స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర మొక్కుబడి
ABN , Publish Date - Sep 21 , 2025 | 02:45 AM
జిల్లాలో శనివారం ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం మొక్కుబడిగా సాగింది. రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రతినెలా మూడో వారం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఒక్కో నెలలో ఒక్కో అంశానికి ప్రాధాన్యం ఇచ్చి తదనుగుణంగా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది.
మొక్కలు నాటడంపై కనిపించని ఉత్సాహం
మంత్రి స్వామి మినహా కీలక ప్రజాప్రతినిధులు డుమ్మా
పలుచోట్ల మమ అనిపించిన ఉద్యోగులు
ఒంగోలు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం మొక్కుబడిగా సాగింది. రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రతినెలా మూడో వారం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఒక్కో నెలలో ఒక్కో అంశానికి ప్రాధాన్యం ఇచ్చి తదనుగుణంగా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. జిల్లాల్లో మంత్రి స్థాయి నుంచి సర్పంచ్ వరకు, కలెక్టర్ నుంచి సచివాలయ ఉద్యోగి వరకు అందరూ భాగస్వాములు కావాలని ఆదేశిం చింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో ప్రతినెలా ఏదో ఒక జిల్లాలో పాల్గొంటున్నారు. అలా ఈసారి గ్రీన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్దేశించారు. పల్నాడు జిల్లా మాచర్లలో సీఎం స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనాలని ఆదేశించారు. అందుకోసం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు కూడా విరామం ఇచ్చారు. అంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అంతగా పట్టించుకోలేదు. జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ స్వామితోపాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు అధికారపార్టీ వారు ఉన్నారు. మరో రెండు చోట్ల నియోజకవర్గ ఇన్‌చార్జిలు అన్ని అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాగా శనివారం జరిగిన కార్యక్రమంలో మంత్రి డాక్టర్ స్వామి టంగుటూరులో పాల్గొన్నారు. కలెక్టర్ రాజాబాబు ఇతర అధికారులు అక్కడ హాజరయ్చారు. జిల్లాలో మిగిలిన ఐదుగురు అఽధికార పార్టీ ఎమ్మెల్యేలో ఒక్కరు కూడా ఆ కార్యక్రమాన్ని పట్టించుకోలేదు. మరికొందరు అసలు నియోజకవర్గానికే రాలేదు. ఇక వైపాలెం టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు, దర్శి ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిలు మాత్రం వారి పరిధిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జిల్లాలోని వివిధ పట్టణాలు, గ్రామాల్లో పేరుకు ఈ కార్యక్రమం జరిగినా అత్యధిక ప్రాంతాల్లో మొక్కుబడిగానే సాగినట్లు సమాచారం.