బెల్ట్ షాపులపై టాస్క్‌ఫోర్స్ దాడులు
ABN , Publish Date - Dec 25 , 2025 | 11:02 PM
జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న మద్యం బెల్ట్ దుకాణాలపై టాస్క్‌ఫోర్స్ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. గురువారం ఎస్పీ వి.హర్షవర్ధనరాజు ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ అధికారులు పలు బెల్ట్ దుకాణాలపై దాడులు చేసి ఐదుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.
జిల్లాలోని ఐదు ప్రాంతాలలో తనిఖీలు
16 బీర్లు, 105 క్వార్టర్ల బాటిళ్ల మద్యం స్వాధీనం
ఒంగోలు క్రైం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న మద్యం బెల్ట్ దుకాణాలపై టాస్క్‌ఫోర్స్ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. గురువారం ఎస్పీ వి.హర్షవర్ధనరాజు ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ అధికారులు పలు బెల్ట్ దుకాణాలపై దాడులు చేసి ఐదుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. నాగులుప్పలపాడు, కొత్తపట్నం, మద్దిపాడు, ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలో ఈ దాడులు నిర్వహించారు. జాతీయ రహదారిపై మొబైల్ విక్రయాలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా బడ్డీకొట్లపైనా దాడులు చేశారు. మద్యం అక్రమ విక్రయాలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఆయా పోలీసు స్టేషన్లలో అప్పగించారు. ఈ దాడులపై టాస్క్‌ఫోర్స్ సీఐ సుధాకర్‌బాబును వివరణ కోరగా మద్దిరాలపాడు సమీపంలో జాతీయ రహదారిపై బెల్ట్ దుకాణం నిర్వహిస్తున్న ఎస్‌కే మహమద్ సాహెబ్‌ను అదుపులోకి తీసుకొని 6 బీర్ల్లు, 5 కార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చీరాల రోడ్డులో గల చదలవాడలో మద్యం విక్రయిస్తున్న బోయాడ గోపిని అదుపులోకి తీసుకొని 10 బీర్లు, 6 క్వార్టర్ బాటిళ్లు, గుండ్లాపల్లి జాతీయ రహదారిపై మద్యం విక్రయిస్తున్న మేదరమిట్ల రామారావును అదుపులోకి తీసుకొని 45 క్వార్టర్లు మద్యం, అలాగే శ్రీను వద్ద 18 క్యార్టర్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కొత్తపట్నం మండలం అల్లూరులో మద్యం బెల్ట్‌షాపు నిర్వహిస్తున్న శ్రీనివాసరావును అదుపులోకి తీసుకొని 31 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిత్యం మద్యం బెల్ట్ దుకాణాలపై దాడులు చేస్తామన్నారు. అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తుంటే 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని టాస్క్‌ఫోర్స్ సీఐ కోరారు.