Share News

అధ్వానంగా తాళ్లూరు - శివరాంపురం రోడ్డు

ABN , Publish Date - Nov 23 , 2025 | 10:26 PM

మండలంలో తాళ్లూరు - శివరాంపురం రోడ్డు అధ్వానంగా మారింది. ఈ ఆర్‌అండ్‌బీ రోడ్డు తాళ్లూరు నుంచి వెల్లంపల్లి వరకు ఉంది. బీటీ రోడ్డు మెటల్‌ రోడ్డును తలపిస్తుంది. దీంతో వాహనచోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అధ్వానంగా తాళ్లూరు - శివరాంపురం రోడ్డు

భారీ వాహనాలతో దెబ్బతిన్న వైనం

మరమ్మతుల గురించి పట్టించుకోని

ఆర్‌అండ్‌బీ అధికారులు

ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

తాళ్లూరు, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): మండలంలో తాళ్లూరు - శివరాంపురం రోడ్డు అధ్వానంగా మారింది. ఈ ఆర్‌అండ్‌బీ రోడ్డు తాళ్లూరు నుంచి వెల్లంపల్లి వరకు ఉంది. బీటీ రోడ్డు మెటల్‌ రోడ్డును తలపిస్తుంది. దీంతో వాహనచోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి శిద్దా రాఘవరావు తాళ్లూరు ప్రాంత ప్రజల రవాణా సౌకర్యార్థం సింగిల్‌ రోడ్డుగా ఉన్న ఈరహదారిని డబుల్‌ రోడ్డుగా మార్పుచేసి నిధులు మంజూరుచేశారు. దీంతో రోడ్డు నిర్మాణం చేపట్టగా 2018లో పూర్తయింది.

ప్రస్తుతం తాళ్లూరు మండలంలో గుండా బికేవీ హైవే రోడ్డు నిర్మాణ పనులు గత ఏడాదిగా జరుగుతున్నాయి. సమీప కొండ మట్టిని రోడ్డు నిర్మాణం కోసం భారీ వాహనాల్లో ఈరోడ్డు గుండా తరలిస్తున్నారు. శివరాంపురం శివారున సాగర్‌ కాలువ కట్ట మీదుగా కొండకు నిత్యం వందలాది టిప్పర్లు తిరుగుతున్నాయి. భారీ వాహనాల రాకపోకలతో తాళ్లూరు-శివరాంపురం సాగర్‌ కాలువ వరకు గల తారు రోడ్డు అధ్వానంగా మారింది. ఈమార్గంలో గుంతలు పూడుస్తూ మెటల్‌ వేయటంతో తారు రోడ్డు కాస్త మెటల్‌రోడ్డుగా మారింది. ఈమార్గం గుండా ద్విచక్రవాహనదారులు ప్రయాణించేటప్పుడు జారిపడుతూ గాయాల పాలవుతున్నారు. వాహనాలు వెళ్లేటప్పుడు కంకర్‌ లేచి రాళ్లు తగులుతున్నాయి. ఇప్పటికైనా సంబందిత ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి తాళ్లూరు-శివరాంపురం రోడ్డును హైవేరోడ్డు నిర్మాణ నిర్వాహకులతో బీటీరోడ్డుగా ఏర్పాటు చేయించి తమ ఇబ్బందులను తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - Nov 23 , 2025 | 10:26 PM