Share News

లోగ్రేడ్‌ పొగాకు కొనుగోలుకు చర్యలు

ABN , Publish Date - Jul 03 , 2025 | 10:52 PM

లోగ్రేడ్‌ పొగాకును కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని బోర్డు ఈడీ విశ్వశ్రీ అన్నారు. పట్టణ సమీపంలోని పొగాకు వేలం కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

లోగ్రేడ్‌ పొగాకు కొనుగోలుకు చర్యలు

- ఈడీ విశ్వశ్రీ - కనిగిరి వేలం కేంద్రం తనిఖీ

కనిగిరి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): లోగ్రేడ్‌ పొగాకును కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని బోర్డు ఈడీ విశ్వశ్రీ అన్నారు. పట్టణ సమీపంలోని పొగాకు వేలం కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా రైతులు పొగాకు వేలంలో జరుగుతున్న అన్యాయాన్ని, సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. పొగాకు చివరి దశ సమయంలో అధిక వర్షాలు పడటంతో నాణ్యత తగ్గిందని తెలిపారు. రైతులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని లోగ్రేడ్‌ పొగాకను కూడా కొనుగోలు చేయాలని కోరారు. అనంతరం ఈడీ విశ్వశ్రీ పీసీపల్లి మండలం అలవలపాడు గ్రామంలోని పొగాకు రైతులను కలిశారు. ఇటీవల ఈగ్రామ రైతులు పొగాకు వేలాన్ని అడ్డుకొని నిరసన తెలిపారు. దీంతో ఆమె అలవలపాడులోని పొగాకు రైతులను కలిశారు. వారివద్ద ఉన్న పొగాకు బేళ్ళను పరిశీలించారు. వారివద్ద మేలు రకం పొగాకు సగం పైగా ఉందని ఆమె గుర్తించారు. మేలు రకం పొగాకును వేలానికి ఎందుకు తరలించలేదని ప్రశ్నించారు. మేలురకంతో పాటు లోగ్రేడ్‌ పొగాకును కూడా వేలానికి తీసుకువచ్చామని ఈడీకి వివరించారు. మేలు రకం కొనుగోలు చేసి లోగ్రేడ్‌ నోబిడ్‌ చేస్తుండటంతో నష్టపోతున్నామని తెలిపారు. ఈసందర్భంగా ఈడీ విశ్వశ్రీ మాట్లాడుతూ పొగాకు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపామని తెలిపారు. నోబిడ్‌ కొనుగోలుపై సానుకూల నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. ఈలోగా మేలు రకం అమ్ముకుంటే కొంత ఆర్థికంగా తోడ్పాటుతో పాటు పొగాకు చెడిపోకుండా ఉంటుందని రైతులకు సూచించారు. ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పారు. ఆమె వెంట కనిగిరి పొగాకు వేలం కేంద్రం ఆక్షన్‌ ఆఫీసర్‌ కోటేశ్వరరావు, ఎఫ్‌వో అనిత, ఆక్షన్‌ మేనేజర్‌ రామాంజనేయులు ఉన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 10:52 PM