Share News

స్వామి.. ఇదేమి...?

ABN , Publish Date - Dec 23 , 2025 | 11:24 PM

పేరుకు 300 ఎకరాల ఆసామి. ‘అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని’ అన్న చందంగా ఉంది దేవాలయ పరిస్థితి. అటు ఆలయ బాధ్యతలు చేపట్టే అధికారులు గాని, రెండేళ్లకోసారి ఏర్పడే పాలకమండళ్లు కాని ఆలయ అభివృదిఽ్ధపై శీతకన్ను వేశారు. కారణాలు ఏమైనప్పటికీ ప్రస్తుతం ఆలయం కళావిహీనంగా మారింది. ఇదీ జరుగుమల్లి మండలంలోని దావగూడూరులోని శ్రీ శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి ఆలయ కథ...

స్వామి.. ఇదేమి...?
శ్రీప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయం

కళావిహీనంగా దావగూడురులోని శ్రీప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయం

300 ఎకరాల భూమి.. ఏటా లక్షలాది రూపాయల కౌలు వస్తున్నా ఉపయోగం నిల్‌

భక్తులకు సౌకర్యాలు లేవు

ఏమాత్రం పట్టించుకోని అధికారులు

ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టని పాలక కమిటీలు

దావగూడూరు(కొండపి), డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి) : పేరుకు 300 ఎకరాల ఆసామి. ‘అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని’ అన్న చందంగా ఉంది దేవాలయ పరిస్థితి. అటు ఆలయ బాధ్యతలు చేపట్టే అధికారులు గాని, రెండేళ్లకోసారి ఏర్పడే పాలకమండళ్లు కాని ఆలయ అభివృదిఽ్ధపై శీతకన్ను వేశారు. కారణాలు ఏమైనప్పటికీ ప్రస్తుతం ఆలయం కళావిహీనంగా మారింది. ఇదీ జరుగుమల్లి మండలంలోని దావగూడూరులోని శ్రీ శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి ఆలయ కథ...

300 ఎకరాల పొలం..

చెన్నకేశవస్వామికి దాదాపు 300 ఎకరాల పొలం ఉంది. ఇందులో దాదాపు 30 ఎకరాలు స్వామి వారి సేవకులది కాగా, మిగతా 270 ఎకరాలు ఏటా కౌలుకు రైతులకు ఇస్తుంటారు. సరాసరి ఎకరాకు కౌలు రూ.10 వేల నుంచి రూ.13 వేల చొప్పున వేసుకున్నా దాదాపు 25నుంచి 35 లక్షలు రూపాయలు వస్తుంటాయి. ఆలయ నిర్వహణకు, జీతాలు, ఇతర ఖర్చుల కింద నెలకు లక్ష రూపాయలు ఖర్చు చేస్తుంటారు.

వెలిసిపోయిన ఆలయ రంగులు

మూడేళ్లు క్రితం ఆలయానికి రంగులు వేయించారు. ప్రస్తుతం అవన్నీ వెలిసిపోయాయి. నాణ్యతను అప్పట్లో ప్రశ్నించినా పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్థులు అంటున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసినపుడు పట్టుమని పదేళ్లయినా లేవని, నాసికకం రంగులు వేశారని చెబుతున్నారు. అదే సొంత పనులకు ఇలాగే చేస్తారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఈవో కార్యాలయం పడిపోయి పదేళ్లు..

ఆలయ ఈవో, రికార్డుల నిర్వహణ కార్యాలయం పడిపోయి పదేళ్లు అయ్యింది. ఇప్పటి వరకు కార్యాలయం కట్టలేదు. ఆలయంలోని వెనుక వైపు ఉన్న స్వామి ఆభరణాలు, ఇతర స్వామి వాహనాలు భద్రపరిచే గదుల్లో ఒక దానిని ఆలయ అధికారులు తమ అవసరాలకు వాడుకుంటున్నారు. భక్తులకు టాయిలెట్లు కాని, గదులు గాని నిర్మించడం లేదు.

వందరాళ్లు.. 30వేలు.....

రెండేళ్ల క్రితం స్వామి వారి భూములను సర్వే చేయించి రాళ్లు వేయిస్తామని అప్పటి ఈవో వందరాళ్లు కొనుగోలు చేశారు. ఆలయం వద్దనే ప్రస్తుతం రాళ్లు ఉన్నాయి. స్వామి భూముల సర్వే చేయలేదు. రాళ్లు వృథాగానే పడి ఉన్నాయి.

కమిటీ వస్తేనే

ఆలయానికి పాలకమండలి కమిటీ ఏర్పడితేనే కొంత వరకు సమస్యలు పరిష్కారమవుతాయని భక్తులు అంటున్నారు. చారిత్రక ప్రాశస్థ్యం కలిగిన ఆలయాన్ని అధికారులు, పూర్వపు పాలకమండళ్లు పట్టించుకోకపోవాన్ని భక్తులు ఆక్షేపిస్తున్నారు. ఈసారైనా బాధ్యతగా ఉండే పాలకమండలిని నియమించి, ఆలయ అభివృద్ధికి పాటుపడాలని గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు.


దశాబ్దాల నాటి నాపరాళ్లు

ఆలయం లోపలి భాగంలో చుట్టూ దశాబ్దాల క్రితం నాపరాళ్లు పరిచారు. ఇప్పటికీ అవే ఉన్నాయి. ఆలయం లోపల మొక్కుబడి ఉన్న భక్తులు తమ పిల్లల పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. ఈనాపరాళ్లపైనే కూర్చుని కల్యాణాలు చేసుకుంటున్నారు. నాపరాళ్ల మధ్య వేసిన సిమెంటు లేచిపోయి ఉన్నాయి. చిన్న చిన్న ఆలయాలకు కూడా గ్రానైట్‌, కనీసం పాలిష్‌ రాళ్లు వేస్తుంటే ఇక్కడ మాత్రం అధికారులు, పాలకమండళ్లు చూసీచూడనట్లు సర్దుకుపోతుంటాయని భక్తులు విమర్శిస్తున్నారు.

ఆలయం ముందు విశాలమైన స్థలం

ఆలయం ముందు భాగంలో విశాలమైన స్థలం ఉంది. రేకుల షెడ్లు వేయాలని గతంలో ప్రతిపాదనలు పెట్టినా ఆచరణలోకి రాలేదు. ఖాళీ స్థలంలో కూరగాయలు, ఇతర తినుబండారాలు అమ్ముకునే వారు రోజువారీ వ్యాపారం చేసుకుని వెళ్తున్నారు. పట్టించుకున్న వారు లేరు.

బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవాలకు స్పందన అంతంతమాత్రం

స్వామికి మూడేళ్లకోసారి ఏరువాక పౌర్ణమికి బ్రహ్మోత్సవాలు, ఏటా సంక్రాంతి సందర్భంగా గ్రామంలోని చెరువులో నీరుంటే తెప్పోత్సవాలు జరుపుతుంటారు. వాటికి గ్రామస్తులు అధికారులను బతిమలాడుకోవాల్సిందేనని భక్తులు వాపోతున్నారు. ఆలయ అధికారులను ఇవన్నీ అడుగుతామని, గ్రామంలోకి రాకుండా ముఖం చాటేసి తిరుగుతున్నారని గ్రామస్థులు అంటున్నారు. స్వామి కౌలు ఇస్తామన్నా, వచ్చి వసూలు చేసుకోవడం బద్ధకంగా మారిందని రైతులు తెలిపారు. ఆలయానికి ఇన్‌చార్జిలు నియమించడం వల్ల పట్టించుకోవడం లేదని ఆలయానికి పూర్తి స్థాయి ఈవోను నియమించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ప్రతిపాదనలు ఉన్నాయి

సాంబశివరావు, ఆలయ ఇన్‌చార్జి ఈవో

ఆలయం అభివృద్ధికి పలు ప్రతిపాదనలున్నాయి. ఆలయం ముందు భాగంలో రేకుల షెడ్లు నిర్మించాలి. భక్తుల సౌకర్యార్థం టాయిలెట్లు, వంటశాల, గదులు నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయి. కొత్త పాలకమండలి వచ్చాక ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం.

Updated Date - Dec 23 , 2025 | 11:24 PM