టంగుటూరు-పొదిలి రహదారికి తాత్కాలిక మరమ్మతులు
ABN , Publish Date - Nov 01 , 2025 | 12:00 AM
టంగుటూరు-పొదిలి ఆర్‌అండ్‌బీ రహదారి మర్రిపూడి చెరువు కట్ట కింద కోనేరుల వద్ద అత్యంత ప్రమాదకరంగా తయారైంది. తుఫాన్‌తో మర్రిపూడి చెరువు పూర్తిస్థాయిలో నిండటంతో కట్ట కింద ఉన్న కోనేరులలోకి సమృద్ధిగా నీటి ఊట చేరింది.
మంత్రి ఆదేశంతో కదిలివచ్చిన ఆర్‌అండ్‌బీ అధికార యంత్రాంగం
మర్రిపూడి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి) : టంగుటూరు-పొదిలి ఆర్‌అండ్‌బీ రహదారి మర్రిపూడి చెరువు కట్ట కింద కోనేరుల వద్ద అత్యంత ప్రమాదకరంగా తయారైంది. తుఫాన్‌తో మర్రిపూడి చెరువు పూర్తిస్థాయిలో నిండటంతో కట్ట కింద ఉన్న కోనేరులలోకి సమృద్ధిగా నీటి ఊట చేరింది. 40 ఏళ్ల క్రితం నిర్మించిన రక్షణ గోడలు కూలిపోవడంతో అంచులు విరిగిపడి భారీ వాహనాలు కోనేరులో పడిపోయే ప్రమాదం ఏర్పడింది. ఏ మాత్రం ఆదమరిస్తే ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో శుక్రువారం మర్రిపూడి పర్యటనకు వచ్చిన మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి దృష్టికి పలువురు రోడ్డు దుస్థితిని తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి వెంటనే ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ డీఈ ఆనందరావుని ఫోన్‌లో ఆదేశించారు. జిల్లా పర్యటనలో ఉన్న ఆర్‌అండ్‌బీ సీఈ శేషుకుమార్ మంత్రి ఆదేశాల మేరకు హుటాహుటిన వచ్చి రహదారిని పరిశీలించారు. కోనేరులను పూడ్చేందుకు అంచనాలను రూపొందించాలని అధ్వానంగా ఉన్న టంగుటూరు-పొదిలి రహదారి అభివృద్ధికి సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలని సీఈ ఆదేశించారు. తాత్కాలికంగా కుంగిపోయిన రోడ్డుకు మెటల్ డస్టుతో మరమ్మతులు చేయించారు. పడిపోయిన రక్షణ గోడల పక్కనే ఇసుక బస్తాలను ఏర్పాటు చేసి రేడియం స్టిక్కర్లు అతికించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని డీఈ ఆనందరావు తెలిపారు. సీఈ వెంట ఎస్‌ఈ రవినాయక్, ఈఈ గోపీనాయక్ ఉన్నారు.