ప్రబలుతున్న విషజ్వరాలు
ABN , Publish Date - Sep 10 , 2025 | 01:40 AM
దర్శి ప్రాంతంలో విష జ్వరాలు ఉధృతంగా ప్రబలుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటటాడుతున్నాయి. దర్శి ఏరియా ఆసుపత్రికి రోజుకు 200 మందికి పైగా ఓపీలు వస్తున్నాయి. కొంతమంది వైద్యం చేయించుకొని వెళ్తుండగా, జ్వరం తీవ్రంగా ఉన్న వారు అక్కడే చికిత్స పొందుతున్నారు.
ఆందోళన రేకెత్తిస్తున్న గున్యా
కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
దర్శి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : దర్శి ప్రాంతంలో విష జ్వరాలు ఉధృతంగా ప్రబలుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటటాడుతున్నాయి. దర్శి ఏరియా ఆసుపత్రికి రోజుకు 200 మందికి పైగా ఓపీలు వస్తున్నాయి. కొంతమంది వైద్యం చేయించుకొని వెళ్తుండగా, జ్వరం తీవ్రంగా ఉన్న వారు అక్కడే చికిత్స పొందుతున్నారు. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు, కలుషిత నీరు తాగటం వల్ల విషజ్వరాలు, టైఫాయిడ్ సోకుతున్నాయి. దోమల కారణంగా గున్యా, మలేరియా తదితర వ్యాధులు ప్రబలుతున్నాయి. పదేళ్ల క్రితం దర్శి ప్రాంతంలో గున్యా, మలేరియా, టైఫాయిడ్ విషజ్వరాలు ఉధృతంగా సోకాయి. గ్రామాలకు గ్రామాలే మంచంపట్టాయి. ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొంటున్నదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముండ్లమూరు మండలంలోని పూరిమిట్ల, పసుపుగల్లు గ్రామాల్లో అనేకమంది గున్యా, విష జ్వరాలతో మంచం పట్టిన విషయం విదితమే. దర్శి పట్టణంతోపాటు అనేక గ్రామాల్లో జ్వరాలు తీవ్రంగా ఉన్నాయి. ప్రధానంగా కలుషితనీరు తాగటం, మురుగునీరు నిల్వతో దోమలు కుట్టడంతో ఈ వ్యాధులు సోకుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. దర్శి ఎన్‌ఏపీ రక్షిత పథకం ద్వారా గ్రామాలకు మంచినీరు సరఫరా అవుతుంది. ఫిల్టర్‌బెడ్లు కొన్ని ఏళ్లుగా పనిచేయకపోవడంతో అనేక గ్రామాలకు నీటిని అలాగే విడుదల చేస్తున్నారు. ఫిల్టర్ చేయని కలుషిత నీరు తాగటంతో ఈ వ్యాధులు సోకుతున్నాయనే అనుమానాలు కల్గుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రక్షిత మంచినీటి పథకం గురించి పట్టించుకోకపొవటంతో అధ్వానంగా మారింది. ఏడు ఫిల్టర్‌బెడ్లు ఉండగా అందులో ఐదు పనిచేయటం లేదు. సుమారు 140 గ్రామాలకు నీరు అందించే ఈ పథకం అధ్వానంగా మారింది. ఆ పథకం ద్వారా సరఫరా అవుతున్న శుద్ధిచేయని నీరు తాగటం వల్ల రోగాల బారిన పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
శుభ్రమైన నీరు తాగాలి: డాక్టర్ ఆనందబాబు
వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో కలుషిత నీరు తాగటం వలన ప్రజలకు పలు రకాల వ్యాఽధులు సోకుతున్నాయి ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని తాగాలి. మురుగునీరు నిల్వ లేకుండా పరిసరాలు శుభ్రం చేసుకోవాలి. గృహాల్లో దోమకాటుకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి. దోమకాటుతో గున్యా, మలేరియా, టైఫాయిడ్ వంటి తీవ్ర జ్వరాలు సోకుతున్నాయి. కలుషిత నీరు తాగటం వల్ల విషజ్వరాలు సోకుతున్నాయి. ప్రజలు జ్వరం వచ్చిన వెంటనే ప్రాథమిక దశలోనే వైద్యం చేయించుకోవాలి. ఆరోగ్య సూత్రాలు పాటించాలి.