నీటి వనరుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Sep 25 , 2025 | 02:33 AM
నీటి వనరుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పి.రాజాబాబు సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి నీటిబొట్టు ప్రజలకు ఉపయోగపడేలా చూడాలన్నారు. అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం నీటిపారుదల, ప్రాజెక్టుల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
అధికారులకు కలెక్టర్ రాజాబాబు ఆదేశం
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : నీటి వనరుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పి.రాజాబాబు సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి నీటిబొట్టు ప్రజలకు ఉపయోగపడేలా చూడాలన్నారు. అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం నీటిపారుదల, ప్రాజెక్టుల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని జలశయాలు, నిల్వ సామర్థ్యం, ప్రస్తుతం నిల్వ పరిమాణం, వాటి పరిధిలోని ఆయకట్టు వివరాలను ఇరిగేషన్ శాఖ ఎస్‌ఈ వరలక్ష్మి ఈ సందర్భంగా కలెక్టర్‌కు వివరించారు. వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టుల నిర్మాణ స్థితిగతులు, నిర్వహణ తీరును ప్రాజెక్టుల ఎస్‌ఈ అబుత్ అలీం తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని పరిస్థితుల దృష్ట్యా సాగర్, స్థానిక జలాశయాల్లోని నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన సేవలను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు కలెక్టరేట్‌లో శాశ్వత ప్రాతిపదికన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నీటి వనరుల నిర్వహణకు కూడా ఎప్పటికప్పుడు తెలు సుకునేందుకు జిల్లా వాటర్ మేనేజ్‌మెంట్ సిస్టం పేరుతో ప్రత్యేకంగా ఒక యాప్‌ను తయారు చేసి ఈ కేంద్రానికి అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ జలాశయాలను జియో కోఆర్డినేటర్స్ ఆధారంగా ఈ యాప్‌తో అనుసంధానం చేయాలన్నారు. తద్వారా నీటివనరుల నిల్వ వివరాలను ఎప్పటికప్పుడు తెలుస్తుందన్నారు. ఈ యాప్ ద్వారా జనలవరులశాఖలో పనిచేసే ఉద్యోగులు, ప్రధానంగా క్షేత్రస్థాయి సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండేందుకు అవకాశం ఉంటుందన్నారు. వివిధ జలాశయాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న మరమ్మతులు, ఇతర నిర్వహణ పనుల అంచనాలను రూపొందించాలన్నారు. మైనర్ చెరువుల్లోని మట్టిని స్థానికులు ఉచితంగా తీసుకెళ్లేందుకు అనుమతి కోసం రాష్ట్రప్రభుత్వానికి పంపేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేయాలని ఆదేశించారు. సాగర్ కాలువ ద్వారా దర్శి నుంచి పొదిలికి మంచినీళ్లు సరఫరా చేసే పైపులైన్ పనులు త్వరగా పూర్తిచేసేలా సంబంధిత కాంట్రాక్టర్‌తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇరిగేషన్, ప్రాజెక్టులు, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బాలశంకరరావు, ఇరిగేషన్, ప్రాజెక్టుల ఈఈలు, డీఈఈలు, భూగర్భ నీటి వనరులశాఖ డిప్యూటీ డైరెక్టర్ వందనం పాల్గొన్నారు.