Share News

లక్ష్యాల మేరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి

ABN , Publish Date - Apr 15 , 2025 | 11:58 PM

ఎస్సీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాల కింద ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా చెప్పారు.

లక్ష్యాల మేరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

జిల్లాకు 1,305 యూనిట్లు మంజూరు

ఎస్సీ నిరుద్యోగ యువత ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట

కలెక్టర్‌ తమీమ్‌అన్సారియా ఆదేశం

ఒంగోలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి) : ఎస్సీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాల కింద ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా చెప్పారు. అందుకోసం బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాచరణ ప్రణాళిక 2025-26 కింద ఓబీఎంఎంఎస్‌ స్వయం ఉపాధి పథకాల అమలుపై మంగళవారం జరిగిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులకు స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం రూపొందించిందన్నారు. రూ.54.60 కోట్లతో జిల్లాకు 1,305 యూనిట్లు మంజూరు కాగా అందులో రూ.21.58 కోట్లు సబ్సిడీ కాగా రూ.30.29 కోట్లు బ్యాంకు రుణాలు ఇస్తాయని చెప్పారు. మిగిలిన మొత్తం లబ్ధిదారులు కట్టాల్సి ఉంటుందన్నారు. అర్హత కలిగిన ఎస్సీ లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేస్తూ బ్యాంకులకు కేటాయించిన రుణాల మంజూరును సకాలంలో పూర్తి చేయాలన్నారు.

వచ్చే నెల 13లోపు గడువు

ఈనెల 14 నుంచి వచ్చేనెల 13వ తేదీ వరకు నెల రోజుల పాటు ఆన్‌లైన్‌లో అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ అర్జున్‌ నాయక్‌, ఎల్‌డీఎం రమేష్‌, బ్యాంకు అధికారులు ఉన్నారు.

Updated Date - Apr 15 , 2025 | 11:58 PM