Share News

జగనన్న కాలనీల్లో కన్నీళ్ల వ్యథలు

ABN , Publish Date - Oct 30 , 2025 | 10:57 PM

గత వైసీపీ ప్రభుత్వంలో నేతల నిర్లక్ష్యపు పాపం నేడు పేదలకు శాపంగా మారింది. ‘జగనన్న’ పేరుతో కాలనీని ఏర్పాటు చేసినా కనీస వసతులు ఏర్పాటు చేయలేదు. అయినప్పటికీ, నాటి వైసీపీ పాలకులు వీటిని కాలనీలు కాదని, కొత్త ఊళ్లని ఊదరగొట్టారు. తీరా ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఆ కాలనీలు నివాసయోగ్యం కాని చిట్టడువులుగా మారాయి.

జగనన్న కాలనీల్లో కన్నీళ్ల వ్యథలు
బొమ్మనంపాడురోడ్డులో ఉన్న జగనన్న కాలనీలో రోడ్లపై నిలిచి ఉన్న నీరు

కనీసవసతులు కల్పించకుండానే నివేశన స్థలాలు కేటాయింపు

ఒత్తిడి చేసి మరీ ఇళ్ల నిర్మాణాలు

నేటికీ వసతులు లేక పేదల అవస్థలు

అద్దంకి, అక్టోబరు30(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో నేతల నిర్లక్ష్యపు పాపం నేడు పేదలకు శాపంగా మారింది. ‘జగనన్న’ పేరుతో కాలనీని ఏర్పాటు చేసినా కనీస వసతులు ఏర్పాటు చేయలేదు. అయినప్పటికీ, నాటి వైసీపీ పాలకులు వీటిని కాలనీలు కాదని, కొత్త ఊళ్లని ఊదరగొట్టారు. తీరా ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఆ కాలనీలు నివాసయోగ్యం కాని చిట్టడువులుగా మారాయి.

వైసీపీ నేతల డాంభికాలు నమ్మి...

అద్దంకి పట్టణంలోని సుమారు రెండు వేల మంది లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వంలో మూడు చోట్ల కాలనీలు ఏర్పాటు చేశారు. అధికారులు, పాలకుల ఒత్తిడితో ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు తోడు లక్షల రూపాయలు సొంత డబ్బులు ఖర్చు చేసి ఇళ్లు నిర్మించుకున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేనాటికీ, ఆయా కాలనీలలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని నాడు నేతలు గొప్పలు చెప్పారు. ఎలాంటి మౌలిక వసతులు కల్పన చేపట్టకుండానే లబ్ధిదారులపై ఒత్తిడి చేసి గృహ ప్రవేశాలు చేయించారు. గత్యంతరం లేక పలువురు నివాసం ఉంటున్నారు. రోడ్లు, సైడ్‌ డ్రెయిన్లు, మంచినీటి వసతులు కల్పించలేదు.


చిట్టడవులను తలపిస్తున్న కాలనీ

బొమ్మనంపాడు రోడ్డులో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ అద్దంకి పట్టణానికి సుమారు 4 కి.మీ దూరంలో ఉంది. కనీస రవాణా వసతి కూడా లేదు. అక్కడ వెయ్యి మందికి స్థలాలు కేటాయించగా ప్రస్తుతం పదుల సంఖ్యలోనే నివాసం ఉంటున్నారు. అదే సమయంలో పెద్ద ఎత్తున చిల్లచెట్లు పెరిగి ప్రస్తుతం కాలనీ చిట్టడవిని తలపిస్తోంది. కాలనీకి వెళ్లే బొమ్మనంపాడు రోడ్డులో చినుకుపడితే వాహనాలు నడిచే పరిస్థితి లేకుండా పోయింది. వేలమూరిపాడు రోడ్డు, నాగులపాడు రోడ్లలో ఏర్పాటు చేసిన కాలనీలలో ఎక్కువ మంది లబ్ధిదారులు నివాసాలు ఉంటున్నా, వసతుల కల్పన మాత్రం జరగలేదు. దీంతో వర్షం కురిసినా ప్రతిసారి రోడ్లపై నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. కనీస వసతులు లేకపోవడంతో పలువురు ఇళ్లను వదిలేసి అద్దంకి పట్టణంలో ఇళ్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆయా కాలనీలలో మౌలిక వసతుల కల్పనపై ఇంకా దృష్టి పెట్టకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి.

Updated Date - Oct 30 , 2025 | 10:57 PM