ఆటో డ్రైవర్లకు అండగా
ABN , Publish Date - Oct 04 , 2025 | 10:26 PM
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నామని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆటోడ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం సందర్భంగా ఆయన ఆటో డ్రైవర్లతో కలిసి ఆటోనడిపారు.
అర్హులకు రూ.15వేలు చొప్పున జమ 8 ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
గిద్దలూరులో భారీ ర్యాలీ, ఆటో నడిపిన ఎమ్మెల్యే
గిద్దలూరు టౌన్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నామని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆటోడ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం సందర్భంగా ఆయన ఆటో డ్రైవర్లతో కలిసి ఆటోనడిపారు. ఆటోల భారీ ర్యాలీ నిర్వహించగా పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్ నుంచి కుమ్మరాంకట్ట, రైల్వేస్టేషన్, రాచర్లగేటు సెంటర్ నుంచి మార్కెట్‌యార్డు వరకు కొనసాగింది. ర్యాలీ ముందు భాగంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆటో నడుపుతూ వెళ్లారు. అనంతరం మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశోక్‌రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనలో ఆటోడ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు ప్రజాప్రభుత్వం వారి రుణభారం తగ్గించే దిశగా అండగా ఉండేలా పథకం అమలు చేసిందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాన్ ముందుకు సాగుతున్నారన్నారు. అర్హులైన ఆటో డ్రైవర్లకు ఒకొక్కరికీ రూ.15వేల చొప్పున ఆర్ధిక సాయం అందచేస్తున్నట్లు తెలిపారు. ఈ నియోజకవర్గంలో 1211 మంది ఆటో డ్రైవర్లకు రూ.1,81,65,000 వారి ఖాతాలలో జమ చేసినట్లు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది బీసీలు, ఎస్సీలు ఉన్నట్లు తెలిపారు. ఈసందర్భంగా ఆటోడ్రైవర్లకు ఆయన రూ.1.81కోట్ల చెక్కును అందచేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ ఎం.వెంకట శివరామిరెడ్డి, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ మాధవరావు, మున్సిపల్ కమిషనర్ ఈవీ రమణబాబు, తహసీల్దార్ ఆంజనేయరెడ్డి, మున్సిపల్ చైర్మన్ పాముల వెంకటసుబ్బయ్య, జడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్, సొసైటీ బ్యాంక్ చైర్మన్ దుత్తా బాలీశ్వరయ్య, రాష్ట్ర గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కటికె యోగానంద్, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ డైరెక్టర్ గోన చెన్నకేశవులు, పట్టణ పార్టీ అధ్యక్షులు సయ్యద్ షానేషావలి, మండలపార్టీ అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి, జనసేన నాయకులు లంకా నరసింహారావు, బీజేపీ నాయకులు పిడతల రమే్‌షరెడ్డి, నాయకులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సే లక్ష్యం : ఎమ్మెల్యే కందుల
మార్కాపురం రూరల్ : ఆటో డ్రైవర్‌లకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి మార్కెట్ యార్డు వరకు ఆటో డ్రైవర్లతో కలిసి శనివారం భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల ఆటో నడిపి ఉత్సాహపరిచారు. అనంతరం మార్కెట్ యార్డులో ఆటో డ్రైవర్ల సేవలో పథక ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. అన్నివర్గాల ప్రజల శ్రేయస్సు కోసం చంద్రబాబు పరితపిస్తున్నారన్నారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని, ఖజానాను వైసీపీ పాలకులు గుల్ల చేశారరని కందుల ధ్వజమెత్తారు. అప్పుల ఆంధ్రాను గాడిలో పెట్టడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని చంద్రబాబు పరుగుపెట్టిస్తున్నారని అన్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయి ప్రజలు సంతోషంగా ఉన్నారని కందుల అన్నారు. నియోజకవర్గంలో 1831 మంది ఆటో, రిక్షా, క్యాబ్ డ్రైవర్‌లకు రూ.2కోట్ల 74లక్షల 65వేల చెక్కును లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట్ త్రివినాగ్, ఆర్టీవో శ్రీచందన, తహసీల్దార్ చిరంజీవి, ఎంవీఐ మాధవరావు, జనసేన నియోజక వర్గ ఇన్‌చార్జి ఇమ్మడి కాశీనాథ్, మార్కెట్ యార్డు చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, టీడీపీ నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున, మండల పార్టీ అధ్యక్షుడు కాకర్ల శ్రీనివాసులు, బీజేపీ నాయకుడు పీవీ క్రిష్ణారావు పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్ల సేవకు 151మంది ఎంపిక
రాచర్ల : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఆటో డ్రైవర్ల సేవ పథకానికి మండలం నుంచి 151మంది ఆటోవాలాలు ఎంపికైనట్లు ఎంపీడీవో ఎస్.వెంకటరామిరెడ్డి తెలిపారు. మండలం నుంచి దాదాపు 168మంది ఆటో డ్రైవర్లు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోగా 151 మంది ఎంపికైనట్లు తెలిపారు. ఆకవీడు -1 26, ఆకవీడు -2 3, చోళ్లవీడు 10, చిన్నగానిపల్లి 4, జేపిచెరువు 3, గౌతవరం, అనుములపల్లి 11, రాచర్ల-1 16, రాచర్ల-2 6, అనుములవీడు 27, సోమిదేవిపల్లి 10, గుడిమెట్ట, ఒద్దులవాగుపల్లి 11, ఎడవల్లి 3, సత్యవోలు 21మంది ఎంపికైనట్లు ఆయన తెలిపారు. 17మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.
ఎర్రగొండపాలెం : ప్రతి పేద కుటుంబానికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయమని ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ఆటో డ్రైవర్లకు అండగా ఉండేలా శనివారం రూ.15వేలు జమ చేసిన సందర్భంగా శనివారం ర్యాలీని ప్రారంభించి అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడారు. ఎన్నికల హామీలో లేనప్పటికీ ఆటోవాలాలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించినట్లు చెప్పారు. నియోజకవర్గంలో ఆటోడ్రైవర్ల సేవా పథకం కింద 1073 మంది ఆటో డ్రైవర్ల రూ.1,60,95000 జమ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఐదు మండలాల టీడీపీ అధ్యక్షులు, నియోజకవర్గ టీడీపీ నాయకులు, నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లు ఆటోలతో ర్యాలీలో పాల్గొని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.