Share News

ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Aug 26 , 2025 | 10:53 PM

దుకాణదారులు కావాలని ఎరువులు కృత్రిమ కొరత సృష్టించి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే అధిక రేట్లకు అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్‌ టీం సభ్యులు తహసీల్దార్‌ కృష్ణారెడ్డి హెచ్చరించారు.

ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
పొదిలిలో తనిఖీ చేస్తున్న తహసీల్దార్‌ కృష్ణారెడ్డి

రెండో రోజూ జోరుగా సోదాలు

మరో ఐదు దుకాణాల్లో తనిఖీ

పొదిలిలో 2.90 మెట్రిక్‌ టన్నుల స్టాక్‌ అమ్మకాల నిలిపివేత

పొదిలి, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి) : దుకాణదారులు కావాలని ఎరువులు కృత్రిమ కొరత సృష్టించి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే అధిక రేట్లకు అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్‌ టీం సభ్యులు తహసీల్దార్‌ కృష్ణారెడ్డి హెచ్చరించారు. పట్టణంలో ఉన్న 19 ఎరువుల దుకాణాల్లో గత రెండురోజులుగా దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం పట్టణంలో పాతూరులో మిగిలిన ఐదు దుకాణాల్లో తహసీల్దార్‌, వ్యవసాయాధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. కొన్ని ప్రైవేట్‌ ఎరువులు దుకాణాలను తనిఖీ చేయగా 2.90 మెట్రిక్‌ టన్నలకు సంబంధించిన రూ.31,900 విలువ గల ఎరువులకు సరైన పత్రాలు లేకపోవడంతో ఆ స్టాకు అమ్మకాలు నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. వ్యాపారులు రైతుల అవసరాలను గుర్తుంచి ఎలాంటి కొరతను లేకుండా ఎరువులను అందజేయాలన్నారు. కాదని ఇష్ట్టారీతిన అమ్మకాలు చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రతి కొనుగోలకు తప్పకుండా రసీదును అడిగి తీసుకోవాలని రైతులను కోరారు. నఖిలీ విత్తనాలు, పురుగుమందులు అమ్మినవారిపై చర్యలతోపాటు దుకాణం సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. అనుమతి ఉన్న గోడౌన్‌లలో ఉన్న స్టాకును ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, స్టాకు బోర్డ్‌లో రైతులకు తెలిసేలా అమర్చాలని చెప్పారు. ఈ తనిఖీల్లో వ్యవసాయధికారి డి శ్రీనివాసరెడ్డి, ఏఎ్‌సఐ సత్యనారాయణ పాల్గొన్నారు. ఇదిలావుండగా అధిక ధరలకు ఎరువుల అమ్మకాలు సాగుతున్నాయని రైతులు అంటున్నారు.

మార్కాపురం రూరల్‌ : మార్కాపురం పట్టణంలోని ఎరువుల దుకాణాల్లో మంగళవారం తహసీల్దార్‌ చిరంజీవి ఏవో బుజ్జిబాయి, పోలీసులతో కలసి తనిఖీలు చేశారు. ఎరువుల బస్తాల నిల్వలను పరిశీలించారు. రైతులకు ఎమ్మార్పీ ధరలకు విక్రయించాలని, ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గాయత్రి ట్రేడర్స్‌, సాయి భాగ్యలక్ష్మి ట్రేడర్స్‌ షాపులలో అనుమతి పత్రితం లేకపోవడంతో ఎరువుల విక్రయాలను నిలిపియాలని ఆదేశించారు.

తర్లుపాడు : తర్లుపాడులోని లక్ష్మీ సాయి ఎరువుల దుకాణాన్ని తహసీల్దార్‌ కేకే కిశోర్‌ కుమార్‌, వ్యవసాయాధికారి జోత్స్నాదేవి తనిఖీ చేశారు. దుకాణంలో ఉన్న స్టాక్‌, రిజిస్ట్రర్లను పరిశీలించారు. దుకాణాలలో ఉన్న ధరల పట్టికలను పరిశీలించి గోడౌన్‌లలో నిల్వ ఉన్న కాంప్లెక్స్‌ ఎరువులను తనిఖీ చేశారు. యూరియాను ఎవరైనా బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామమని ఏవో హెచ్చరించారు.

గిద్దలూరు టౌన్‌ : పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తహసీల్దార్‌ ఎం.ఆంజనేయరెడ్డి, ఏవో విజయభాస్కర్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. శ్రీకృష్ణ ట్రేడర్స్‌, చీతిరాల నాగేశ్వరరావు, శ్రీమణికంఠ రైతు డిపో దుకాణాలను, గోడౌన్లను తనిఖీ చేశారు. జీరో ఫామ్స్‌ లైసెన్సులో జతకానందున 16.2 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులను సుమారు రూ.3,15,600 విలువైన వాటిని అమ్మకాలు నిలుపుదల చేసినట్లు అధికారులు తెలిపారు.

ఎర్రగొండపాలెం : మండలంలోని మొగుళ్లపల్లి సచివాలయంలో పంపిణీకి సిద్ధంగా ఉన్న యూరియా స్టాక్‌ను ఏవో కే నీరజ మంగళవారం తనిఖీ చేశారు. స్టాక్‌ రిజిస్టర్‌ను తనిఖీ చేసి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఆ శాఖ సిబ్బంది ఉన్నారు.

పెద్ద దోర్నాల : ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. తహసీల్దార్‌తోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఏవో జవహర్‌లాల్‌నాయక్‌, పోలీసులు మండలంలోని నాలుగు ఎరువుల దుకాణాల్లో ఆకస్మికంగా సోదాలు చేపట్టారు. అనుమతులు లేని రూ.4,22,000 విలువైన 12.100 మెట్రిక్‌ టన్నుల ఎరువుల అమ్మకాలను నిలిపివేశారు. అనంతరం తహసీల్దారు మాట్లాడుతూ ఎంఆర్‌పీ ధరలకే విక్రయించాలని, రసీదులు ఇవ్వాలని దుకాణదారులకు సూచించారు.

రూ.2.67లక్షల స్టాక్‌ అమ్మకం నిలిపివేత

కొనకనమిట్ల : మండలంలోని ఎదురాళ్లపాడు, పెదారికట్ల గ్రామాలలోని ఎరువుల దుకాణాల్లో తహసీల్దార్‌ ఆవుల సురేష్‌, దర్శి వ్యవసాయ సహాయ సంచాలకులు కె.బాలాజీ నాయక్‌ తనిఖీలు చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ పెదారికట్ల ఎరువుల షాపులో రూ.2.67లక్షల విలువైన సల్ఫేట్‌, ఎంవోపి, పొటాష్‌ ఎరువులను సీజ్‌ చేసినట్లు చెప్పారు. అనుమతి లేనివి, ఎమ్మార్పీ ధరలకు మించి ఎరువులు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో వ్యవసా అధికారి ప్రకా్‌షరావు, ఏఎ్‌సఐ ముహ్మద్‌, పలువురు వ్యవసాయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

రాచర్ల : యూరియాను రైతులకు మాత్రమే అమ్మాలని వ్యవసాయ శాఖ అధికారి షేక్‌ మహబూబ్‌ బాషా అన్నారు. రాచర్లలోని రంగస్వామి ట్రేడర్స్‌, వెలిగొండ ట్రేడర్స్‌ ఎరుువుల షాపులను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ హర్షగౌడ్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ ఎల్లయ్య, షాపుల యజమానులు రంగస్వామి రెడ్డి, భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు.

త్రిపురాంతకం : మండలంలోని నడిగడ్డలో ఎరువుల దుకాణాలపై ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. మాధవి ట్రేడర్సులో 4 మెట్రిక్‌ టన్నుల ఎరువులు వ్యత్యాసం ఉండడంతో సీజ్‌ చేసి 6ఏ కేసు నమోదు చేశారు. వైష్ణవి ట్రేడర్సులో 35 మెట్రిక్‌ టన్నుల ఎరువులకు అనుమతి లేనందున అమ్మకాలను నిలిపివేశారు. కార్యక్రమంలో ఒంగోలు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంటు సీఐ రాఘవరావు, డీసీపీవో రామారావు, శివనాగప్రసాద్‌, ఏవో సంగమేశ్వరరెడ్డిలు పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2025 | 10:53 PM