నిమజ్జనంపై నిఘా
ABN , Publish Date - Aug 30 , 2025 | 02:43 AM
గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం నిఘా నీడలో సాగనుంది. వినాయక చవితి పర్వదినం సందర్భంగా భక్తులు ఏర్పాటు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేసే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
తీరంలో పటిష్ట భద్రత
ఐదు డ్రోన్లు, సీసీ కెమెరాలు, ఫ్లడ్ లైట్లు
గజ ఈతగాళ్లు, నాటు పడవలు సిద్ధం
అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు
తీరాన్ని పరిశీలించిన ఎస్పీ దామోదర్
కొత్తపట్నం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి) : గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం నిఘా నీడలో సాగనుంది. వినాయక చవితి పర్వదినం సందర్భంగా భక్తులు ఏర్పాటు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేసే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఎక్కువ సంఖ్యలో తీరానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. తీరంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. అల్లర్లు, భక్తుల ఇబ్బందులను ఎప్పటికప్పుడు తెలుసుకుని చర్యలు చేపట్టేందుకు తీరంలో ఐదు డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా చర్యలు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం ఎస్పీ దామోదర్ కొత్తపట్నం తీరాన్ని సందర్శించారు. నిమజ్జనం జరిగే ఈ ప్రాంతంలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, బందోబస్తు చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. తీరం అంతటా ఆయన పర్యటించి వాహనాలను ఎక్కడి వరకు అనుమతించాలి, రోడ్డు నుంచి విగ్రహాలను ఏ ప్రాంతంలో సముద్రంలోనికి తీసుకుపోవాలనే విషయాలపై దిశానిర్దేశం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చిన్న పిల్లలు సముద్రంలోకి దిగకుండా చూడాలని కోరారు. నిర్దేశిత సమాయాల్లో మాత్రమే నిమజ్జనానికి విగ్రహాలను అనుమతించాలన్నారు. ఎవరైనా చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. భక్తులకు ఏదైనా ప్రమాదం జరిగే వెంటనే కాపాడేందుకు గజ ఈతగాళ్లను తీరంలో సిద్ధంగా ఉంచాలన్నారు. వాహనాల్లో డీజే సౌండ్స్‌ను అనుమతించవద్దన్నారు. అనంతరం ఎస్సీ దామోదర్ విలేకరుతో మాట్లాడుతూ నిమజ్జనం సందర్భంగా జిల్లావ్యాప్తంగా కొత్తపట్నం తీరంతోపాటు ఇతర తీరాలు, చెరువులు, నదులు, కాలువల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్పీ వెంట మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ రమణకుమార్, ఎస్బీ సీఐ రాఘవేంద్ర, ఒంగోలు టూటౌన్ సీఐ శ్రీనివాసరావు, కొత్తపట్నం ఎస్‌ఐ సుధాకర్, మెరైన్ ఎస్‌ఐ సుబ్బారావు తదితరులు ఉన్నారు.
తీరంలో వైద్యశిబిరం
నిమజ్జనాల సందర్భంగా వైద్యారోగ్యశాఖ వారు కొత్తపట్నం తీరంలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. అవసరమైన మందులను సిద్ధంగా ఉంచారు. పీహెచ్‌సీ వైద్యులు ఒకరు, ఇద్దరు ఎంఎల్‌హెచ్‌పీలు, ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఇద్దరు ఆశ కార్యకర్తలతోపాటు వైద్యాధికారి పర్యవేక్షణ చేస్తున్నారు. శిబిరాన్ని శుక్రవారం కొత్తపట్నం వైద్యాధికారి డాక్టర్ శ్రావ్య పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిమజ్జనాలు పూర్తయ్యేవరకు ఈ వైద్య శిబిరం కొనసాగుతుందని ఆమె తెలిపారు.