Share News

జిల్లా సమగ్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Sep 13 , 2025 | 10:37 PM

జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తానని నూతన కలెక్టర్‌ పి.రాజాబాబు వెల్లడించారు. అందుకోసం జిల్లాలోని ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని తెలిపారు.

జిల్లా సమగ్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
బాధ్యతలు స్వీకరిస్తున్న నూతన కలెక్టర్‌ రాజాబాబు

వెలిగొండ, మౌలిక సదుపాయాలకు పెద్దపీట

ప్రజలకు ఉపయోగపడే విధంగా గత కలెక్టర్‌ తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తా

ప్రజలకు 24బై7 అందుబాటులో ఉంటా

నూతన కలెక్టర్‌ రాజాబాబు వెల్లడి

ఒంగోలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తానని నూతన కలెక్టర్‌ పి.రాజాబాబు వెల్లడించారు. అందుకోసం జిల్లాలోని ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని తెలిపారు. కలెక్టరేట్‌లో శనివారం ఉదయం కలెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముందుగా జిల్లా కలెక్టర్‌గా తనను నియమించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన దిశానిర్దేశం మేరకు జిల్లాలోని ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పొలిటికల్‌ గవర్నెన్స్‌పై ప్రత్యేక దృష్టిసారిస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ప్రజలకు 24 బై7 అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రభుత్వం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టిసారించానని తెలిపారు. జిల్లాలో గతంలో పనిచేసిన కలెక్టర్‌ ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకున్నారని, వాటిని కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. కాగా అంతకుముందు ఎన్‌ఎ్‌సపీ అతిథిగృహం వద్ద జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేషు, ఆర్డీవోలు లక్ష్మీప్రసన్న, కేశవర్థన్‌రెడ్డిలు నూతన కలెక్టర్‌కు ఘనస్వాగతం పలికారు. ముందుగా పూలమొక్కలను ఇచ్చి అభినందించారు. అక్కడి నుంచి నేరుగా కలెక్టర్‌ రాజాబాబు ఆయన కుటుంబసభ్యులతో కలిసి కలెక్టరేట్‌ చేరుకున్నారు. వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు ఆశీర్వచనాల మధ్య కలెక్టర్‌గా రాజాబాబు బాధ్యతలు స్వీకరించారు.

Updated Date - Sep 13 , 2025 | 10:37 PM