చెట్ల కింద చదువులు
ABN , Publish Date - Jul 21 , 2025 | 10:25 PM
మండలంలోని సుంకరవారిపాలెం ఉన్నత పాఠశాలలో గదులు కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలీచాలని గదులతో చెట్ల కింద, రేకుల షెడ్డు కింద విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ పాఠశాలను ఇటీవలే హైస్కూల్‌గా అ్‌ప్రగేడ్ చేశారు.
గదులు లేక విద్యార్థుల అగచాట్లు
ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ కావటంతో కొరత
సుంకరవారిపాలెం ఉన్నత పాఠశాల తీరు ఇది
ముండ్లమూరు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సుంకరవారిపాలెం ఉన్నత పాఠశాలలో గదులు కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలీచాలని గదులతో చెట్ల కింద, రేకుల షెడ్డు కింద విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ పాఠశాలను ఇటీవలే హైస్కూల్‌గా అ్‌ప్రగేడ్ చేశారు. దీంతో గదుల కొరత ఏర్పడింది. ఒకటి నుంచి 9వ తరగతి వరకు 164 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి కేవలం నాలుగైదు గదులు మాత్రమే ఉన్నాయి. దీంతో పాఠశాల ఆవరణలో ఉన్న చెట్టు కింద చదువు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, పాఠశాలకు ఆనుకొని రేకుల షెడ్లు ఏర్పాటుచేశారు. అవీచాలక గదులు పక్కన ఉన్న వరండాలో విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లులేక పాఠశాల ఆవరణలోనే ఇరుకు గదుల్లో విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. గతంలో సుంకరవారిపాలెం యూపీ పాఠశాల వరకు ఉండటంతో అందుకనుగుణంగా గదులు ఏర్పాటుచేశారు. ప్రస్తుతం పాఠశాల స్థాయి పెరగటంతో గదుల కొరత ఏర్పడింది. విద్యాశాఖ అధికారులు స్పందించి అదనపు గదులు మంజూరు చేయించి విద్యార్థుల ఇబ్బందులను తొలగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.