Share News

బకాయిల వసూలుకు ప్రత్యేక డ్రైవ్‌

ABN , Publish Date - May 24 , 2025 | 01:24 AM

ల్లాలో విద్యుత్‌ బకాయిల వసూలుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టినట్లు ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు చెప్పారు. స్థానిక ఈఈ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం రూ.600 కోట్ల మేర విద్యుత్‌ బకాయిలున్నాయన్నారు.

బకాయిల వసూలుకు ప్రత్యేక డ్రైవ్‌
విలేకరులతో మాట్లాడుతున్న విద్యుత్‌శాఖ ఎస్‌ఈవెంకటేశ్వర్లు, పక్కన మార్కాపురం ఈఈ నాగేశ్వరరావు

జిల్లాకు 10 సబ్‌ స్టేషన్‌లు మంజూరు

2,500 వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్‌ల దరఖాస్తులు పెండింగ్‌

విద్యుత్‌శాఖ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు

మార్కాపురం, మే 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో విద్యుత్‌ బకాయిల వసూలుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టినట్లు ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు చెప్పారు. స్థానిక ఈఈ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం రూ.600 కోట్ల మేర విద్యుత్‌ బకాయిలున్నాయన్నారు. అందులో పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులోని కీలకమైన రెండు టన్నెళ్ల తవ్వకానికి సంబంధించి రూ.100 కోట్ల మేర ఉన్నాయన్నారు. పలు ప్రభుత్వ శాఖలు కూడా పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉందని చెప్పారు. జిల్లాలో వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్‌ల కోసం 3,500 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు వెయ్యి ఏర్పాటు చేశామన్నారు. ఇంకా 2,500 ట్రాన్స్‌ఫారాలు ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం 300 ట్రాన్స్‌ఫారాలు జిల్లాకు వచ్చాయన్నారు. మార్కాపురం డివిజన్‌లోనే ఎక్కువ మొత్తంలో వాటి అవసరం ఉందని చెప్పారు. అదేవిధంగా జిల్లాకు 10 విద్యుత్‌ సబ్‌స్టేషన్లు మంజూరయ్యాయన్నారు. ఒంగోలు నగరంలో మంగమ్మ కాలేజీ, హౌసింగ్‌బోర్డు, టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెం, సంతనూతలపాడు మండలంలోని బూదవాడ, కందుకూరు మండలంలోని మన్నేటికోట, కనిగిరిలోని గార్లపేట రోడ్డు, కొమరోలు మండలంలోని కసినేపల్లి, రాచర్ల మండలంలోని మేడవారిపల్లి, పొదిలి మండలంలోని ఏలూరు, కురిచేడు మండలంలోని కల్లూరు, పుల్లలచెరువు మండలంలోని గండిబావిచెరువులకు సబ్‌స్టేషన్లు మంజూరయ్యాయని చెప్పారు. మరికొన్ని సబ్‌స్టేషన్ల నిర్మాణాల పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. మార్కాపురం మండలంలోని చింతగుంట్ల గ్రామం వద్ద హెచ్‌టీ విద్యుత్‌లైన్‌ తెగిపడి 19 గేదెలు మృతి చెందాయని, ఒక్కొక్కదానికి రూ.40 వేల చొప్పున నష్టపరిహారాన్ని యజమానులకు త్వరలో అందజేస్తామని చెప్పారు. ప్రధానమంత్రి సూర్యఘర్‌ యోజనను ప్రజలు సద్వినియోగం చేసునకోవాలని కోరారు. ప్రస్తుతం జిల్లాలో 1,250 మంది రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్యానళ్లను ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. ఈ పథకం అమలులో జిల్లా 8వ స్థానంలో ఉన్నదని చెప్పారు. సమావేశంలో మార్కాపురం ఈఈ నాగేశ్వరరావు, ఏడీఈ షియానాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2025 | 01:24 AM