సత్రంగా మార్చడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విరాళాలతో నిర్మించిన అన్నదాన సత్రాన్ని తన సొంతమన్నట్లు ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కొసనా గురుబ్రహ్మం మార్చడం పట్ల దాతలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దేవస్థాన సత్రం.. ట్రస్ట్‌కు బదలాయింపు
రహస్యంగా రిజిస్ట్రేషన్
గుంటిగంగ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నిర్వాకం
తాళ్లూరు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : గుంటి గంగమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవస్థాన అన్నదాన సత్రం పేరిట నిధులు సమకూర్చి భవనాన్ని నిర్మించారు. అయితే ఆలయ కమిటీ తాజా మాజీ చైర్మన్ దాన్ని శ్రీగంగమ్మ అన్నదాన ట్రస్ట్ సత్రంగా మార్చడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విరాళాలతో నిర్మించిన అన్నదాన సత్రాన్ని తన సొంతమన్నట్లు ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కొసనా గురుబ్రహ్మం మార్చడం పట్ల దాతలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవస్థాన అన్నదాన సత్రం నిర్మించాలని 2023 డిసెంబర్ 1న ఏకగ్రీవ తీర్మానం చేశారు. అందుకోసం గుడికి సమీపాన 20సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. దాదాపు రూ.60లక్షలతో సత్రాన్ని నిర్మించారు. దీన్ని గత ఏడాది 25వతేదీన ప్రారంభించేందుకు శిలాఫలాకాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఏ కారణంచేతనో అది ఆగిపోయింది. ఆలయ కమిటీ తాజా మాజీ చైర్మన్ కొసనా గురుబ్రహ్మం దేవస్థాన సత్రాన్ని సొంత ట్రస్ట్‌గా మార్పు చేశారు. ఆ సత్రం పేరును అత్యంత రహస్యంగా శ్రీ గుంటిగంగమ్మ అన్నదాన సత్రం ట్రస్ట్‌గా రిజిస్ర్టేషన్ చేయించారు. ఆలయకమిటీ సభ్యులను తొలగించి ట్రస్ట్ చైర్మన్‌గా గురుబ్రహ్రం, సభ్యులుగా ఆయన కుమారుడు కొసనా శివరాజ్, అవిశనేని వెంగన్న, నన్నూరి శ్రీనివాసరెడ్డి, సానె ఆంజనేయులుని నియమించారు. కోటి రూపాయల విలువైన ఆస్తిని తన సొంతమన్నట్లు ట్రస్ట్‌గా ఏర్పాటుచేసి తానే చైర్మన్‌గా ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈవిషయాన్ని దేవదాయ శాఖ అధికారులు, దాతలకు తెలియకుండా గోప్యంగా ఉంచారు. ఆలయ కమిటీ చైర్మన్‌గా గురుబ్రహ్మం పదవీకాలం గత అక్టోబరు 25న ముగిసింది. ఆగమేఘాల మీద గతనెల 24న ఎంపీ మాగుంట, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ లక్ష్మి చేతులు మీదుగా ప్రారంభించారు. గతంలో దేవస్థాన సత్రం పేరుతో సత్రం భవనంపై ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని తొలగించారు. గోప్యంగా శ్రీగుంటిగంగమ్మ అన్నదాన ట్రస్ట్ సత్రంగా శిలాఫలకం ఏర్పాటుచేశారు. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.