రైతులకు అండ అన్నదాత సుఖీభవ
ABN , Publish Date - Nov 19 , 2025 | 10:33 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధితోనే సుపరిపాలన అందిస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. స్థానిక మార్కెట్‌యార్డు ఆవరణలో అన్నదాత సుఖీభవ, ప్రధానమంత్రి కిసాన్ 2వ విడత పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని నియోజకవర్గంలోని 37,649 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5వేల చొప్పున రూ.18.82కోట్లను చెక్కును పంపిణీ చేశారు.
సంక్షేమం, అభివృద్ధితోనే సుపరిపాలన
నియోజకవర్గంలో 37,649 మంది రైతులకు
చెక్కుల పంపిణీలో : ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
గిద్దలూరు టౌన్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధితోనే సుపరిపాలన అందిస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. స్థానిక మార్కెట్‌యార్డు ఆవరణలో అన్నదాత సుఖీభవ, ప్రధానమంత్రి కిసాన్ 2వ విడత పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని నియోజకవర్గంలోని 37,649 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5వేల చొప్పున రూ.18.82కోట్లను చెక్కును పంపిణీ చేశారు. పీఎం కిసాన్ ద్వారా 32,762 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున రూ.6.55 కోట్ల మొత్తం కలిపి నియోజకవర్గంలో రూ.25.38కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తూ అందుకు సంబంధించి చెక్కును రైతులకు అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ భూ యజమానులతోపాటు కౌలు రైతులకు కూడా ఈపథకం అందజేస్తున్నట్లు చెప్పారు. గత ఆగస్టులో మొదటి విడత, ఇప్పుడు 2వ విడత నగదును అందించి రైతులకు ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. అన్నదాతల శ్రమే రాష్ట్రానికి ఆర్థిక బలమన్నారు. రైతులు కూడా సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని, తద్వారా పంట దిగుబడితోపాటు ఆర్థిక రాబడి బాగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఎం.వెంకట శివరామిరెడ్డి, గిద్దలూరు, కంభం మార్కెట్‌యార్డు చైర్మన్లు బైలడుగు బాలయ్య, పూనూరు భూపాల్‌రెడ్డి, తహసీల్దార్ ఆంజనేయరెడ్డి, ఎంపిడిఒ సీతారామయ్య, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ధ్యేయం : ఎమ్మెల్యే కందుల
తర్లుపాడు : రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. తర్లుపాడు సచివాలయంలో అన్నదాత సుభీవ చెక్కు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికి రైతు సంక్షేమమే ధ్యేయంగా పథకాలను అమలు చేస్తోందన్నారు. మార్కాపురం నియోజకవర్గంలో 32,965 రైతులకు రూ.22కోట్ల30లక్షల నగదును రైతుల అకౌంట్‌లో జమ అయినట్లు తెలిపారు. మార్కాపురం మండలంలో 9,278 మంది రైతులకు రూ.6కోట్ల 20లక్షలు, కొనకనమిట్ల మండలానికి 9,061 మంది రైతులకు రూ.6కోట్ల13లక్షలు, పొదిలి మండలానికి 8,436 మందికి రూ.5కోట్ల74లక్షలు, తర్లుపాడు మండలానికి 6,190 మంది రైతులకు రూ.4కోట్ల 22లక్షలు నిధులను రైతుల అకౌంట్లలో జమ అవుతున్నట్లు ఆయన పెర్కొన్నారు. వైసీపీ నాయకులు ప్రభుత్వంపై ద్రుష్పచారం చేస్తున్నారని అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో వైసీపీ ఊరూరా తిరగడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మార్కాపురం నియోజకవర్గంలో గ్రీన్‌ఫీల్డ్ హైవే దాదాపు 50 కిలో మీటర్లు ఉండాల్సిందని, కానీ వైసీపీ నాయకుల స్వార్థంతో వారి స్వలాభం కోసం దానిని 3 కిలోమీటర్లు మాత్రమే పరిమితం చేశారన్నారు. 1 ఎకరం గ్రీన్‌ఫీల్డ్ హైవే ఉంటే రూ.50 లక్షలు పైగా ధర పలుకుతుందన్నారు. మార్కాపురాన్ని జిల్లా చేయకుండా నిర్లక్ష్యంగా చేయడంతోపాటు వెలిగొండను గాలికొదిలేశారన్నారు. త్వరలో తుఫాన్‌కు దెబ్బతిన్న 8,500 ఎకరాల పంటలకు నష్ట పరిహారం చెల్లిస్తామన్నారు. అనంతరం రైతులకు మంజూరైన 2 పంట డ్రోన్‌లను, పిచికారీ యంత్రాలను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఏడీఏ బాలాజీ నాయక్, తహసీల్దార్ కేకే.కిషోర్ కుమార్, ఎంపీడీవో బి.చంద్రశేఖర్, నాలుగు మండలాల వ్యవసాయ అధికారులు, ఉద్యాన అధికారి రమేష్, మార్కాపురం ఏఎంసీ చైర్మన్ మాలపాటి వెంకట్, మార్కాపురం నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి పీవీ కృష్ణారావు, మండల పార్టీ అధ్యక్షుడు ఉడుముల చిన్నపరెడ్డి, మార్కాపురం, తర్లుపాడు సొసైటీ ఛైర్మన్లు వెంకటేశ్వర రెడ్డి, వెలుగు కాంత్రికుమార్, టీడీపీ నాయకులు కంచర్ల కాశయ్య, కాలంగి శ్రీనివాసులు, గోపినాధ్ చౌదరి, మేకల వెంకట్ పాల్గొన్నారు.
39,274 మంది రైతులకు రూ.26.29కోట్ల లబ్ధి
టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు
గురిజేపల్లిలో రైతులతో కలిసి ప్రత్యక్షప్రసారం వీక్షణ
ఎర్రగొండపాలెం రూరల్ : అన్నదాతకు అండగా ఉండేందుకు, పంట సాయం చేసేందుకు అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ప్రజా ప్రభు త్వం వచ్చాక రెండో విడత అన్నదాత సుఖీభవ కింద రూ.5వేలు, కేంద్ర సాయం రూ.2వేల నగదును రైతులకు జమచేసిందన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచిస్తున్నారన్నారు. ఇటు రైతులతోపాటు అటు నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 39,274 మంది రైతులకు రూ.26.29కోట్ల నగదు జమ అయిందన్నారు. తమిళనాడులో ప్రధాని మోదీ, కడపలో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల ప్రత్యక్ష ప్రసారాన్ని ఎరిక్షన్‌బాబు రైతులతో కలిసి వీక్షించారు. ముందుగా సమీప పంట పొలాలను వ్యవసాయాధికారులు, నాయకులతో కలసి ఆయన పరిశీలించారు. అక్కడే రైతులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకులు వెంకటరమణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరి సుబ్బారావు, ఎంపీడీవో బండారు శ్రీనివాసులు, పార్టీ మండల అధ్యక్షుడు చిట్యాల వెంగళరెడ్డి, ఎర్రగొండపాలెం, దోర్నాల, త్రిపురాంతకం మండలాల ఏవోలు నీరజ, జవహర్‌లాల్‌నాయక్, సంగమేశ్వరరెడ్డి, నాయకులు కందుల నారాయణరెడ్డి, పేరం రమణారెడ్డి, ఎంసీహెచ్ మంత్రునాయక్, వేగినాటి శ్రీను, నాగేశ్వరరావు, కిషోర్ పాల్గొన్నారు.
6,309మంది రైతులకు రూ.4.10కోట్ల లబ్ధి
పెద్ద దోర్నాల : కష్టకాలంలో ఎదురీదుతున్న రైతులకు ప్రభుత్వాలు అండగా నిలిచాయి. అన్నదాత సుఖీభవ ద్వారా రూ.5,000, పీఎం కిసాన్ కింద రూ.2,000 కలిపి మొత్తం రూ.7వేలు బుధవారం రైతుల ఖాతాలో జమ చేశాయి. దీంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొంథా తుఫాన్‌తో నష్టపోయిన పంటలు, పొలాలు బాగు చేసుకునేందుకు అన్నదాత సుఖీభవ డబ్బులు కలిసివస్తాయని రైతులు అంటున్నారు. మండలంలో 6,309 మంది రైతులు రూ.4.10కోట్ల లబ్ధి చేకూరినట్లు ఏవో జవహర్‌లాల్‌నాయక్ తెలిపారు.
8,436 మంది రైతులకు జమ
పొదిలి : మండలంలో 8,436 మంది రైతులకు రూ.5.47కోట్లు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ రెండవ విడత నగదు జమ అయినట్లు ఏవో డీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని రైతులందరూ వీక్షించేలా రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్రం రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేలు మొతం్త రూ.7వేలు రైతుల ఖాతాల్లో జమ అయినట్లు తెలిపారు.