Share News

అర్జీలపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Nov 05 , 2025 | 01:04 AM

ప్రతి రోజూ కార్యాలయానికి రాగానే ‘మీ కోసం’ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి స్థితిని పరిశీలించాలని కలెక్టర్‌ రాజాబాబు ఆదేశించారు. మీకోసం అర్జీల పరిష్కారమవుతున్న తీరుపై సంబంధిత విభాగ అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సమీక్షించారు.

అర్జీలపై ప్రత్యేక దృష్టి
మీకోసం అర్జీలపై సంబంధిత అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజాబాబు

వాటిని పరిశీలించడం దినచర్యగా పెట్టుకోవాలి

అధికారులకు కలెక్టర్‌ రాజాబాబు ఆదేశం

ఒంగోలు కలెక్టరేట్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రతి రోజూ కార్యాలయానికి రాగానే ‘మీ కోసం’ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి స్థితిని పరిశీలించాలని కలెక్టర్‌ రాజాబాబు ఆదేశించారు. మీకోసం అర్జీల పరిష్కారమవుతున్న తీరుపై సంబంధిత విభాగ అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సమీక్షించారు. అర్జీల ఆడిట్‌, సకాలంలో పరిష్కారం, రీఓపెన్‌ కాకుండా చూడటం, అర్జీదారులతో వ్యవహరించాల్సిన తీరు తదితరాలపై దిశానిర్దేశం చేశారు. సమస్యలను సకాలంలో సహేతుకంగా పరిష్కరించడంతోపాటు మాట్లాడే తీరు కూడా గౌరవప్రదంగా ఉండాలన్నారు. మీకోసం కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అర్జీదారులకు ఫోన్‌ చేసి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ, పంచాయతీ, విద్య, రోడ్లు భవనాల శాఖల అర్జీలు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయని మీకోసం విభాగ జిల్లా నోడల్‌ అధికారి మాధురి ఈ సందర్భంగా కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. సకాలంలో అర్జీలను పరిష్కరించడంలో జాప్యం చేస్తున్న విభాగాలు, అధికారుల వివరాలను ప్రతిరోజూ తన దృష్టికి తేవాలని ఆమెను కలెక్టర్‌ ఆదేశించారు. అర్జీలను పరిష్కరించడంలో జాప్యం చేస్తున్న హెచ్‌ఎంపాడు, పుల్లలచెరువు తహసీల్దార్లతో అక్కడిక్కడే ఫోన్‌లో మాట్లాడారు డీపీవో వెంకటేశ్వరరావు, డీఈవో కిరణ్‌కుమార్‌, అర్‌అండ్‌బీ ఎస్‌ఈ రవినాయక్‌లను కూడా తన చాంబర్‌కు పిలిపించి అర్జీల పరిష్కారంలో జాప్యం ఎంత మాత్రం సరికాదని, వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో మీకోసం అసిస్టెంట్‌ నోడల్‌ ఆఫీసర్‌ కృష్ణమోహన్‌, సూపరింటెండెంట్‌ నాగజ్యోతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2025 | 01:04 AM