విద్యార్థులు సమాజ నిర్దేశకులుగా మారాలి
ABN , Publish Date - Dec 20 , 2025 | 01:37 AM
నేటి విద్యార్థులు భవిష్యత్ సమాజానికి నిర్దేశికులుగా మారాలని సమాచారశాఖ విశ్రాంత కమిషనర్ హీరాలాల్ సమారియా పిలుపునిచ్చారు. స్థానిక విష్ణుప్రియ కన్వెన్షన్ హాలులో శుక్రవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి.
సమాచారశాఖ విశ్రాంత కమిషనర్ సమారియా
అట్టహాసంగా ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు ప్రారంభం
ఒంగోలు కలెక్టరేట్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): నేటి విద్యార్థులు భవిష్యత్ సమాజానికి నిర్దేశికులుగా మారాలని సమాచారశాఖ విశ్రాంత కమిషనర్ హీరాలాల్ సమారియా పిలుపునిచ్చారు. స్థానిక విష్ణుప్రియ కన్వెన్షన్ హాలులో శుక్రవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సభకు సమారియా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం సాంకేతిక పురోగతితో అత్యంత వేగంగా ముందుకెళ్తున్నదని తెలిపారు. ప్రపంచ దేశాలలో నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. దేశంలో యువత చాలా శక్తివంతంగా ఉందని, వారంతా తమ సాంకేతిక నైపుణ్యాలతో దేశం పట్ల నిబద్ధతతో పనిచేయడం ద్వారా పురోగతికి సారథులు కావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం మారుమూల పల్లెలతో సహా అనేక ప్రాంతాల్లో సాంకేతిక విప్లవం కొనసాగుతుందని తెలిపారు. విద్యార్థి పరిషత్ కార్యకర్తలుగా మీరంతా దేశం కోసం పరిశ్రమించాలని కోరారు. మహాసభ ప్రారంభానికి ముందు ఏబీవీపీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ జాతీయ సహ సంఘటన కార్యదర్శి బాలకృష్ణ, స్వాగత సమితి అధ్యక్షుడు రమణారెడ్డి, కార్యదర్శి హనుమంతరావు, రాష్ట్ర కార్యదర్శి గోపీ, మీడియా ఇన్‌చార్జి రావులపల్లి నాగేంద్రయాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభలకు రాష్ట్రం నలుమూలల నుంచి ఏబీవీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.