Share News

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Aug 07 , 2025 | 02:34 AM

గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పారిశుధ్యం మెరుగుకు ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగా జిల్లాలో 250 గ్రామాలను ఎంపిక చేసి వాటిలో నిరంతర పర్యవేక్షణకు ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టం (ఐవీఆర్‌ఎస్‌) ద్వారా సర్వేకు సిద్ధమైంది.

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
ముండ్లమూరు మండలం కెల్లంపల్లిలో చెత్తసేకరణను పరిశీలిస్తున్న కలెక్టర్‌ అన్సారియా (ఫైల్‌)

ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కసరత్తు

ఎంపిక చేసిన 250 పంచాయతీల్లో ఐవీఆర్‌ఎస్‌ సర్వే

నిరంతరం అధికారుల పర్యటనలు

ఒంగోలు కలెక్టరేట్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పారిశుధ్యం మెరుగుకు ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగా జిల్లాలో 250 గ్రామాలను ఎంపిక చేసి వాటిలో నిరంతర పర్యవేక్షణకు ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టం (ఐవీఆర్‌ఎస్‌) ద్వారా సర్వేకు సిద్ధమైంది. ఈ విధానంలో ఎంపిక చేసిన గ్రామాల్లో కంప్యూటర్‌ ద్వారా రెండు ప్రశ్నలకు ప్రజల నుంచి సమాధానాలు రాబడ తారు. ప్రధానంగా మీ ఇంటి నుంచి చెత్త సేకరణ జరుగుతుందా? అని అడిగి సక్రమంగా జరగకపోతే అందుకు గల కారణాలను తెలుసుకొని తదనుగుణంగా చర్యలు తీసుకుం టారు. మరో ప్రశ్నగా వారానికి కనీసం రెండు సార్లయినా మీ ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్నారా? అని అడిగి తెలుసుకుంటారు. ఇలా ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ప్రజల నుంచి వచ్చే సమాధానాలను బట్టి సంబంధిత అధికారులకు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి సూచనలు ఇస్తారు.

అధికారుల నిరంతర పర్యవేక్షణ

జిల్లా పంచాయతీ అధికారి, జడ్పీ సీఈవోలు నిరంతరం పర్యవేక్షించడంతోపాటు మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం ఎనిమిది గంటలలోపు ఎంపిక చేసిన గ్రామాలను పరిశీలించాల్సి ఉంటుంది. అక్కడ ఐవీఆర్‌ఎస్‌పై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ఆ గ్రామపంచాయతీలో క్లాప్‌మిత్ర ఇంటి నుంచి చెత్త సేకరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారా? లేదా? అనేది ప్రజలను అడిగి తెలుసుకుంటారు. డిప్యూటీ ఎంపీడీవోలు, ఎంపీడీవోలు కూడా ఐవీఆర్‌ఎస్‌ గ్రామాల్లో పర్యటించాల్సి ఉంటుంది. ప్రధానంగా ఎంపిక చేసిన గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేరు చేసే విషయమై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది.

పంచాయతీలకు ఆదాయ కల్పన

గ్రామాలను స్వచ్ఛంగా ఉంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. సేకరించిన చెత్తను సంపద కేంద్రాలకు తరలించి ఆ గ్రామ పంచాయతీకి ఆదాయం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయడం ద్వారా గ్రామ పంచాయతీ ఆర్థిక పరిపుష్టి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చడం వలన ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఉంటారని, తద్వారా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతాయన్నది ప్రభుత్వ ఆలోచన.

Updated Date - Aug 07 , 2025 | 02:34 AM