మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Sep 21 , 2025 | 02:43 AM
మహిళల ఆరోగ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. స్వస్త్ నారి సశక్త్ అభియాన్ (ఆరోగ్యవంత మైన మహిళ- శక్తివంతమైన కుటుంబం) అనే నినాదంతో జిల్లాలో వైద్యశాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా దీన్ని ప్రారంభించింది.
ఆరోగ్యవంతమైన మహిళ-శక్తివంతమైన కుటుంబం నినాదంతో వైద్య శిబిరాలు
అన్ని రకాల వైద్య పరీక్షలకు శ్రీకారం
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : మహిళల ఆరోగ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. స్వస్త్ నారి సశక్త్ అభియాన్ (ఆరోగ్యవంత మైన మహిళ- శక్తివంతమైన కుటుంబం) అనే నినాదంతో జిల్లాలో వైద్యశాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా దీన్ని ప్రారంభించింది. జిల్లాలో ఉన్న ఆయూస్మాన్ ఆరోగ్య మందిరాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, యుపీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా వైద్యశాలలు, జిల్లా వైద్యశాలలు కలిపి 634 కేంద్రాల్లో వైద్యశిబిరాలను నిర్వహించేందుకు వైద్యశాఖ చర్యలు తీసుకుంది. మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే కాకుండా పలురకాల వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితిని ముందుగానే గుర్తించి తగుజాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ కార్యక్రమం ద్వారా విస్తృతంగా రక్తదాన శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మహిళలకు సమయానుకూల వైద్యసేవలు అందించడంతోపాటు వారు పౌష్టికాహారాన్ని తీసుకునేలా ప్రోత్సహించడం ద్వారా ఆ కుటుంబాన్ని బలోపేతం చేయనున్నారు. ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబానికి ఆధారం అనే నినాదంతో ఈ కార్యక్రమాలను చేపట్టారు. వచ్చేనెల 2వతేదీ వరకు జరగనున్న ఈ ప్రత్యేక శిబిరాల్లో వైద్యనిపుణులు, పారా మెడికల్ సిబ్బంది పాల్గొంటారు. ప్రధానంగా ఈ వైద్యశిబిరాల్లో మహిళల్లో గుండె జబ్బులు, మధుమేహం, నోటి, గర్భాశయ క్యాన్సర్‌లను పరీక్షల ద్వారా గుర్తిస్తారు. తగిన వైద్య చికిత్సలతోపాటు రెఫరల్ సేవలను అందిస్తారు. మహిళలు, కిశోర బాలికల్లో రక్తహీనతను గుర్తించి తగిన చికిత్సలను అందిస్తారు. గర్భిణులను పరీక్షించి పోషకాహారం ఆవశ్యకతను వివరిస్తారు. రక్తహీనత ఉన్న వారికి చికిత్సలు చేసి ఎంసీపీ కార్డులు అందజేస్తారు. పిల్లల్లో సికిల్‌సెల్ అనీమియా గుర్తించి వారికి అవసరమైన వైద్యసేవలు అందించడంతోపాటు వ్యాధి నిరోధక టీకాలు వేస్తారు. ఇలా జిల్లావ్యాప్తంగా ఉన్న మహిళలతోపాటు కిశోర బాలికలను ఈ వైద్య పరీక్షల ద్వారా సంరక్షించేందుకు దోహదపడే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి.