Share News

మత్తుకు చిత్తు

ABN , Publish Date - Jul 26 , 2025 | 01:31 AM

బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాల్సిన విద్యార్థులు మత్తుకు చిత్తవుతున్నారు. పూర్తిగా బానిసలై డబ్బుల కోసం దొంగలుగా మారుతున్నారు. తల్లిదండ్రుల ఆశలపై నీళ్లుచల్లి కొందరు గంజాయి, డ్రగ్స్‌, ఇతర మత్తుపదార్థాల విక్రయాలు చేస్తూ జులాయిలుగా మారుతున్నారు. పోలీసులకు దొరికిపోయి జైళ్ల పాలవుతున్నారు.

మత్తుకు చిత్తు

పెడదారిపడుతున్న విద్యార్థులు

యూట్యూబ్‌లో చూసి మోటార్‌ సైకిళ్ల చోరీలు

ఆరునెలల్లో మద్యం సేవించి పట్టుబడిన 35మంది

గంజాయి వాడకం, విక్రయాల్లో మైనర్లు

ఒంగోలు క్రైం, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాల్సిన విద్యార్థులు మత్తుకు చిత్తవుతున్నారు. పూర్తిగా బానిసలై డబ్బుల కోసం దొంగలుగా మారుతున్నారు. తల్లిదండ్రుల ఆశలపై నీళ్లుచల్లి కొందరు గంజాయి, డ్రగ్స్‌, ఇతర మత్తుపదార్థాల విక్రయాలు చేస్తూ జులాయిలుగా మారుతున్నారు. పోలీసులకు దొరికిపోయి జైళ్ల పాలవుతున్నారు. మొత్తంగా చిన్న వయసులోనే మత్తుకు బానిసలై వీధుల వెంట మోటారు సైకిళ్లపై రయ్‌ రయ్‌మంటూ తిరుగుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ప్రధానంగా ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులు ఎక్కువగా దారితప్పడం గమనార్హం. ఇందుకు ఇటీవల బాపట్ల జిల్లా అద్దంకిలో పట్టుబడ్డ ఇంజనీరింగ్‌ విద్యార్థులే ఉదాహరణ. ఫైనలియర్‌ చదువుతున్న వారు మోటారు సైకిళ్ల దొంగలుగా మారడం ఆలోచించాల్సిన విషయం. అలాగే మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఆరు నెలల్లో 35మంది విద్యార్థులు పోలీసులకు పట్టుబడ్డారు. అలాగే మైనర్లు గంజాయి విక్రయాలు చేస్తూ దొరికిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ ఆందోళన కలిగించే అంశాలు. కాగా యువతపై సోషల్‌ మీడియా ప్రభావం అధికంగా కనిపిస్తోంది. చెడు వ్యసనాలకు బానిసలుగా మారేందుకు బాటలు వేస్తోంది.

యూట్యూబ్‌ చూసి దొంగలుగా మారారు

వివిధ ప్రాంతాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఒంగోలులో అద్దె రూంలో ఉంటూ ఓ ప్రైవేటు కాలేజీలో ఇంజనీరింగ్‌ చదువుతున్నారు. మరో ఆరునెలల్లో బీటెక్‌ పట్టా చేతికి అందుతుంది. అయితే చెడు అలవాట్లకు బానిసలయ్యారు. వ్యసనాలకు, విలాసాలకు డబ్బు అవసరం పెరిగింది. దీంతో సులువుగా డబ్బు సంపాదించడం ఎలా అనే అంశంపై యూట్యూబ్‌లో వెతికారు. బుల్లెట్‌ మోటార్‌ సైకిల్‌ను తాళం లేకుండా ఎలా నడపాలి అనే అంశం వారిని బాగా ఆకర్షించింది. దీంతో దొంగతనాల బాట పట్టారు. సునాయాసంగా తాళాలు వేసి ఉన్న బుల్లెట్లు దొంగిలించడం ప్రారంభించారు. అంతే బాపట్ల జిల్లా అద్దంకి ప్రాంతాన్ని దొంగతనాలకు అనువుగా ఎంచుకున్నారు. బాపట్ల, పల్నాడు జిల్లాల్లో 16 బైకులను ఎత్తుకెళ్లారు. పోలీసులకు పట్టుబడి జైలు పాలయ్యారు.

మద్యం సేవించి వాహనాలు నడుపుతూ..

ఆరు నెలలో 35మంది విద్యార్థులు జిల్లావ్యాప్తంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇంకా అనేకమంది ప్రమాదాలకు గురయ్యారు. అలాగే పోలీసులకు దొరకకుండా అనేకమంది మద్యం మత్తులో బైక్‌లపై చక్కర్లు కొడుతున్న వారు ఉన్నారు. అంతేకాదు మద్యం మత్తులో ఘర్షణలకు దిగి జైళ్లకు వెళ్ళిన వారూ ఉన్నారు.

గంజాయి విక్రయాల్లో విద్యార్థులు

గంజాయి మత్తుకు అలవాటు పడిన విద్యార్థులు విక్రయదారులుగానూ మారుతున్నారు. ఇటీవల జిల్లాలో ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్సు దాడుల్లో గిద్దలూరు ప్రాంతంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి గంజాయి విక్రయిస్తూ పట్టుపడ్డాడు. ఒంగోలులో ఓ హాస్టల్‌ విద్యార్థి గంజాయి అమ్ముతూ పట్టుబడ్డాడు. పొదిలి ప్రాంతానికి చెందిన ఆ విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఒంగోలు వచ్చి హాస్టల్‌లో ఉంటూ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు.

Updated Date - Jul 26 , 2025 | 01:31 AM