Share News

మళ్లీ భగభగలు

ABN , Publish Date - Jun 05 , 2025 | 01:23 AM

జిల్లాపై రోహిణి కార్తె ప్రభావం బుధవారం కనిపించింది. ఎండల తీవ్రత పెరిగింది. పలుచోట్ల 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోతతో జనం అవస్థ పడ్డారు, సాధారణంగా రోహిణి కార్తెలో ఎండలు అధికంగానే ఉంటాయి.

మళ్లీ భగభగలు

40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు

జిల్లాలో ఒక్కసారిగా పెరిగిన ఎండల తీవ్రత

రుతుపవనాలు మందగించడంతో వాతావరణంలో మార్పు

ఒంగోలు, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి) : జిల్లాపై రోహిణి కార్తె ప్రభావం బుధవారం కనిపించింది. ఎండల తీవ్రత పెరిగింది. పలుచోట్ల 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోతతో జనం అవస్థ పడ్డారు, సాధారణంగా రోహిణి కార్తెలో ఎండలు అధికంగానే ఉంటాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతుంటాయి. అయితే ఈ ఏడాది వాతావరణం మారింది. రోహిణి కార్తెకు ముందు భారీగా వానలు కురిశాయి. కార్తె వచ్చాక కూడా జల్లులు పడ్డాయి. దీనికితోడు ఈసారి రుతుపవనాలు కూడా ముందే వచ్చాయి. దీంతో ఎండల ప్రభావం తొలుత కనిపించలేదు. వారంరోజుల పాటు సాధారణంగా ఈ సమయంలో ఉండే ఉష్ణోగ్రతలు దాదాపు ఆరేడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. ఒక రకంగా ఈ ఏడాది వేసవి ఇంతటితో ముగిసినట్లుగానే నాలుగు రోజుల క్రితం వరకు పరిస్థితి ఉంది. అయితే ముందుగా వచ్చి వేగంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం మందగించినట్లు సమాచారం. దాని వల్ల పొడి వాతావరణం ఏర్పడి మళ్లీ ఎండల తీవ్రత పెరుగుతోంది. జిల్లాలో రెండు, మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం తీవ్రత మరింత అధికమైంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండ మండింది. జిల్లాలోని కొన్నిచోట్ల రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఒంగోలు నగరంలో 38.80 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైంది. మూడు గంటలకు జిల్లాలోని ఇతర ఐదారు చోట్ల 40 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. దాదాపు పది ప్రాంతాలకుపైగా 39 నుంచి 40 డిగ్రీలు నమోదయ్యాయి. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో జిల్లాలో అత్యఽధికంగా పామూరు మండలం బొట్లగుడూరులో 39.98 డిగ్రీలు నమోదైంది. ఇంచుమించు సగం ప్రాంతాల్లో 38 డిగ్రీలకుపైగా ఉన్నాయి. సాయంత్రం ఐదు గంటల వరకు చాలాచోట్ల ఎండల తీవ్రతకుతోడు ఉక్కపోత కూడా అధికంగా కనిపించింది.

Updated Date - Jun 05 , 2025 | 01:23 AM