అడుగు పడింది!
ABN , Publish Date - Sep 09 , 2025 | 01:30 AM
మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 2026 ఆగస్టుకల్లా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పశ్చిమ ప్రకాశంలో కీలకమైన వైద్య కళాశాలను కూడా పూర్తిచేసేందుకు అడుగు ముందుకు వేసింది.
మార్కాపురం మెడికల్ కాలేజీపై ప్రభుత్వం దృష్టి
పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు కేబినెట్ ఆమోదం
పశ్చిమ ప్రకాశానికి మరో మణిహారం
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పూర్తికాని వైనం
మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 2026 ఆగస్టుకల్లా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పశ్చిమ ప్రకాశంలో కీలకమైన వైద్య కళాశాలను కూడా పూర్తిచేసేందుకు అడుగు ముందుకు వేసింది. రాజధానిలో గత గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశం మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిరాదరణకు గురైన పశ్చిమ ప్రాంత అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ఏస్థాయిలో దృష్టిసారించిందో వీటిని బట్టి తెలుస్తోంది. ఇప్పటి వరకూ కొంత మేర మాత్రమే పూర్తయిన మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు ఇక ఊపందుకోనున్నాయి.
మార్కాపురం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 16 మెడికల్ కాలేజీల పనులను 2022లో ప్రారంభించింది. అప్పటికే రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కేంద్రం నుంచి సరైన అనుమతులు లేకపోయినా హడావుడిగా కాలేజీల నిర్మాణాలకు టెండర్లు పిలిచి అనుయాయులకు అప్పజెప్పారు. అందులో మార్కాపురం మెడికల్ కళాశాల ఒకటి. ఆర్భాటంగా అయితే ప్రారంభించారు కానీ నిధుల కేటాయింపులో మాత్రం వివక్ష చూపడంతో నిర్మాణ పనులు నత్తనడకన సాగాయి. దీన్ని బట్టి పశ్చిమ ప్రకాశంపై నాటి పాలకులకు ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుంది.
నాటి ప్రభుత్వ తాత్సారమే శాపం
మెడికల్ కాలేజీకి మార్కాపురం మండలం రాయవరం వద్ద అప్పటి వైసీపీ ప్రభుత్వం 50 ఎకరాలను కేటాయించింది. మొత్తం రూ.475 కోట్లతో బోధనాసుపత్రిని నిర్మించాల్సి ఉంది. 2022లోనే అన్ని కాలేజీలకు ఆన్‌లైన్ ద్వారా శంకుస్థాపన చేసినా నిర్మాణ కాంట్రాక్ట్ సంస్థ 2023 ఫిబ్రవరిలో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అదే సంవత్సరం ఇక్కడ పనులు ప్రారంభించింది. కానీ మొదటి నుంచి పనులు నత్తనడకనే సాగాయి. 2024-25 విద్యాసంవత్సరంలో తరగతులు నిర్వహించాలని యోచించి పట్టణంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అప్పటికే ఉన్న 150 పడకలకు అదనంగా మరో 300 పడకలకు పెంచారు. ఆ పడకలు 2024 జూన్‌లో అందుబాటులోకి వచ్చాయి.
పూర్తిస్థాయిలో వివక్ష
వాస్తవానికి పొరుగునే ఉన్న నంద్యాలలో ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీ ఉంది. అంతేకాక వైద్య సదుపాయాలు కూడా అక్కడ మెరుగ్గానే ఉంటాయి. అక్కడికి దగ్గరలోనే కర్నూలు ప్రభుత్వ వైద్యశాల కూడా ఉంది. కానీ మార్కాపురంతోపాటు ప్రారంభించిన నంద్యాల ప్రభుత్వ వైద్య కాలేజీ పనులను చురుగ్గా చేపట్టి పూర్తిచేసి తరగతులు ప్రారంభించారు. కనీసం వంద కిలోమీటర్ల దూరం వెళ్తేకాని మెరుగైన వైద్యం దొరకని మార్కాపురంపై మాత్రం పూర్తిస్థాయిలో వివక్ష చూపారు. 2024 జూన్‌లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు కాలేజీని పరిశీలించి అడ్మిషన్లు చేపట్టడం కుదరదని తేల్చి చెప్పింది. అదే సంవత్సరం నవంబరులో కాంట్రాక్ట్ సంస్థ కాలేజీ వద్ద నుంచి సామగ్రిని తరలించింది.
కొన్ని పనులు ప్రారంభమే కాలేదు
మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణ పనులకు సుమారు రూ.8కోట్లు కేటాయించినా కాంట్రాక్ట్ సంస్థ రూ.3కోట్ల మేర పనులు మాత్రమే చేసింది. ఇంకా అక్కడ రూ.5కోట్ల మేర పనులు పెండింగ్‌లో ఉన్నాయి. మెడికల్ కాలేజీ వద్ద మొత్తం 28 రకాలైన నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉంది. వైద్యశాలకు సంబంధించిన పనులు పునాదుల స్థాయిలోనే నిలిచిపోయాయి. కాలేజీకి సంబంధించిన పనులు మాత్రం కొంతమేర జరిగాయి. విద్యార్థుల హాస్టల్ భవనాల ప్రగతి అంతంతమాత్రంగానే ఉంది. మిగిలిన వాటిల్లో ఓ 15 విభాగాలకు చెందిన పనులు అసలు ప్రారంభించలేదు. మొత్తం మీద కొంత మేర మాత్రమే పనులు జరిగాయి. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం మెడికల్ కళాశాలలపై దృష్టి సారించింది. వాటిని పీపీపీ పద్ధతిలో పూర్తిచేయాలని మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకుంది. త్వరలో ఆయా పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి.