Share News

స్పష్టతలేని సర్దుబాటుతో టీచర్లలో ఆందోళన

ABN , Publish Date - May 13 , 2025 | 02:09 AM

స్పష్టమైన ఉత్తర్వులు లేకుండా రోజుకో ఆలోచనతో జరుగుతున్న ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నదని యూటీఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కె.శ్రీనివాసరావు ఆరోపించారు. 117 జీవోను రద్దుచేసి కొత్త జీవోను విడుదల చేసి పాఠశాలల పునర్‌ వ్యవస్థీకరణ, టీచర్ల సర్దుబాటు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

స్పష్టతలేని సర్దుబాటుతో టీచర్లలో ఆందోళన
ధర్నాలో పాల్గొని నినాదాలుచేస్తున్న ఉపాధ్యాయులు

యూటీఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు శ్రీనివాసరావు

ఒంగోలులోని కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

ఒంగోలు విద్య, మే 12 (ఆంధ్రజ్యోతి) : స్పష్టమైన ఉత్తర్వులు లేకుండా రోజుకో ఆలోచనతో జరుగుతున్న ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నదని యూటీఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కె.శ్రీనివాసరావు ఆరోపించారు. 117 జీవోను రద్దుచేసి కొత్త జీవోను విడుదల చేసి పాఠశాలల పునర్‌ వ్యవస్థీకరణ, టీచర్ల సర్దుబాటు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణ, బదిలీలు, ఉద్యోగోన్నతులు తదితర సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా సోమవారం యూటీఎఫ్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ వారంవారం గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల నాయకులతో పాఠశాల విద్య కమిషనర్‌ సమావేశాలు నిర్వహించినా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. టీచర్ల ఉద్యోగోన్నతుల జాబితాల్లో తప్పులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు. ప్రాథమిక పాఠశాలల్లో 1:20 నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను కేటాయించాలని యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వీరాంజనేయులు డిమాండ్‌ చేశారు. స్కూల్‌ అసిస్టెంట్లను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోనే నియమించాలన్నారు. ధర్నాలో జిల్లా అధ్యక్షుడు షేక్‌ అబ్దుల్‌హై, నాయకులు ఐ.వి.రామిరెడ్డి, జి. ఉమా మహేశ్వరి, చిన్నస్వామి, డి.రాజశేఖర్‌, పి.వెంకటేశ్వర్లు, ఎం.శ్రీను, టి.రమణారెడ్డి, సిహెచ్‌.ప్రభాకర్‌రెడ్డి, బాల వెంకటేశ్వర్లు, ఎం.రాము తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2025 | 02:09 AM